Dune Prophecy Teaser Is Out Now: ‘డ్యూన్’ మూవీ హాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో విజయం సాధించింది. ఆస్కార్‌తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కూడా దక్కించుకుంది. అందుకే ఇలాంటి ఒక సినిమా చుట్టూ ఒక యూనివర్స్‌ను క్రియేట్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ‘డ్యూన్’ కథతో ఒక వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. అదే ‘డ్యూన్: ప్రాఫెసీ’. ఈ సిరీస్ గురించి గత కొన్నిరోజులుగా ఇండియాలో కూడా హాట్ టాపిక్‌ నడుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ టబు.. ‘డ్యూన్: ప్రాఫెసీ’లో నటిస్తుందని బయటికొచ్చిన వార్తే దీనికి కారణం. తాజాగా విడుదలయిన ఈ సిరీస్ టీజర్‌లో టబు ఎక్కడ ఉందా అని వెతకడం మొదలుపెట్టారు ప్రేక్షకులు.


టీజర్ బాగుందంటూ ప్రశంసలు..


‘డ్యూన్: ప్రాఫెసీ’ అనేది డ్యూన్ యూనివర్స్‌కు ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. దీని కథ మొత్తం బెనీ జెసరేట్ అనే సిస్టర్‌హుడ్ చుట్టూ తిరుగుతుంది. బెనీ జెసరేట్ శక్తులు ఒక్కొక్కటిగా ఎలా పెరిగాయి? వారి శక్తులు పెరగడం కోసం ఏం చేశారు? అనేదానిపై ‘డ్యూన్: ప్రాఫెసీ’ టీజర్ తిరుగుతుంది. అయితే ఈ ఒక్క టీజర్‌లోనే చాలా క్యారెక్టర్లు పరిచయమయ్యాయి. అందులో టబు ఎవరు అని తెలుసుకోవడానికి ప్రేక్షకులకు కాస్త సమయం పడుతుంది. కొందరు ప్రేక్షకులు మాత్రం టీజర్‌ను స్క్రీన్‌షాట్లు తీసుకొని తమకు టబు కనిపించిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. టబు విషయం పక్కన పెడితే ‘డ్యూన్: ప్రాఫెసీ’ టీజర్ మాత్రం చాలా బాగుంది అంటూ పలువురు ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు.


సిస్టర్ ఫ్రాన్సెస్కా..


‘డ్యూన్: ప్రాఫెసీ’ సిరీస్‌లో సిస్టర్ ఫ్రాన్సెస్కా అనే రోల్‌లో కనిపించనుంది టబు. కానీ ఆ రోల్‌కు టీజర్‌లో ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ ఏమీ ఇవ్వలేదు. పైగా నల్ల ముసుగు వేసి ఉంది. అందుకే తనను కనిపెట్టడం ప్రేక్షకులకు కష్టమయ్యింది. ఇందులో టబుతో పాటు ఎమీలీ వాట్సన్, ఒలివియా విలియమ్స్, ట్రావిస్ ఫిమ్మెల్, సారా సోఫీ వంటి నటీనటులు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫ్రాంక్ హెర్బెర్ట్ క్రియేట్ చేసిన ఈ డ్యూన్ యూనివర్స్‌ను కెవిన్ జే ఆండర్సన్ నిర్మిస్తున్నారు. మ్యాక్స్ నెట్‌వర్క్‌లో విడుదల కానున్న ‘డ్యూన్: ప్రాఫెసీ’ రిలీజ్ డేట్ గురించి మాత్రం మేకర్స్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కన్నింగ్ హ్యాండ్, అనాబెలీటా ఫిల్మ్స్, లెజెండరీ టెలివిషన్ సంస్థలు కలిసి ‘డ్యూన్: ప్రాఫెసీ’ని నిర్మించాయి.



హాలీవుడ్ కొత్త కాదు..


బాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా ఎంత బిజీగా గడిపిందో.. టబు ఇప్పటికీ కూడా అదే రేంజ్‌ను మెయింటేయిన్ చేస్తోంది. టబు ఇంగ్లీష్ చిత్రాల్లో నటించడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా పలు ఇంగ్లీష్ చిత్రాల్లో నటించి హాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది టబు. దీంతో తనకు ‘డ్యూన్’ లాంటి ప్రతిష్టాత్మక సినీ యూనివర్స్‌లో అవకాశం రావడం పెద్ద విషయం కాదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ‘ది సూటెబుల్ బాయ్’ అనే వెబ్ సిరీస్‌తో ఇప్పటికే ఓటీటీ వరల్డ్‌లో అడుగుపెట్టిన టబు.. ‘డ్యూన్: ప్రాఫెసీ’తో మరోసారి ఓటీటీలో తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకోనుంది. ‘డ్యూన్: ప్రాఫెసీ’లో టబును ఎప్పుడెప్పుడు చూస్తామా అని తన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.


Also Read: ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చేతికి గాయం - కట్టుతోనే కేన్స్‌కు, కూతురితో కలిసి!