Vizianagaram MP Kalisetti Appalanaidu: టీడీపీ తరఫున కొత్తగా ఎన్నికైన ఎంపీలతో గురువారం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ‘అప్పలనాయుడూ.. ఢిల్లీ వెళ్లడానికి విమాన టికెట్ ఉందా? లేకపోతే చెప్పు మనవాళ్లు టికెట్ బుక్ చేస్తారు’ అంటూ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని చంద్రబాబు ఆప్యాయంగా అడిగారు. ఈ సన్నివేశం అక్కడ ఉన్న ఇతర ఎంపీలను భావోద్వేగానికి గురిచేసింది. అప్పలనాయుడు లాంటి సామాన్య కార్యకర్తకు లోక్‌సభ టికెట్ ఇచ్చి, ఆయన్ను గెలిపించి, ఆయన స్థితిగతులను ఆరాతీయడం, విమాన టికెట్ గురించి అడిగి తెలుసుకోవడం చంద్రబాబు నాయకత్వం, మంచితనానికి నిదర్శనమని చెప్పుకోవడం కనిపించింది.
గాల్లో విహరించొద్దు
ఉండవల్లిలోని తన నివాసంలో ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కీలక నేతలు పాల్గొన్నారు. కార్యక్రమానికి అందుబాటులోని లేని వారు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో మంత్రివర్గ కూర్పు, టీడీపీకి ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో విహరించొద్దని గెలిచిన ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ప్రజలు టీడీపీపై నమ్మకంతో గొప్ప విజయాన్ని అందించారని, దీనికి సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు.
వైసీపీ ఎంపీల పైరవీలు
గతంలో వైసీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోలేదని, జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే టీడీపీ ఎంపీల ప్రథమ కర్తవ్యం కావాలని ఆదేశించారు. అందుకు తగ్గట్టుగానే పార్లమెంట్‌లో కృషి చేయాలని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలని సూచించారు. పదవులు శాశ్వతం కాదని, వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుంది అని గుర్తించాలన్నారు.
ప్రతి ఒక్కరికి అవకాశం
సామాన్య కార్యకర్తకు, చిన్న నాయకులకు పార్టీలో పదవులు, అవకాశాలు కల్పించేలా తన నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎంపీలు, నాయకులు కూడా అదే విధానాన్ని అనుసరించాలని సూచించారు. కష్టపడి, విధేయతతో పనిచేస్తే పదవులు వస్తాయనడానికి అప్పలనాయుడే ఉదాహరణని తెలిపారు. అప్పలనాయుడికి ఎంపీ టికెట్ ఇస్తే, చాలామంది చాలా రకాలుగా మాట్లాడారని, కానీ ఆయన అందర్నీ కలుపుకొనిపోయి, కష్టపడి పనిచేసి గెలిచారని అన్నారు. అప్పలనాయుడు ఆర్థికంగా బలవంతుడు కాకపోయినా టికెట్ ఇచ్చామని, పార్టీలో సామాన్య కార్యకర్తలకూ అవకాశాలు వస్తాయనడానికి ఆయనొక ఉదాహరణని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన కలిశెట్టి
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌ను కలిశారు. తనకు ఎంపీగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని కలిసి పూజలు నిర్వహించారు. చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, ప్రజలందరి ఆశీర్వాదంతోనే ఎంపీగా ఘనవిజయం సాధించానని ఆయన చెప్పారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని కలిశెట్టి తెలిపారు. పార్లమెంట్‌లో విజయనరగం వాణి వినిపిస్తానని, సమస్యల పరిష్కారానికి తన వంతు పోరాటం చేస్తానని ఆయన చెప్పారు.