EPFO e-Nomination Adding Guidance: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్క్రైబర్లు, తమ ఖాతాల్లో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం చాలా కీలకం. నామినీ పేరు యాడ్‌ చేయకపోతే ఖాతాదార్లు చాలా ప్రయోజనాలు కోల్పోతారు. కాబట్టి, నామినేషన్‌ అప్‌డేట్ చేయమని EPFO ఎప్పటికప్పుడు తన సబ్‌స్క్రైబర్లకు సలహా ఇస్తూనే ఉంటుంది.


EPFO ఖాతాలో నామినీ పేరు చేర్చడం వల్ల ప్రయోజనాలు ‍‌(EPFO e-Nomination Benefits):
EPF ఖాతాదారు, తన PF ఖాతాలో నామినీ పేరును జోడిస్తే చాలా బెనిఫిట్స్‌ ఉంటాయి. నామినేషన్‌ అప్‌డేషన్‌ను సులభంగా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయొచ్చు. EPFO తన X హ్యాండిల్‌లో షేర్‌ చేసిన సమాచారం ప్రకారం, ఒకవేళ EPFO సభ్యుడు అకాల మరణం చెందితే, EPF అకౌంట్‌లోనామినీ పేరును యాడ్‌ చేసి ఉన్నట్లయితే, ఆ ఖాతాలో అప్పటి వరకు జమ చేసిన డబ్బును ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నామినీ సులభంగా క్లెయిమ్ చేయవచ్చు. దీంతో పాటుగా, ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS), ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI), ప్రావిడెంట్‌ ఫండ్‌ (PF) వంటి పథకాల ప్రయోజనాలను పొందే సౌలభ్యం నామినీకి దక్కుతుంది, దీనిలోనూ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాదు. ఫలితంగా, ఆ కుటుంబానికి త్వరగా, సులభంగా ఆర్థిక భద్రత లభిస్తుంది.


EPFO ఖాతాలో నామినేషన్ పూర్తి చేస్తే, పైన చెప్పిన పథకాల అన్ని ప్రయోజనాలను ఆన్‌లైన్‌ ద్వారానే పొందొచ్చు.


EPF ఖాతాలో నామినీ పేరును ఎలా అప్‌డేట్ చేయాలి? ‍‌(How to Update Nominee Name in EPF Account?): 


1. EPFO అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఇక్కడ ఫర్‌ ఎంప్లాయీ ఆప్షన్‌ ఎంచుకోండి.
2. ఇప్పుడు, UAN, పాస్‌వర్డ్, క్యాప్చాను నమోదు చేయాలి. తర్వాత సైన్ ఇన్ బటన్ పై క్లిక్ చేయండి.
3. మేనేజ్ ట్యాబ్‌లో ఇ-నామినేషన్ ఆప్షన్‌ మీకు కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు, 'ఫ్యామిలీ డిక్లరేషన్' సెక్షన్‌పై క్లిక్ చేసి నామినీకి సంబంధించి అన్ని వివరాలను నమోదు చేయాలి. నామినీ పేరు, వయస్సు, లింగం వంటి సమాచారాన్ని అక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత అప్లై బటన్‌పై క్లిక్ చేయండి.
5. నామినీ సమాచారాన్ని సేవ్ చేయడానికి యస్‌ ఆప్షన్‌ మీద క్లిక్ చేయండి.
6. ఒకటి కంటే ఎక్కువ మంది నామినీలను జోడించాలనుకుంటే, యాడ్‌ బటన్‌ నొక్కి, మిగిలిన పేర్లను అదే పద్ధతిలో జోడించవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు యాడ్‌ చేసే నామినీలందరికీ కేటాయించే నిష్పత్తి మొత్తం కలిపితే అది 100% దాటకూడదు. 
7. ఇప్పుడు, 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' బటన్‌ మీద క్లిక్ చేయండి.
8. OTP కోసం 'e-sign' ఆప్షన్‌ మీద క్లిక్ చేయండి.
9. EPFO ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. సంబంధిత గడిలో దానిని ఎంటర్ చేయండి, ఆ తర్వాత సబ్మిట్ బటన్ నొక్కండి.
10. అంతే, మీ EPF ఖాతాలో ఇ-నామినేషన్ ప్రాసెస్‌ పూర్తవుతుంది.


మరో ఆసక్తికర కథనం: సుకన్య సమృద్ధి యోజన ఇన్వెస్టర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌, వడ్డీ రేటు పెంపు