Knight Frank India Affordable Index: 2023లో స్థిరాస్తి రంగం బాగా పుంజుకుంది, ముఖ్యంగా ఇళ్ల రేట్లు భారీగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ సర్వీసెస్ కంపెనీ నైట్‌ఫ్రాంక్ ఇండియా (Knight Frank India) రిలీజ్ చేసిన ‘అఫర్డబుల్ ఇండెక్స్’ (Affordable Index) ప్రకారం, ఇళ్ల ధరలకు సంబంధించి దేశంలోనే ఖరీదైన నగరం ముంబై. ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది.
మన దేశంలో చాలా మంది, తమ సొంతింటి కలను నిజం చేసుకోవడానికి హోమ్ లోన్ (Home loan) మీద ఆధారపడుతున్నారు. లోన్ తీసుకున్న తర్వాత, నెలవారీ సమాన వాయిదాల్లో (EMI) రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నారు.
దేశంలోని 8 పెద్ద నగరాల్లో నివశిస్తున్న ప్రజలు, తమ ఆదాయంలో హౌసింగ్ లోన్ ఈఎంఐ (Housing Loan EMI) కోసం చెల్లిస్తున్న మొత్తాలను పరిశీలించిన నైట్‌ఫ్రాంక్ ఇండియా, ఆదాయం ఎంత నిష్పత్తిని గృహ రుణం కోసం కేటాయిస్తున్నారో విశ్లేషించింది. ఆ నిష్పత్తి ఆధారంగా అఫర్డబుల్ ఇండెక్స్‌ను రూపొందించింది. ఈ ఇండెక్స్ ప్రకారం, 2023లో, భాగ్యనగరిలో ఇళ్ల రేట్లు (House Rates in Hyderabad) 11% పెరిగాయి.
విశ్లేషణ కోసం.. దిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాలను నైట్‌ఫ్రాంక్ ఇండియా పరిగణనలోకి తీసుకుంది.
హోమ్‌లోన్ EMI కోసం ఏ నగరంలో ఎంత కేటాయిస్తున్నారు? (Housing Loan EMI Ratio to Income)
నైట్‌ఫ్రాంక్ ఇండియా ‘అఫర్డబుల్ ఇండెక్స్’ ప్రకారం... దేశ ఆర్థిక రాజధాని ముంబైలో, ప్రజలు తమ ఆదాయంలో 51% మొత్తాన్ని హోమ్ లోన్ ఈఎంఐ కోసం చెల్లిస్తున్నారు.
హైదరాబాదీలు తమ ఆదాయంలో 30 శాతం డబ్బును ఇంటి కిస్తీల కోసం కేటాయిస్తున్నారు. దేశ రాజధాని దిల్లీలో ఇది 27 శాతంగా, సిలికాన్ వ్యాలీ బెంగళూరులో 26 శాతంగా, చెన్నైలో 25 శాతంగా, పుణెలో 24 శాతంగా, కోల్‌కతాలోనూ 24 శాతంగా, అహ్మదాబాద్‌లో 21 శాతంగా ఉంది.
దీనిని బట్టి... ముంబైలో ఒక సొంత ఇల్లు కొనాలంటే, జీతంలో సగానికి పైగా కేవలం ఇంటి ఈఎంల కోసమే ఖర్చు చేయాలి. మిగతా డబ్బుతోనే మిగిలిన అవసరాలన్నీ తీర్చుకోవాలి. హైదరాబాద్‌లో, ఆదాయంలో దాదాపు మూడో వంతును ఇంటి రుణం చెల్లింపు కోసం కేటాయించాలి, మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని గడపాలి. అంటే, ఈ రెండు నగరాల్లో ఇల్లు కొనడం సామాన్యుడికి ఎంత కష్టమో అర్ధం చేసుకోవచ్చు.
మిగిలిన నగరాలతో పోలిస్తే... అహ్మదాబాద్, కోల్‌కతా, పుణెలో ఇళ్లు కొనడం, ఈఎంఐలు కట్టడం సులభం. ఈ 3 నగరాల్లో రేట్లు తక్కువగా ఉన్నాయి. అహ్మదాబాద్‌లో అయితే, ఆదాయంలో ఐదో వంతును ఇంటి ఈఎంఐ కోసం కేటాయిస్తే చాలు. మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని గడపడం, పొదుపు, పెట్టుబడులు సహా చాలా ప్లాన్స్ చేయొచ్చు. ఈ వెసులుబాటు ముంబయి, హైదరాబాద్ వంటి నగర ప్రజలకు లేదు.
నైట్‌ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ ప్రకారం... 2010తో పోలిస్తే, ఈ 8 నగరాల్లో EMIల పరిస్థితి చాలా మెరుగుపడింది. 2010లో ముంబయిలో హౌస్ లోన్ ఈఎంఐ కోసం ఆదాయంలో 93% కేటాయిస్తే, 2023లో అది 51%కు తగ్గింది. అదే విధంగా..
హైదరాబాద్‌లో 47% నుంచి 30%కు
దిల్లీలో 53% నుంచి 27%కు
బెంగళూరులో 47% నుంచి 26%కు
చెన్నైలో 51% నుంచి 25%కు
పుణెలో 39% నుంచి 24%కు
కోల్‌కతాలో 45% నుంచి 24%కు
అహ్మదాబాద్‌లో 46% నుంచి 21%కు EMI నిష్పత్తి తగ్గింది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024-25) వడ్డీ రేట్లు తగ్గడంతో పాటు, ద్రవ్యోల్బణం అదుపులో ఉండే సూచనలు కనిపిస్తున్నాయని, కాబట్టి 2024లో ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా CMD శిశిర్ బైజల్ అంచనా వేశారు.
మరో ఆసక్తికర కథనం: EPF ఖాతాలో నామినేషన్ అప్‌డేట్ చేయకపోతే చాలా బెనిఫిట్స్ కోల్పోతారు, ఇ-నామినేషన్ ప్రాసెస్ ఇదిగో