What is Bitcoin Mining: ఈ ఏడాది ప్రారంభం నుంచి బిట్‌కాయిన్ వార్తల్లో నిలుస్తోంది. అమెరికాలో బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లకు ఆమోదం, ఆపై కొత్త రికార్డు స్థాయికి చేరిన ధరలు బిట్‌కాయిన్‌ను నిరంతరం న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో నిలబెట్టాయి. ఇప్పుడు, బిట్‌కాయిన్ మరోమారు వార్తల్లోకి వచ్చింది. ఈసారి కారణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.


సెంట్రల్ అమెరికాలోని అతి చిన్న దేశం ఎల్ సాల్వడార్ ‍‌(El Salvador) గత కొన్నేళ్లుగా బిలియన్ల విలువైన బిట్‌కాయిన్‌లను మైన్‌ చేస్తోంది. అయితే, బిట్‌కాయిన్‌ మైనింగ్‌ కోసం ఈ దేశం అగ్నిపర్వతం (Volcano) సాయం తీసుకుంది. వల్కనో నుంచి బిట్‌కాయిన్‌ను రూపొందిస్తున్న విధానం ఈ మొత్తం ఎపిసోడ్‌ను అత్యంత ఆసక్తికరంగా మార్చింది. దీనివల్ల ఎల్ సాల్వడార్ ప్రభుత్వ ఖజానా కూడా నిండింది.


ఎల్ సాల్వడార్‌లో అధికారిక గుర్తింపు
ఎల్ సాల్వడార్, ప్రపంచంలోనే బిట్‌కాయిన్‌ను అధికారికంగా గుర్తించిన తొలి దేశం. ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలేకు బిట్‌కాయిన్ అంటే ఇష్టం. అతను తన మొదటి టర్మ్‌లోనే బిట్‌కాయిన్‌కు అధికారిక గుర్తింపు ఇచ్చాడు. ఈ ఏడాది నుంచి ఆయన రెండో టర్మ్‌ ప్రారంభమైంది. ఎల్‌ సాల్వడార్‌లో బిట్‌కాయిన్ మైనింగ్‌ను ప్రోత్సహించే చర్యలను కూడా బుకెల్ ప్రభుత్వం ప్రోత్సహించింది. 


బిట్‌కాయిన్‌ మైనింగ్‌ కోసం ఎల్ సాల్వడార్‌లో బిట్‌కాయిన్ ఆఫీస్ అనే ప్రత్యేక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ దేశ ఖజానాలో 5,750 బిట్‌కాయిన్లు జమ అయ్యాయని బిట్‌కాయిన్ ఆఫీస్ తెలిపింది. 2021లో మైనింగ్‌లో కొత్త తరహా విధానం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు 474 కొత్త బిట్‌కాయిన్‌లు ట్రెజరీలో చేరాయని వెల్లడించింది. ఈ విధంగా, ఆ దేశ ట్రెజరీలో బిట్‌కాయిన్ మొత్తం విలువ సుమారు 354 మిలియన్ డాలర్లకు చేరింది.


బిట్‌కాయిన్ మైనింగ్ అంటే ఏంటి?
నిజానికి, బిట్‌కాయిన్‌ మైనింగ్‌ అంటే ఖనిజాల తరహాలో భూమి నుంచి తవ్వి తీయడం కాదు. ఇది బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై ‍‌(Blockchain technology) ఆధారపడిన క్రిప్టో కరెన్సీ (Crypto Currency). బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో, కొత్త బ్లాక్‌లను యూనిట్‌లుగా సృష్టిస్తారు. ఇవి, అంతులేని గొలుసుకు అనుసంధానమవుతాయి. ఈ గొలుసు పెరిగే కొద్దీ కొత్త బిట్‌కాయిన్ యూనిట్ల సృష్టి జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియను బిట్‌కాయిన్ మైనింగ్ అంటారు. ఈ పనికి భారీ కంప్యూటింగ్/ప్రాసెసింగ్ సామర్థ్యం, నిపుణులు అవసరం. పైగా, దీనికోసం అతి భారీ మొత్తంలో విద్యుత్‌ కావాలి.


అగ్నిపర్వతం నుంచి బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ఎలా?
ఎల్ సాల్వడార్ ప్రభుత్వం, బిట్‌కాయిన్‌ల మైనింగ్ కోసం తమ దేశంలో 300 భారీ ప్రాసెసర్‌లను ఏర్పాటు చేసింది. ఈ ప్రాసెసర్‌లను నడపడానికి ఉపయోగించే విద్యుత్‌ను టెపాకా అగ్నిపర్వతం (Volcano De Tecapa) శక్తి నుంచి తీసుకుంటోంది. అగ్నిపర్వతాల నుంచి ఉత్పత్తయ్యే జియోథర్మల్ ఎనర్జీని విద్యుత్‌గా మారుస్తోంది. ఆ విద్యుత్‌తో బిట్ కాయిన్లను మైనింగ్‌ చేస్తోంది. ఫలితంగా, ఒకవైపు.. కాలుష్యం లేకుండా గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకుంటూనే, మరోవైపు.. అత్యంత విలువైన కొత్త బిట్‌కాయిన్లను ఖజానాలో జమ చేస్తోంది.


మరో ఆసక్తికర కథనం: ఎన్నికల తర్వాత లాభపడే స్టాక్‌ ఇది, విన్నింగ్‌ డీల్‌ అంటున్న బ్రోకరేజ్‌లు!