Hari Om OTT: ఉల్లు (ULLU) యాప్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అడల్ట్ కంటెంట్‌ను అందించే ఈ యాప్.. రక్తి నుంచి భక్తి వైపు అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈ యాప్ యాజమాన్యం ‘హరి ఓం’ అనే ఓటీటీ యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది.


దేశంలోనే తొలి భక్తి ఓటీటీ ఫ్లాట్ ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ‘ఉల్లు’ (ULLU) ఓటీటీ అధినేత విభు అగర్వాల్ తెలిపారు. ‘హరి ఓం’ పేరుతో ఈ సరికొత్త ఫ్లాట్ ఫారమ్ ను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఓటీటీలో ‘భారతీయ పురాణాలు, సంప్రదాయాలకు సంబంధించిన కంటెంట్ ను అందించనున్నట్లు వెల్లడించారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతపై యువ ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో వారిని ఆకట్టుకునేలా ఈ ఓటీటీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. భారతీయ సంప్రదాయాలను అన్వేషించే గేట్ వేగా ఈ ఓటీటీ ఉపయోగపడుతుందన్నారు.


జూన్ 2024లో ఈ ఓటీటీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఈ ఫ్లాట్ పారమ్ లో కేవలం ‘యు’ రేటెడ్ కంటెంట్ మాత్రమే ఉంటుందన్నారు. కుటుంబం అంతా కూర్చొని భక్తి పరమైన కంటెంట్‌ను చూసే అవకాశం కలుగుతుందన్నారు. వీడియో కంటెంట్‌తో పాటు ఆడియో ఫార్మాట్‌లో కూడా భజనలను అందివ్వనున్నట్లు తెలిపారు. పిల్లల కోసం, పౌరాణికాలకు సంబంధించి క్యూరేటెడ్ యానిమేటెడ్ కంటెంట్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు అగర్వాల్ తెలిపారు.  


భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే ప్రయత్నం- అగర్వాల్


ఇప్పటికే విభు అగర్వాల్ ULLU అనే అడల్ట్ కంటెంట్ ఓటీటీ యాప్, ‘అత్రంగి’ టీవీ చానెల్ ప్రారంభించారు. జూన్ 2022లో ‘అత్రంగి’ అనే టీవీని ప్రారంభించారు. ఏడాది కాలంలోనే ఆ కంపెనీ పూర్తిగా ఓటీటీగా మారిపోయింది. దీంతో టీవీ సేవలు నిలిపివేశారు. ఇప్పుడు భక్తి కంటెంట్‌తో కూడిన ఓటీటీ ‘హరి ఓం’ను ప్రారంభించబోతున్నారు. “భారతీయులుగా మన మూలాలు, సంస్కృతి, సంప్రదాయం, వారసత్వాన్ని గౌరవంగా భావించాలి. వాటి గొప్పదనాన్ని గర్వంగా ముందు తరాలకు అందించాలి. అందుకే ఈ యాప్‌ను ప్రారంభిస్తున్నాం. ఈ ఓటీటీలో కేవలం పౌరాణిక కంటెంట్ మాత్రమే ఉంటుంది. భారతీయ పురాణాల కోసం సీనియర్ సిటిజన్లు, యువ ప్రేక్షకుల నుంచి వస్తున్న డిమాండ్‌ను గుర్తించి ‘హరి ఓం’ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్‌ను ప్రారంభించబోతున్నాం అని ప్రకటించేందుకు సంతోషిస్తున్నాం” అని అగర్వాల్ తెలిపారు.






‘హరి ఓం’ ఓటీటీలో ఏ కంటెంట్ ఉంటుందంటే?


‘హరి ఓం’ ఓటీటీలో తిరుపతి బాలాజీ, మాతా సరస్వతి, ఛాయాగ్రహ రాహు కేతు, జై జగన్నాథ్, కైకేయి కే రామ్, మా లక్ష్మి, నవగ్రహకు సంబంధించి కంటెంట్ ఉండబోతోంది." 'హరి ఓం'లో ఇప్పటి వరకు అంతగా ప్రచారంలో లేని పౌరాణిక కథలను రూపొందించేలా ప్రయత్నిస్తున్నాం. ఈ ఓటీటీ ద్వారా అందించే కథలు, కథనాలు వినోదభరితంగా ఉండటంతో పాటు సందేశాత్మకంగా ఉంటాయి. ఇవి హిందూ మతం, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పనున్నాయి” అని ‘అత్రాంగి’ వైస్ ప్రెసిడెంట్ నివేదితా బసు వెల్లడించారు.


Read Also: ధోనితో కలిసి సినిమా చూడాలనుంది, మనసులో మాట బయటపెట్టిన జాన్వీ కపూర్