ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మంత్రి వర్గ కూర్పుపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. కూటమిగా పోటీ చేసి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీడీపీ, జనసేన బీజేపీ కూటమిలో ఎవరు మంత్రులు కాబోతున్నారు. ఎవరికి ఎలాంటి పదవులు వస్తాయనే చర్చ విస్తృతంగా నడుస్తోంది. అదే టైంలో కేంద్రంలో కూడా టీడీపీ భాగమైన వేళ అక్కడ ఎలాంటి పాత్ర పోషించనుంది అనే అంశంపై కూడా మాట్లాడుకుంటున్నారు. వీటన్నింటిపై చంద్రబాబు క్లారిటీ ఇస్తున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా ఈసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన లోకేష్ కొత్త ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించనున్నారు అనే ఆసక్తి చాలా మందిలో ఉంది. కొందరు పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నట్టు పార్టీ బాధ్యతలు తీసుకుంటారా... లేకుండా ప్రభుత్వంలో భాగమవుతారా అనే డిస్కషన్ జరిగింది. కచ్చితంగా ప్రభుత్వంలో భాగంగా ఉండారని మెజార్టీ నేతలు అభిప్రాయం . గురువారం ముఖ్యులతో సమావేశమైన చంద్రబాబు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినట్టు చెబుతున్నారు.
భారీ మెజార్టీతో విజయం సాధించిన లోకేష్‌ను ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్టు వెల్లడించారు. గతంలో కూడా మంత్రిగా పని చేసిన లోకేష్ కీలకమైన శాఖలు తీసుకున్నారు. గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలను తీసుకున్నారు. ఆ టైంలో తనదైన పాత్ర పోషించి మంచి మార్కులే సంపదించారు. మరి ఈసారి ఎలాంటి పోర్టు ఫోలియో ఇస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.
ప్రభుత్వం బయట పార్టీ బాధ్యతలో ఉంటే కీలకమైన నిర్ణయాలు, సమావేశాల్లో పాల్గొనే ఛాన్స్ ఉండదని... అందుకే కచ్చితంగా లోకేష్‌ను ప్రభుత్వంలో భాగం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. మంత్రిగా గతంలో పని చేసిన లోకేష్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో ఈసారి కూడా తీసుకోవడంపై ఎవరూ అభ్యంతరం చెప్పరనే చర్చ నడుస్తోంది.
ఈ నెల 11న తెలుగుదేశం శాసనసభ పక్షం సమావేశం అవుతుంది. అక్కడ చంద్రబాబును టీడీపీఎల్పీగా ఎన్నుకుంటారు. తర్వాత రోజు అంటే 12న ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. ఈ ప్రమాణ స్వీకారానికి నరేంద్రమోదీ రానున్నారు. ఆయనతోపాటు బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంలు కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది.