Bajaj Housing Finance IPO GMP: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 'ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌' (IPO) ఈ రోజుతో (బుధవారం, 11 సెప్టెంబర్ 2024) ముగుస్తుంది. ఈ కంపెనీ అన్‌లిస్టెడ్ షేర్లు IPO బిడ్డింగ్ చివరి రోజున రాకెట్స్‌లా మారాయి. బలమైన గ్రే మార్కెట్ ప్రీమియంను అవి డిమాండ్‌ చేస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదార్లు ఎంత ఆకలిగా ఉన్నారో ఈ సంఘటన హైలైట్‌ చేస్తోంది. 


100% ప్రీమియం
తాజా సమాచారం ప్రకారం...  బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు ప్రస్తుతం రూ.70 ప్రీమియంతో ట్రేడింగ్ అవుతున్నాయి. IPO అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ అయిన రూ. 70తో పోలిస్తే ఇది 100% ప్రీమియం. అంటే, ఈ షేర్‌ రూ. 140 (70+70) కంటే ఎక్కువ ధర దగ్గర లిస్ట్‌ అయ్యే అవకాశం ఉంది. IPO సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైన సెప్టెంబరు 9న (సోమవారం) గ్రే మార్కెట్‌ ప్రీమియం (GMP) రూ. 64గా ఉంటే, ఈ రోజు అది మరో రూ.7 పెరిగింది. 


బుధవారంతో ముగియనున్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPOలో, ఇప్పటి వరకు, పెట్టుబడిదార్ల నుంచి స్ట్రాంగ్‌ రెస్పాన్స్‌ కనిపించింది. సబ్‌స్క్రిప్షన్ రెండో రోజు (మంగళవారం) ముగింపు నాటికి, ఈ పబ్లిక్ ఇష్యూ 7.50 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. NSE డేటా ప్రకారం, కంపెనీ 72,75,75,756 షేర్లను ఆఫర్‌ చేస్తే, 5,45,85,77,822 షేర్ల కోసం బిడ్స్‌ వచ్చాయి.


మంగళవారం నాటికి, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO కోసం నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NIIs) అత్యధికంగా 16.45 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBs) 7.46 రెట్లు, రిటైల్ ఇండివిడ్యువల్‌ ఇన్వెస్టర్లు (RIIs) 3.83 రెట్లు బిడ్ చేశారు. మరోవైపు... షేర్‌హోల్డర్ల కోసం రిజర్వు చేసిన కోటా మంగళవారం నాటికి 9.54 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది.


బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO కోసం సంస్థాగత పెట్టుబడిదార్లకు 50 శాతం, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా రిజర్వ్‌ చేశారు.


బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌ IPOకి దేవెన్ చోక్షి రీసెర్చ్, ఇన్‌క్రెడ్ ఈక్విటీస్, మోతీలాల్ ఓస్వాల్, స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్‌ సహా ప్రముఖ బ్రోకరేజీలు పాజిటివ్‌ రేటింగ్‌ ఇచ్చాయి.


IPO వివరాలు
IPO కోసం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ల ప్రైస్ బ్యాండ్ రూ.66-70 మధ్య ఉంచారు. రేపు (గురువారం) ఐపీఓ షేర్ల కేటాయింపు జరుగుతుంది. ఐపీఓలో షేర్లు పొందలేని ఇన్వెస్టర్లకు శుక్రవారం లోగా రీఫండ్ జారీ చేస్తారు.


షేర్ల దక్కించుకున్న బిడ్డర్ల డీమ్యాట్‌ ఖాతాల్లో శుక్రవారం నాడు షేర్లు జమ అవుతాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు ఈ నెల 16న (తాత్కాలిక తేదీ) లిస్ట్‌ అవుతుంది. ఈ పబ్లిక్ ఇష్యూ నుంచి రూ. 6,560 కోట్లను కంపెనీ సమీకరించనుంది.


బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏం చేస్తుంది?
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిటైల్ హోమ్ లోన్స్‌ను అందిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ. 1731 కోట్లు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.