Stock Markert Updates: ప్రస్తుతం మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు (Lokshabha Elections 2024) జరుగుతున్నాయి. ఎన్నికల సరళి, ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తే, కొన్ని కంపెనీల షేర్లు తారాజువ్వల్లా దూసుకెళ్తాయి. మరికొన్ని స్టాక్స్ మాత్రం ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పెరుగుతాయి. అలాంటి వాటిలో భారతి ఎయిర్‌టెల్ ఒకటి.
మన దేశంలో, ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ చాలా కాలంగా కాల్ ఛార్జీలు పెంచలేదు. ఎన్నికల సమయంలో ప్రజా వ్యతిరేకత రాకూడదని, టారిఫ్స్ పెంచకుండా ఈ మూడు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆపింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత టారిఫ్‌లు పెంచేందుకు ఈ 3 టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయని బ్రోకరేజీ సంస్థలు భావిస్తున్నాయి. కాల్ రేట్ల పెంపుతో, అన్నింటి కంటే ఎక్కువగా భారతి ఎయిర్‌టెల్ ప్రయోజనం పొందుతుందని చెబుతున్నాయి.
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దగ్గర టెలికాం టారిఫ్‌లు తక్కువగా ఉన్నాయని భారతి ఎయిర్‌టెల్ ఎండీ గోపాల్ విత్తల్ కూడా చెప్పారు. కంపెనీ ఆదాయం పెరగాలంటే కాల్ ఛార్జీలు పెంచకతప్పదని అన్నారు. దీనిని బట్టి, ఎలక్షన్స్ ముగియగానే కాల్ ఛార్జీలు పెంచేందుకు ఎయిర్‌టెల్ రెడీగా ఉన్నట్లు అర్ధమవుతోంది.
టారిఫ్ రేట్లు పెరిగితే భారతి ఎయిర్‌టెల్ షేర్లు లాభదాయకమైన డీల్‌గా మారతాయని చెబుతున్న బ్రోకింగ్ కంపెనీలు ఈ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నాయి, టార్గెట్ ధరలు పెంచాయి.
ఎయిర్‌టెల్ షేర్లకు బ్రోకరేజ్‌లు ఇచ్చిన కొత్త టార్గెట్ ధరలు (Target Price To Airtel Shares)
బ్రోకరేజ్ సంస్థ నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్, భారతి ఎయిర్‌టెల్ లక్ష్యిత ధరను రూ.1,600 కు పెంచింది. ఇంతకు ముందు ఈ బ్రోకరేజ్ ఎయిర్‌టెల్ షేర్లకు రూ. 1,580 టార్గెట్ ఇచ్చింది.
మరో సంస్థ MK గ్లోబల్ కూడా భారతి ఎయిర్‌టెల్ స్టాక్ టార్గెట్ ప్రైస్‌ను గతంలోని రూ. 1,325 నుంచి రూ. 1,400 కు పెంచింది.
మోతీలాల్ ఓస్వాల్ ఈ టెలికాం స్టాక్‌పై ఫుల్ బుల్లిష్‌గా ఉంది, బయ్ రేటింగ్ (Buy Rating To Airtel Shares) కంటిన్యూ చేసింది. ఈ బ్రోకరేజ్ సంస్థ ఎయిర్‌టెల్ షేర్ల టార్గెట్ ధరను రూ. 1,640 గా నిర్ణయించింది.
ఈ రోజు (గురువారం, 16 మే 2024) మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఎయిర్‌టెల్ షేర్లు 2 శాతం పైగా పెరిగి రూ. 1,341.90 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఈ లెక్కన, బ్రోకరేజ్ హౌస్‌లు ఈ స్టాక్‌లో 20 శాతానికి పైగా వృద్ధి సామర్థ్యాన్ని చూస్తున్నాయి.
ఈ షేర్లు గత ఆరు నెలల కాలంలో 41 శాతం పైగా పెరిగాయి. గత 12 నెలల్లో 70 శాతం పైగా లాభపడ్డాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 33 శాతం ర్యాలీ చేశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: చుక్కలు దాటి దూసుకెళ్లిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి