Stock Market Closing On 11 September 2024: రెండు రోజులుగా బేర్స్‌పై పైచేయి సాధిస్తున్న బుల్స్ ఈ రోజు (బుధవారం, 11 సెప్టెంబర్ 2024) పట్టు వదిలేశారు. బేర్స్ ప్రతీకార చర్యలకు దిగడంలో ప్రధాన సూచీలు BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ వేగంగా పతనమయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం ట్రేడింగ్ సెషన్ నుంచి ఇన్వెస్టర్లు లాంగ్ పొజిషన్లు అన్‌వైండ్ చేశారు & షార్ట్ పొజిషన్లు సృష్టించారు. దీంతో మార్కెట్‌లో భారీ పతనం నమోదైంది. ఈ రోజు, సెన్సెక్స్ తన ఇంట్రాడే హై 82,134.95 స్థాయి నుంచి 700 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ కూడా ఇంట్రాడే హై 25,113.70 లెవెల్ నుంచి 230 పాయింట్లు జారిపోయింది. ఇంధనం, ఆయిల్ & గ్యాస్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు మార్కెట్‌ను ప్రధానంగా కిందకు లాగాయి.
ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి, బాంబే స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ 398 పాయింట్ల పతనంతో 81,523 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 123 పాయింట్ల పతనంతో 24,918 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
రూ.2 లక్షల కోట్ల నష్టం
మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఈ రోజు సెషన్‌లో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. బీఎస్‌ఇలో లిస్టయిన స్టాక్స్ మార్కెట్ విలువ (market capitalization of indian stock market) గత ట్రేడింగ్ సెషన్‌లో రూ. 461.23 కోట్లుగా ఉండగా, ఈ రోజు ట్రేడ్ ముగిసే సమయానికి రూ. 463.49 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే, ఈ ఒక్క రోజే మార్కెట్ క్యాప్ రూ. 2.26 లక్షల కోట్లు తగ్గింది.
పెరిగిన & పడిపోయిన షేర్లు
బీఎస్‌ఈ సెన్సెక్స్30 ప్యాక్‌లో 10 స్టాక్స్ మాత్రమే లాభాలతో రోజును ముగించగా, మిగిలిన 20 నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 ప్యాక్‌లో 13 స్టాక్స్ మాత్రమే ప్రాఫిట్‌ను చూడగా, మిగిలిన 37 స్టాక్స్ లాస్ అయ్యాయి. పెరిగిన స్టాక్స్‌లో... ఏషియన్ పెయింట్స్ 2.18 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.57 శాతం, సన్ ఫార్మా 0.88 శాతం, హెచ్‌యుఎల్ 0.58 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.39 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.37 శాతం, ఐటీసీ 0.19 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.08 శాతం లాభం ఆర్జించాయి. పడిపోయిన షేర్లలో... టాటా మోటార్స్ 5.77 శాతం, ఎన్‌టీపీసీ 1.56 శాతం, అదానీ పోర్ట్స్ 1.53 శాతం, ఎల్ అండ్ టీ 1.51 శాతం, ఎస్‌బీఐ 1.45 శాతం, జేఎస్‌డబ్ల్యు స్టీల్ 1.42 శాతం పతనంతో ముగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: బజాజ్ హౌసింగ్ IPO GMP 100% జంప్, రూ.140 పైన లిస్టింగ్! - మీరు బిడ్ వేశారా?