RBI Repo Rate Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ)ను మరో 50 బేసిస్ పాయింట్లు పెంచి, 5.90 శాతానికి చేర్చింది. దీంతో సామాన్యులపై వడ్డీ రేట్ల భారం మరింత పెరగనుంది.


ఈ నెల 28-29 తేదీల్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. 


సామాన్యుడిపై


రెపో రేటు మళ్లీ పెంచడం వల్ల ఇల్లు, వాహనం, వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారి ఈఎంఐ మరింత పెరుగుతుంది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారి నెలవారీ వాయిదా మొత్తం/రుణం చెల్లింపు కాలం పెరుగుతుంది. బ్యాంకు రుణం తీసుకుని, కొత్తగా ఇల్లు కొనాలని అనుకునే వారికీ ఇబ్బందే. ఆదాయానికి తగ్గట్లు ఇచ్చే రుణం మొత్తం తగ్గుతుంది.  


ప్రస్తుతం అన్ని బ్యాంకులూ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్కుగా రెపో రేటును తీసుకుంటున్నాయి. దీంతో బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేందుకు ఏమాత్రం ఆలస్యం చేయవు. 


అందుకే


ద్రవ్యోల్బణ నియంత్రణ కోసమే ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు, రుణ రికవరీపై ప్రభావం పడకుండా వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది.


మే లో 0.40 శాతం; జూన్‌, ఆగస్టులో 0.50 శాతం చొప్పున, తాజాగా మరో 0.50 శాతం పెంచడంతో 4 నెలల వ్యవధిలోనే రెపోరేటు 1.90 శాతం పెరిగింది. 


అసలు కొంత మందికి రెపో రేటు, రివర్స్ రెపో రేటు అంటే ఏంటి? అని సందేహం ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.


రేపో రేటు


ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రేపో రేటు అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. స్వల్ప కాలికంగా దేశంలో ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రేపో రేటును నిర్ణయిస్తారు.


రేపో రేటున‌ను తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు త‌క్కువ‌కే రుణాలు వ‌స్తాయి. ఈ ప్ర‌భావంతో కంపెనీలకు, వ్యక్తులకు రుణాల వడ్డీ రేటును వాణిజ్య బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి రేపో రేటు తగ్గించినా దానిని సామాన్యుల‌కు బ‌ద‌లాయించేందుకు బ్యాంకులు ఆసక్తి చూపకపోవచ్చు. ఇందుకు బ‌దులుగా ఆదాయం పెంచుకోవాలని చూస్తాయి.


రివర్స్ రేపో రేటు


బ్యాంకులు తమ వద్ద డబ్బు ఎక్కువగా ఉంది అనుకుంటే దానిని రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా ఇవ్వొచ్చు. అలా వాణిజ్య బ్యాంకుల వద్ద రుణాలుగా తీసుకున్న మొత్తానికి ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రేపో రేటు అంటారు. ఇది రెపో రేటు క‌న్నా తక్కువగా ఉంటుంది.


మార్కెట్లో స్థిరత్వం లేన‌ప్పుడు బ్యాంకులు తమ అదనపు డబ్బును ఆర్‌బీఐ వ‌ద్ద ఉంచి త‌క్కువైనా స‌రే స్థిర‌ వడ్డీ ఆదాయాన్ని పొందేందుకు ఆస‌క్తి చూపిస్తాయి.


రివర్స్ రెపో రేటు శాతాన్ని గ‌తంలో రెపో రేటు వ‌డ్డీ శాతానికి సంబంధం లేకుండా నిర్ణయించేవారు. 2011 నుంచి దీంట్లో మార్పులు తీసుకొచ్చారు. అప్ప‌ట్లో ఆర్‌బీఐ దీనిని రెపో రేటుతో అనుసంధానం చేసింది. రెపో రేటు మారినప్పుడల్లా రివ‌ర్స్ రెపో రేటును దానికంటే 1 శాతం తక్కువ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.


Also Read: Viral Video: పీక నొక్కుతూ, జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ- విద్యార్థిపై టీచర్ ప్రతాపం!


Also Read: Congress President Election: కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేసులో మరో ట్విస్ట్, చివరి నిముషంలో తెరపైకి మల్లికార్జున్ ఖార్గే పేరు