Transform Your Salary Into Savings: కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు కావాలి. డబ్బు లేనిదే ఏ పనీ జరగదు. కానీ, డబ్బు కోసం పని చేయాలి. మీరు, మీ కుటుంబ ఖర్చుల కోసం ప్రతి నెలా మంచి మొత్తాన్ని సంపాదిస్తున్నారనుకుందాం. ఆ డబ్బును కొన్ని భాగాలు చూడాలి. ఆ భాగాల్లో ఒకదానిని మీకు ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు. సినిమాలు, షికార్లు, షాపింగ్‌, హాలిడే ట్రిప్స్‌, హోటల్ ఫుడ్‌ ఇలా.. ఆ భాగం నుంచి ఆస్వాదించవచ్చు. అదే సమయంలో, ఇంటికి అవసరమైన ఖర్చులను కూడా కవర్ చేయాలి, మరికొన్ని భాగాలను పొదుపు చేయాలి,


జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూనే, భవిష్యత్‌ కోసం డబ్బు పొదుపు చేయడం ఒక కళ. "50-30-20" నియమాన్ని అర్ధం చేసుకుంటే ఆ కళ అందరికీ ఈజీగా అబ్బుతుంది. అప్పుడు, మీరు రేపటి గురించి చింతించకుండా ఈ రోజు నుంచే ఎంజాయ్‌ చేయడం స్టార్ట్‌ చేస్తారు. 


Also Read: జేబులో వంగదు, నీళ్లలో కరగదు - ఆధార్ PVC కార్డ్‌ను ఎలా ఆర్డర్ చేయాలి?


50-30-20 రూల్‌ అంటే ఏంటి?
50-30-20 రూల్‌ మీ ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజిస్తుంది. దీనివల్ల మీ ఆర్థిక వ్యవహారాలను చాలా సమర్థవంతంగా నిర్వహించొచ్చు. ఈ రూల్‌ ప్రకారం...


మీ ఆదాయంలో 50% మొత్తాన్ని కుటుంబ అవసరాల (needs) కోసం ఖర్చు చేయాలి.
మరో 30% డబ్బును మీ కోరికల కోసం (సినిమాలు, షాపింగ్‌, హాలిడే ట్రిప్‌ లాంటివి) కేటాయించాలి.
మిగిలిన 20% మొత్తాన్ని పొదుపు & పెట్టుబడుల (savings & investments) వైపు మళ్లించాలి.


నెలకు రూ. 50,000 సంపాదించే వ్యక్తికి 50-30-20 రూల్‌ ఎలా వర్తిస్తుందంటే?


1. అవసరాల కోసం 50% ఆదాయం (ఈ అవసరాలను ఆపలేరు, ఖర్చు చేయాల్సిందే)


ఇంటి అద్దె లేదా గృహ రుణంపై EMI (హైదరాబాద్‌, విజయవాడ లాంటి నగరాల్లో రూ. 10,000-రూ. 30,000)
కిరాణా సరుకులు: నలుగురు సభ్యుల చిన్న కుటుంబానికి నెలకు రూ.6,000-రూ.10,000
యుటిలిటీస్: కరెంట్‌, నీళ్లు, మొబైల్ ఫోన్ రీఛార్జ్‌, ఇంటర్నెట్ బిల్లులు (రూ. 2,000-రూ. 4,000)
ట్రాన్స్‌పోర్ట్‌: ప్రజా రవాణా లేదా కారు రుణంపై EMI, ఇంధన ఖర్చులు (రూ. 3,000-రూ. 10,000)
ఆరోగ్యం: నెలవారీ ఆరోగ్య బీమా ప్రీమియం లేదా వైద్య ఖర్చులు (రూ. 1,000-రూ. 3,000)


నెలకు రూ. 50,000 సంపాదన ఉన్న వ్యక్తికి ఈ నిత్యావసరాలను కవర్ చేయడానికి కనీసం రూ. 25,000 (50%) కావాలి.


2. కోరికల కోసం 30% ఆదాయం (ఇవి విచక్షణతో కూడిన వ్యయాలు)


ఆహారం: హోటల్‌లో భోజనం లేదా బయటి ఫుడ్‌ ఆర్డర్ చేయడం (నెలకు రూ. 2,000-రూ. 5,000)
విహారం: సెలవులు లేదా వారాంతాల్లో జాలీ ట్రిప్స్‌ (రూ. 5,000-రూ. 10,000) 
వినోదం: సినిమాలు, స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌లు (నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటివి) (రూ. 500-రూ. 2,000)
షాపింగ్: దుస్తులు, గాడ్జెట్స్‌, లైఫ్‌స్టైల్‌ కొనుగోళ్లు (రూ. 2,000-రూ. 5,000)


ఈ కేస్‌లో, నెలకు రూ. 50,000 సంపాదించే వ్యక్తికి ఈ తరహా ఖర్చుల కోసం రూ. 15,000 (30%) అవసరం అవుతుంది.


3. పొదుపులు & పెట్టుబడుల కోసం 20% (వీలైదే ఈ వాటాను పెంచాలిగానీ తగ్గించకూడదు)


పొదుపులు: పొదుపు ఖాతా లేదా అత్యవసర నిధిలో (emergency fund) డిపాజిట్స్‌ (రూ. 2,000)
పెట్టుబడులు: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటివి (రూ. 5,000)
రుణ చెల్లింపు: రుణాలను కాల పరిమితి కంటే ముందుగానే (pre-paying) చెల్లించడం (రూ. 3,000)


ఈ కేస్‌లో రూ. 10,000 (20%) అవసరం అవుతుంది. దీంతో కలిపి అతని రూ.50,000 జీతంలో ప్రతి పైసా సద్వినియోగం అవుతుంది, లెక్క పక్కాగా ఉంటుంది. సినిమాలు, షికార్లకు కూడా డబ్బు తీసి పక్కనబెట్టడం వల్ల సరదాలు కూడా మానుకోవాల్సిన అవసరం ఉండదు. జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూనే భవిష్యత్‌ కోసం పెట్టుబడులనూ కొనసాగించవచ్చు. 


"50-30-20" రూల్‌లో "అవసరాలు" - "కోరికలు" మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. కోరికలను అవసరాలుగా భ్రమపడితే జీవిత చక్రం రివర్స్‌లో తిరుగుతుందని గుర్తు పెట్టుకోండి.


Also Read: రూ.10 వేలలోపు టాప్ -5 బ్రాండెడ్‌ సైకిల్స్​ ఇవే? - బెస్ట్​ రైడ్​తో పాటు ఆరోగ్యం మీ సొంతం!