వినియోగదారులకు మేలు చేసే రెండు కీలక పథకాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరిధిలోని 'రిటైల్‌ డైరెక్ట్‌ స్కీం', 'ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మన్‌ స్కీం'ను ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ పాల్గొన్నారు.






ఆర్‌బీఐ రిటైల్‌ స్కీం అంటే?


ఫిబ్రవరి విధాన సమీక్షలో ఈ పథకం గురించి ఆర్‌బీఐ మొదటి సారి చెప్పింది. దీనినో భారీ సంస్కరణగా వర్ణించింది. రిటైల్‌ ఇన్వె్స్టర్లు ప్రభుత్వ సెక్యూరిటీలను సులభంగా కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించడమే దీని ఉద్దేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే సెక్యూరిటీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టొచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో ఆర్‌బీఐ వద్ద ఉచితంగా ఈ ఖాతాను తెరవొచ్చు.


గతంలో ఈ సెక్యూరిటీలు కేవలం బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్దే లభించేవి. డీమ్యాట్‌, మ్యూచువల్‌ ఫండ్ల ద్వారానూ ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, రాష్ట్ర అభివృద్ధి రుణాలు, సార్వభౌమ పసిడి బాండ్లు మొదలైనవి కొనుగోలు చేయొచ్చు. సేవింగ్స్‌ బ్యాంక్ ఖాతా, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, యూపీఐ విధానంలో డబ్బులు చెల్లించొచ్చు.


ప్రభుత్వ సెక్యూరిటీలు (G-secs) అంటే?


సులభంగా చెప్పాలంటే ప్రభుత్వాలు డబ్బు అవసరమైనప్పుడు ప్రజల వద్ద నుంచి సెక్యూరిటీల రూపంలో అప్పు తీసుకుంటాయి. ఒక విధంగా ఇవి రుణ సాధనాలు. ఇవి రెండు రకాలు. 91, 182, 364 రోజులు, సుదీర్ఘ కాల పరిమితితో కూడిన ట్రెజరీ బిల్లులు ఒక రకం. 5-40 ఏళ్ల మెచ్యూరిటీతో కూడిన సెక్యూరిటీలు మరోరకం.


ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మన్‌తో లాభం ఏంటి?


వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా సమ్మిళిత అంబుడ్స్‌మన్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆర్‌బీఐ పరిధిలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై 2017-18లో 1.64 లక్షలుగా ఉన్న ఫిర్యాదులు 2019-20కి 3.30 లక్షలకు పెరగడంతో ఈ పథకం రూపొందించారు.


ఆర్‌బీఐలో గతంలోనే మూడు రకాల పరిష్కార వేదికలు ఉండేవి. 1995లో బ్యాకింగ్‌ అంబుడ్స్‌మన్‌, 2018లో బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ అంబుడ్స్‌మన్‌, 2019లో డిజిటల్‌ లావాదేవీల అంబుడ్స్‌మన్‌ వేదికలను ఆరంభించారు. వీటన్నిటికీ సరళీకరించి ఒకే అంబుడ్స్‌మన్‌గా రూపొందించాలని ప్రభుత్వం భావించింది. అన్ని రకాల ఫిర్యాదులు దీనికే అందేలా మార్గదర్శకాలు రూపొందించింది. 'ఒకే దేశం ఒకే అంబుడ్స్‌మన్‌' విధానం అవలంభిచనుంది. ఫలితంగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకింగేతర చెల్లింపుల వ్యవస్థ కంపెనీల ఫిర్యాదులు ఇప్పుడు ఒకే గొడుకు కిందకు వస్తాయి.


సమ్మిళిత పరిష్కార వేదిక వల్ల వినియోగదారుడు ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఈమెయిల్‌ లేదా భౌతికంగా ఫిర్యాదు చేసి రసీదు పొందొచ్చు. ఫిర్యాదులో ప్రత్యేకంగా ఫలానా అంబుడ్స్‌మన్‌ అని రాయనక్కర్లేదు. ఒకే అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదులు చేయొచ్చు. పత్రాలు సమర్పించొచ్చు. ఫిర్యాదు పరిస్థితి తెలుసుకోవచ్చు. ఫీడ్‌బ్యాక్‌ పొందొచ్చు. భాషా పరమైన ఇబ్బందులు రాకుండా అన్ని భాషల వారూ ఫిర్యాదులు చేసేలా ఒక టోల్‌ఫ్రీ నంబర్ ఉంటుంది. ఫిర్యాదు చేసేటప్పుడు వారి సలహాలు తీసుకోవచ్చు.


Also Read: EPFO Update: ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు శుభవార్త! మరణ పరిహారం రెట్టింపు చేసిన కేంద్రం.. ఎంత వస్తుందంటే?


Also Read: Nykaa IPO: ఒక్క ఐపీవోతో రూ.45వేల కోట్లకు అధిపతిగా ఫాల్గుణి నాయర్‌..! స్వయంకృషితో ఎదిగిన ఏకైక మహిళగా రికార్డు!


Also Read: RBI on Cryptocurrency: క్రిప్టోపై ఆర్‌బీఐ గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు..! ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్‌


Also Read: Zomato Update: జొమాటో సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ వ్యాపారాలన్నీ క్లోజ్‌.. ఎందుకంటే?


Also Read: Credit Score: క్రెడిట్‌ స్కోర్‌ ఎలా పెంచుకోవాలో తెలియదా? ఇలా చేస్తే సులభంగా పెంచుకోవచ్చు..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి