Paytm: ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అయిన పేటీఎంకు వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. నిబంధనలు-2020 పాటించలేదని పేటీఎం సహా యుని వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు 15 వేల జరిమానా విధించింది. అంతే కాకుండా వాటిని 15 రోజుల్లోనే ఫిర్యాది దారుడుకు చెల్లించాలని సూచించింది. 


అసలేం జరిగిందంటే..?


హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థి అకాశ్ భగేల్కర్.. పేటీఎం ద్వారా ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు చెందిన ఉషా జానోమ్ వండర్ స్టిచ్ ఆటోమెటిక్ జిగ్ జాగ్ ఎలక్ట్రిక్ సూయింగ్ మెషీన్ ను కొనుగోలు చేశాడు. రెండేళ్ల క్రితం 13 వేల 499 రూపాయలు చెల్లించి ఈ మెషీన్ ను కొనుగోలు చేయగా.. 2020 ఆగస్టు 15వ తేదీన డెలివరీ అయింది. ఈ క్రమంలోనే రెండు వేల రూపాయల క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది. అయితే కుట్టు యంత్రం మాత్రం బాగాలేదు. చాలా నాసిరకంగా ఉండటం, కంట్రీ ఆఫ్ ఆరిజన్ థాయిలాండ్ లో ఉండటటంతో మోసపోయానని ఫిర్యాదిదారుడు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని పరిహారం ఇప్పించాలని కోరాడు. 


ఇ-కామర్స్ నిబంధనల మేరకు ఆన్ లైన్ లో విక్రయ సంస్థ పేరు, రిజిస్టర్ అయిందా లేదా బిజినెస్ పేరు, వస్తు సేవలు, నాణ్యత, ఫీచర్స్, జియోగ్రాఫిక్ చిరునామా, ప్రధాన కార్యాలయం, శాఖల వివరాలు, వెబ్ సైట్ కస్టమర్ కేర్ నెంబర్, రేటింగ్, ఫీడ్ బ్యాక్ ఇలా అన్నీ ప్రదర్శించాలి. అప్పుడు వాటిని పరిశీలించి కొనాలా వద్దా అని వినియోగదారుడు నిర్ణయించుకునే వీలుంటుంది. కానీ అవేమీ పేటీఎం ప్రదర్శించలేదని ఫిర్యాదిదారుడు పేర్కొనగా విచారించిన కమిషన్.. పేటీఎం, యుని వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా రూ.15 వేలు చెల్లించాలని తెలిపింది. అంతే కాకుండా 45 రోజుల్లో ఫిర్యాదిదారుడికి చెల్లించాలని సూచించింది. 


నెలరోజుల క్రితం పేటీఎంకు గట్టిదెబ్బ..


ఇన్‌స్టంట్‌ లోన్స్‌, డిజిటల్‌ లోన్స్‌.. పేరు ఏదైనా, తీసుకున్నవాడి పీకల మీదకు వస్తోందా అప్పు. 3 నిమిషాల్లో లోన్‌ ఇస్తామంటూ కబుర్లు చెప్పి, వసూలు చేసే సమయంలో మాత్రం 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి స్మార్ట్‌ఫోన్‌ బేస్‌డ్‌ లోన్‌ యాప్స్‌. రూపాయికే రుణాలంటూ ఆశ చూపి, తీర్చే సమయానికి అసలు కంటే వడ్డీనే ఎక్కువగా పిండేస్తున్నాయి. అంతేకాదు, లోన్ వసూళ్లను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించి, వాళ్లతో గూండాగిరీ చేయిస్తున్నాయి. ఇవన్నీ దాదాపుగా చైనా యాప్సే కావడం విశేషం. ఈ మొబైల్‌ యాప్‌ లోన్స్‌ వసూళ్ల దందాలపై ఫిర్యాదులు పెరిగి పోవడంతో ఒకవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), మరోవైపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దర్యాప్తులు చేపట్టాయి.


అక్రమ లోన్లను ఈడీ సీరియస్‌గా తీసుకుంది. శుక్రవారం, బెంగళూరులోని రజోర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ వంటి ఆన్‌లైన్ పేమెంట్‌ గేట్‌వేల కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. చైనా సంస్థలు లేదా చైనీస్‌ వ్యక్తులు నియంత్రిస్తున్న "చట్టవిరుద్ధ" ఇన్‌స్టాంట్‌ స్మార్ట్‌ఫోన్ బేస్డ్‌ రుణాలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా సోదాలు నిర్వహించామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని కూడా వెల్లడించింది. చైనా వ్యక్తుల నియంత్రిస్తున్న ఈ సంస్థల మర్చంట్‌ ఐడీలు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉంచిన రూ.17 కోట్ల విలువైన నిధులను స్వాధీనం చేసుకుంది.