దేశానికి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ప్రతీ సారి మహిళలు ఎంతో ఆసక్తిగా చూస్తూంటారు. గృహిణులతో పాటు ఉద్యోగం, ఉపాధి మార్గాల్లో ఉన్న మహిళలు కూడా తమకేమైనా వెసులుబాటు కల్పిస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తూంటారు.  ఈ సారి కూడా నిర్మలపై మహిళా లోకం ఎన్నో ఆశలు పెట్టుకుంది. వంటింటి మంట తగ్గాలని.. పన్ను పోటు తీసేయాలని..  స్వయం ఉపాధి అవకాశాలు పెంచాలని ఇలా ఎన్నో ఆశిస్తున్నారు. వారి కోరికలను ఆర్థిక మంత్రి ఎంత మేర తీర్చగలరు ? 


పేదరికం నుంచి మహిళలను బయటపడేయాల్సిన అవసరం !


దేశంలో 75శాతం మంది మహిళలు పేదరికంలో మగ్గుతున్నారని అనేక సర్వేలు చెప్తున్నాయి. మహిళల అభివృద్దే దేశం అభివృద్ధి అవుతుంది. అందుకే వారి అభివృద్ధికి సరికొత్త పథకాలను తీసుకురావాలన్న సూచనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ లో మహిళల కోస బడ్జెట్ కేటాయించేది ఒక్కశాతం కూడా ఉండదు. ఈ శాతాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్న అభిప్రాయం చాలా కాలంగా ఉంది. మహిళా, శిశు సంక్షేమానికి వేర్వేరుగా కేటాయింపులు జరగాలని... అంగన్ వాడీ కేంద్రాలకు ఐసీడీయస్ ద్వారా ఇచ్చే నిధుల శాతాన్ని మరింత పెంచాలని నిపుణులు సలహాలు ఇచ్చారు.  దేశంలో 92శాతం మహిళలు అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు. వారి సంక్షేమానికి కేటాయింపులు లేవు. వీటిని ఆర్థిక మంత్రి ప్రధాన సమస్యలుగా గుర్తించాలని కోరుతున్నారు. 


Also Read: సమూల సంస్కరణలకు ప్రోత్సాహం - మరుమూల ప్రాంతాలకూ ఆన్ లైన్ విద్య సదుపాయం ... ఈ సారి బడ్జెట్‌పై విద్యారంగానికి ఆశలెన్నో !.


స్వయం సహాయ బృందాలకు మరింత సాయం !


మహిళల సాధికారతకు చిహ్నంగా చూపెడుతున్న స్వయం సహాయక సంఘాలకు రుణాలు మరింత ఉదారంగా అందచేయాల్సి ఉంటుంది. భారత రాజ్యంగం హామీ ఇచ్చిన విలువలు సాధన కోసం స్త్రీలు అన్ని రకాల అసమానతలను అధిగమించాలి. నిర్భయ ఉదంతం అనంతరం వన స్టాప్ క్రైసిస్ సెంటర్లు ఏర్పాటు చేసింది కేంద్రం. అయితే దానికి నిధులు కేటాయించినప్పటికీ ఎలా ఉపయోగించుకోవాలో అనే దానిపై నిధులు కేటాయించకపోవడం వల్ల ఆగిపోయాయి. నిర్భయ నిధి కింద వేల కోట్లు కేటాయిస్తున్నప్పటికి దాన్ని ఉపయోగించుకోవడానికి అవసరమైన నిబంధనలను రూపొందించకపోవడం సమస్యగా మారింది. ఈ సమస్యను నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో అయినా పరిష్కరిస్తారేమో చూడాలి ! 


మహిళలకు ప్రత్యేక పథకాలు !


స్వయం ఉపాధి పొందుతున్న మహిళల కోసం ముద్రా యోజన రుణాలను మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. కింద లబ్ధి పొందే వారిలో అత్యధిక శాతం మహిళలే ఎక్కువ. అయితే మహిళలు ఈ పథకాన్ని మరింత ఉపయోగించుకునేలా సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో మహిళలు కూడా ముందుకొస్తున్నారు. వారిని ప్రోత్సహించడానికి మహిళా రైతులకు, కూలీలకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. 


Also Read: సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్‌లో మార్పులకు కేంద్రం సిద్దం - వ్యతిరేకిస్తూ కేసీఆర్ లేఖ !


వంటింటి మంటను తగ్గించాల్సిన అవసరం !


నిర్మలా సీతారామన్ ఈ సారి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపైనా దృష్టి పెట్టాల్సి ఉంది. పెద్ద ఎత్తున ధరలు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా సామాన్యుడి ఇంటి బడ్జెట్ గతి తప్పుతోంది. అప్పుల పాలవుతున్నారు. ఈ ప్రభావం ఎక్కువగా  మహిళలపైనే పడుతోంది.  ధరలను వీలైనంతగా కంట్రోల్ చేసేలా బడ్జెట్ నిర్ణయాలు ఉంటే మహిళలకు నిర్మలమ్మచేసే మేలు చేలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆశలన్నీ నెరవేరుస్తారేమో ఒకటో తేదీ వరకు ఎదురు చూడాలి ! 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి