Aadhaar PVC Card: ఒక వ్యక్తి దగ్గర ఆధార్ కార్డ్ ఉంటే అతన్ని భారతీయుడు అని అధికారికంగా, ఈజీగా గుర్తించొచ్చు. పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వ్యక్తిగత గుర్తింపు పత్రాల్లో ఒకటిగా పుట్టిన ఆధార్, ఇప్పుడు మిగిలిన అన్నింటి కంటే కీలకమైన ఐడీ ప్రూఫ్‌గా మారింది. దీనిని, భారత ప్రభుత్వం తరపున 'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ' (UIDAI లేదా ఉడాయ్) భారత ప్రజలకు జారీ చేస్తుంది. భారత ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు పత్రం కాబట్టి, ఏదోక సమయంలో, ఏదో ఒక పని కోసం ఈ ఐడీని వినియోగించాల్సి వస్తుంది. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగంలో ఉన్న అన్ని సంస్థలు ఒక వ్యక్తి భారతీయ పౌరుడా, కాదా అని గుర్తించడానికి ఆధార్‌ను ప్రామాణికంగా చూస్తున్నాయి. ఆధార్ జిరాక్స్‌ను ప్రూఫ్‌గా తీసుకుంటున్నాయి.
మీరు కూడా ఆధార్ కార్డ్ హోల్డర్ అయితే, ఇప్పటికీ పేపర్ లామినేటెడ్ ఆధార్ కార్డ్‌ను ఉపయోగిస్తుంటే, మీరు ఇప్పుడు PVC ఆధార్ కార్డ్‌కు మారే టైమ్ వచ్చింది.
ఆధార్ పీవీసీ కార్డ్ అంటే ఏంటి? (What is an Aadhaar PVC Card)
బ్యాంక్ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డులను ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా జేబులోనో, పర్సులోనో పెట్టుకుంటున్నారు. ఆ కార్డులు ప్యాంట్ జేబులో ఉన్నా వంగవు, నీళ్ల పడినా నానిపోవు. ఆధార్ PVC కార్డు కూడా అలాంటిదే. ఈ కార్డ్‌ను "యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా" (ఉడాయ్) అందిస్తుంది. ఆధార్ PVC అనేది ఒక ప్లాస్టిక్ కార్డ్. ఆధార్ కార్డ్ హోల్డర్‌కు చెందిన మొత్తం సమాచారం ఇందులో నిక్షిప్తమై ఉంటుంది.
పేపర్ లామినేటెడ్ కార్డ్ ఉండగా పీవీసీ కార్డ్ ఎందుకు? (Why a PVC card when there is a paper laminated card?)
పేపర్ లామినేటెడ్ ఆధార్ కార్డ్ కంటే ఆధార్ PVC కార్డ్ బలమైనది, నాణ్యమైనది. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు తరహాలోనే ఆధార్ PVC కార్డ్ కార్డ్ కూడా నీటిలో కరిగిపోదు లేదా జేబులో పెట్టుకుని కూర్చున్నా వంగిపోదు.
ఆధార్ పీవీసీ కార్డ్ తీసుకోవడానికి ఎవరు అర్హులు? (Who is eligible to get Aadhaar PVC card?)
ఆధార్ కార్డ్ ఉన్న ఏ వ్యక్తయినా ఆధార్ PVC కార్డ్ పొందడానికి అర్హుడు. ఇప్పటికీ ఆధార్ కార్డ్ లేకపోయినా పర్లేదు, ఒక వ్యక్తి భారతీయుడైతే చాలు. సంబంధిత ధృవపత్రాలను సమర్పించి ఈ ప్లాస్టిక్ కార్డు పొందొచ్చు. ఈ కార్డ్ కోసం కేవలం 50 రూపాయల రుసుము వసూలు చేస్తారు.
ఆధార్ పీవీసీ కార్డ్‌ను ఎలా ఆర్డర్ చేయాలి? (How to Order Aadhaar PVC Card)
- మీరు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఆధార్ PVC కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- మొదట, మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- ఇప్పుడు, మీ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ఖాతాలోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత My Aadhaar సెక్షన్‌లోకి వెళ్లాలి.
- Order Aadhaar PVC Card ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
- తదుపరి ప్రాసెసింగ్ కోసం క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత, మీ ఫోన్ నంబర్ వివరాలను నమోదు చేసి, Send OTPపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు, మీ స్క్రీన్‌పై PVC కార్డ్ ప్రివ్యూ కనిపిస్తుంది.
- మీకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని మరోమారు క్రాస్ చెక్ చేసుకోవాలి.
- మీ వివరాలన్నీ సరి చూసుకున్న తర్వాత, ఇక చివరిగా, ఫీజ్ చెల్లించి ఆధార్ పీవీసీ కార్డును ఆర్డర్ చేయాలి.
డబ్బు చెల్లింపు విజయవంతంగా పూర్తయిన తర్వాత, కొన్ని రోజుల్లోనే ఆధార్ పీవీసీ కార్డును ఉడాయ్ మీ చిరునామాకు (ఆధార్ కార్డ్‌లో ఉన్న చిరునామాకు) పంపుతుంది.
ఒకవేళ మీకు ఆన్‌లైన్ ప్రాసెస్ తెలీకపోయినా, అర్ధం కాకపోయినా, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. మీ సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళితే, మీ తరపున అక్కడి సిబ్బందే మీ ఆధార్ PVC కార్డ్ కోసం ఆర్డర్ పెడతారు. ఇందుకోసం, ఆధార్ కేంద్రంలో 50 రూపాయలు ఫీజ్ వసూలు చేస్తారు.