సీఎం కేసీఆర్‌ శుక్రవారం (సెప్టెంబరు 30) యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరి 11.30 గంటలకు యాదాద్రి ఆలయానికి చేరుకుంటారు. మళ్లీ మధ్యాహ్నం దాటాక హైదరాబాద్ కు వస్తారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా, ఉదయం 11 గంటలు సాయంత్రం 3.30 గంటలకు ఈ ప్రాంతాలు లేదా మార్గాల్లో ట్రాఫిక్ నిలిపివేయవచ్చు లేదా మళ్లించవచ్చు.


NGRI మెట్రో స్టేషన్, జెన్‌పాక్ట్, హనుమాన్ దేవాలయం, ఉప్పల్ ఎక్స్ రోడ్, వీటీ కమాన్, టయోటా, నల్ల చెర్వు కట్ట, పీర్జాదిగూడ ఎక్స్ రోడ్, ఉప్పల్ బస్ డిపో, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచెర్ల ఎక్స్ రోడ్, సీపీఆర్‌ఐ, నారపల్లి, కొర్రెముల వై జంక్షన్, మెక్ డొనాల్డ్స్, ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్, బీబీనగర్, యాదాద్రి పట్టణం మీదుగా సీఎం కాన్వాయ్ మూమెంట్ నేడు ఉండనుంది. కాబట్టి, ఉదయం 11 గంటలు సాయంత్రం 3.30 గంటలకు ప్రాంతాల్లో ఈ మార్గాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడనుంది. ఈ మార్గాల గుండా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవచ్చని పోలీసులు సూచించారు.


స్వామికి కిలో బంగారం 
యాదాద్రి ఆలయంలో సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు చేయించనున్నారు. కిలో బంగారాన్ని స్వామి వారికి కానుకగా సమర్పిస్తారు. మొక్కు తీర్చుకున్న తర్వాత.. ఆయన ఆలయ అభివృద్ధి పనులపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులతో సమీక్ష చేస్తారు. కేసీఆర్‌ అక్కడే భోజనం చేసి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌కు తిరిగి చేరుకుంటారు. 


రేపు వరంగల్‌కు కేసీఆర్ 
అక్టోబర్ 1న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్‌లోని ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ రిలీఫ్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొంటారు. వరంగల్ పర్యటన కోసం శనివారం ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరి ఉదయం 11.15 గంటలకు వరంగల్ చేరుకుంటారు. మధ్యాహ్నం ప్రతిమ రిలీఫ్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ ప్రారంభం చేస్తారు. ప్రారంభ కార్యక్రమం పూర్తయిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు ప్రయాణం అవుతారు.


హైదరాబాద్‌లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్


హైదరాబాద్‌ నగరంలో రోడ్లపై వాహనాల రద్దీ రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఫలితంగా రోడ్లపైన ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. అంతకుముందు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడే వారు కూడా కొవిడ్ తర్వాత సొంత వాహనాలను అలవాటు పడ్డారు. దిగువ మధ్య తరగతి కూడా తంటాలు పడి సొంత వాహనం కొనుక్కున్న వారూ ఉన్నారు. దీంతో ప్రస్తుతం నగరంలో రోజు దాదాపు 80 లక్షల వాహనాలు తిరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల లెక్కలో తేలింది. 2019తో పోలిస్తే ఏకంగా 18 శాతం పెరిగాయి. బైక్ లే అత్యధికంగా దాదాపు 56 లక్షల వరకు ఉన్నాయి. మరో 14 లక్షల కార్లు ఉన్నాయని పోలీసుల అధ్యయనంలో తేలింది.