RBI MPC Meeting June 2024 Decisions: 2024-25 ఆర్థిక సంవత్సరంలో, పూర్తి బడ్జెట్‌కు (Union Budget 2024) ముందు, దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆర్‌బీఐ 'మానిటరీ పాలసీ కమిటీ' ‍‌సమావేశం అంచనాలకు అనుగుణంగా ముగిసింది. రికార్డ్‌ స్థాయిలో వరుసగా ఎనిమిదోసారి కూడా రెపో రేట్‌ (RBI Repo Rate) స్థిరంగా ఉంది.


MPC సమావేశం ముగిసిన తర్వాత లైవ్‌లోకి వచ్చిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das), ప్రధాన పాలసీ రేట్‌లో (రెపో రేట్‌‌) ఎలాంటి మార్పు చేయకూడదని కమిటీ మరోసారి నిర్ణయించిందని ప్రకటించారు. దీంతో, రెపో రేట్‌ 6.50 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు వెల్లడించారు.


జాతీయ & అంతర్జాతీయ స్థూల ఆర్థిక పరిస్థితులను సమీక్షించిన తర్వాత, రెపో రేట్‌ను స్థిరంగా ఉంచేందుకే ద్రవ్య విధాన కమిటీలో మెజారిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. MPCలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు రెపో రేట్‌ను మార్చకూడదని ఓటు వేశారు. 


గత 16 నెలలుగా ఒకే స్థాయిలో స్థిరంగా రెపో రేట్‌
రెపో రేట్‌లో ఎలాంటి మార్పు చేయకుండా ముగిసిన ఎనిమిదో ద్రవ్య విధాన కమిటీ భేటీ ఇది. భారతీయ కేంద్ర బ్యాంక్, చివరిసారిగా, ఫిబ్రవరి 2023లో రెపో రేట్‌ను మార్చింది, అప్పుడు 6.50 శాతానికి చేర్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు, గత 16 నెలలుగా రెపో రేట్‌ అదే స్థాయిలో స్థిరంగా కొనసాగుతోంది.


రెపో రేట్‌ - రివర్స్ రెపో రేట్‌ అంటే ఏంటి?
రెపో రేట్‌ అంటే.. ఆర్‌బీఐ నుంచి రుణం తీసుకున్నందుకు బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు. రెపో రేట్‌లో మార్పు వచ్చినప్పుడల్లా పర్సనల్ లోన్ నుంచి కార్ లోన్, హోమ్ లోన్ వరకు ప్రతి రుణంపై బ్యాంక్‌ వడ్డీ రేట్లు మారతాయి. రెపో రేట్‌ తగ్గితే బ్యాంక్‌ రేట్లు తగ్గుతాయి. రెపో రేట్‌ పెరిగితే బ్యాంక్‌ రేట్లు పెరుగుతాయి. అంటే, రుణ వడ్డీ రేట్లు పెరుగుతాయి. రివర్స్‌ రెపో రేట్‌ అంటే.. తన దగ్గర డిపాజిట్ చేసిన డబ్బుపై బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ చెల్లించే వడ్డీ రేటు.


EMIలపై తగ్గని భారం - FDలపై అధిక ఆదాయం
రెపో రేట్‌ తగ్గుతుందని, తద్వారా వడ్డీ రేట్లు &EMI భారం నుంచి కొంత ఉపశమనం దొరుకుతుందని ఆశించినవారికి ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటన నిరాశను కలిగించింది. రెపో రేట్‌లో ఎటువంటి మార్పు లేదు కాబట్టి EMI భారంలోనూ ఎటువంటి మార్పు ఉండదు. అయితే... ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో (FDs) డబ్బు పెట్టుబడి పెట్టేవాళ్లకు మాత్రం ఇది శుభవార్త. రెపో రేట్‌ అధిక స్థాయిలోనే కొనసాగుతుంది కాబట్టి, FDలపైనా అధిక వడ్డీ ప్రయోజనం కొనసాగుతుంది.


ద్రవ్యోల్బణంపై ఆందోళన
దేశంలో చిల్లర ద్రవ్యోల్బణాన్ని (Retail Inflation) 4 శాతం దిగువకు తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ కోరుకుంటోంది. గత నెలలో, రిటైల్ ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్టానికి పడిపోయింది, 4.83 శాతానికి చేరింది. ఇది ఇప్పటికీ ఆర్‌బీఐ లక్ష్యం కంటే చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా, ఆహార ద్రవ్యోల్బణం (Food Inflation) చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం రేటు మే నెలలో నాలుగు నెలల గరిష్ట స్థాయి 8.7 శాతానికి చేరుకుంది.


మరో ఆసక్తికర కథనం: ఆధార్‌ కార్డ్‌ హోల్డర్లకు మిగిలింది మరో వారమే - గడువు దాటితే జేబుకు చిల్లు!