Vidya Vasula Aham Trailer Is Out Now: హీరో, హీరోయిన్‌కు పెళ్లి అవ్వడం, ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య గొడవలు మొదలవ్వడం.. ఈ కాన్సెప్ట్‌లో చాలా సినిమాలు వచ్చాయి. అందులో చాలా వరకు సినిమాలు హిట్‌ను కూడా సొంతం చేసుకున్నాయి. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మరో చిత్రమే ‘విద్య వాసుల అహం’. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకోగా.. తాజాగా దీని ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశాడు మేకర్స్. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ నేరుగా ఆహాలో విడుదల కానుంది. తాజాగా విడుదలయిన ట్రైలర్ ద్వారా సినిమాలోని అసలు కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాడు దర్శకుడు మణికాంత్ గెల్లి.
అహాలే చాలు..
శ్రీనివాస్ రెడ్డి నారదుడిగా, అవసరాల శ్రీనివాస్ విష్ణుమూర్తిగా, అభినయ లక్ష్మి దేవిగా ‘విద్య వాసుల అహం’ ట్రైలర్ ఓపెన్ అవుతుంది. ‘‘కారణం లేని కలహం నారదుడు కూడా కల్పించలేడనుకున్నా. దంపతుల కలహాలకు వాళ్ల అహాలే చాలు’’ అంటూ శ్రీనివాస్ రెడ్డి చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత భార్యభర్తలుగా విద్య, వాసుల ఇంట్రడక్షన్. భర్త తన చెప్పినట్టే వినాలి అనుకునే భార్య విద్య పాత్రలో శివానీ రాజశేఖర్ నటించింది. భార్య అహాన్ని భరించలేక నలిగిపోయే భర్త వాసు పాత్రలో రాహుల్ విజయ్ కనిపించాడు. అలా పెళ్లయిన తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా గొడవలతో వారి జీవితాన్ని కొనసాగిస్తుంటారు విద్య, వాసు.
గొడవల మధ్య రొమాన్స్..
‘విద్య వాసుల అహం’ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇందులో కామెడీ కూడా బాగా వర్కవుట్ అయ్యేలా అనిపిస్తోంది. అంతే కాకుండా ఇందులో రాహుల్, శివానీ మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయని ట్రైలర్‌లోనే రివీల్ చేశారు మేకర్స్. చీరకట్టులో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది శివానీ. అలా ఎప్పుడూ గొడవపడుతూ, అప్పుడప్పుడు కలిసిపోతూ ఉంటే వాసు, విద్యల ఇంటికి అనుకోకుండా ఇరు కుటుంబాలు వస్తాయి. ‘‘మన పేరెంట్స్ ఉన్నంతవరకు మనం సరిగ్గా ఉందాం’’ అంటూ వాసుతో ఒక ఒప్పందానికి వస్తుంది విద్య. కానీ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ గొడవలు మొదలవుతాయి. అవి మెల్లగా మనస్పర్థలకు దారితీస్తాయి.
ఆకట్టుకునే డైలాగులు..
‘‘ఆవేశంలో తీసుకునే నిర్ణయం జీవితానికి అంత మంచిది కాదు. ఆలోచించి నిర్ణయం తీసుకో’’ లాంటి కొన్ని రియలిస్టిక్ డైలాగులతో ‘విద్య వాసుల అహం’ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ‘‘ఒంటరిగా ఎంత సాధించినా చివరికి ఒంటరితనమే మిగిలిపోతుంది’’ అంటూ తనికెళ్ల భరణి చెప్పే డైలాగ్.. ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది. అలా గొడవలు, అహంతో మొదలయిన విద్య, వాసుల పెళ్లి బంధం చివరికి ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేదే సినిమా కథ అని ‘విద్య వాసుల అహం’ ట్రైలర్‌లోనే స్పష్టంగా అర్థమవుతుంది. మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 17 నుండి ఆహాలో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది.
Also Read: డబుల్ ఇస్మార్ట్ టీజర్ - డబుల్ ఇంపాక్ట్ & మాస్... దిమాకిక్కిరికిరి, రామ్ & పూరి కుమ్మేశారుగా!