రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారని చాలాసార్లు వింటుంటాం! కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరూ రాత్రికి రాత్రే సంపన్నులు అయిపోరు! అందుకు కొన్నేళ్లుగా కష్టపడి ఉంటారు. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపి ఉంటారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఉంటారు. ఆ శ్రమకు తగిన సమష్టి ఫలం మాత్రం ఒక్క రాత్రిలో అందరికీ కనిపిస్తుంది!


ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ 'నైకా' స్థాపకురాలు ఫాల్గుణి నాయర్‌ ఈ కోవకే చెందుతారు. మొదట ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా పనిచేసిన ఆమె 50 ఏళ్ల వయసులో 'నైకా'ను ఆరంభించారు. తన తెలివితేటలు, ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలను ఉయోగించుకొని దేశంలోనే అద్భుతమైన బ్రాండ్‌గా తీర్చిదిద్దారు. మగువల అందచందాలను మరో స్థాయికి తీసుకెళ్లే ఉత్పత్తులను తయారు చేశారు. స్వయం కృషితో భారతదేశంలోని టాప్‌-5 సంపన్న మహిళల జాబితాలో చేరారు.


ఐపీవో సూపర్‌ హిట్‌
'నైకా' కంపెనీ బుధవారం భారత స్టాక్‌ మార్కెట్లలో నమోదైంది. ఆ కంపెనీ ఐపీవో సూపర్‌ డూపర్‌ హిట్టైంది. ఊహించని రీతిలో స్పందన రావడంతో కంపెనీ మార్కెట్‌ విలువ ఒక్కసారిగా లక్ష కోట్ల రూపాయాలకు చేరుకుంది. ఇక ఫాల్గుణి నెట్‌వర్త్‌ విలువ ఏకంగా 6.5 బిలియన్‌ డాలర్లు (దాదాపుగా రూ.45 వేల కోట్లకు పైగా) చేరుకుంది. స్వయం కృషితో ఇంత సంపద సృష్టించిన మహిళా వ్యాపార వేత్తగా రికార్డు సృష్టించారు.


'నైకా' అంటే సంస్కృతంలో కథానాయిక అని అర్థం


వందశాతం ప్రీమియంతో లిస్ట్‌
నైకా మాతృసంస్థ పేరు ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ-కామర్స్‌ వెంచర్స్‌. ఈ కంపెనీ ఐపీవోకు దాదాపుగా 82 రెట్ల స్పందన లభించింది. దాదాపు 100 శాతం ప్రీమియంతో మార్కెట్లో నమోదైంది. ఆఫర్‌ ధర రూ.1100-1200 మధ్య ఉంటే రూ.2000-2100 మధ్య షేర్లు ట్రేడ్‌ అయ్యాయి. ఇక అంతకు ముందే కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల ద్వారా రూ.2,396 కోట్లు సమీకరించింది. ఈ ఏడాది ఆగస్టులోనే యూనికార్న్‌ క్లబ్‌లో చేరింది.


మొదట ఆన్‌లైన్‌
ఫాల్గుణి నాయర్‌ ఈ కంపెనీని 2012లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం ముంబయి. మొదట ఫ్యాషన్‌, బ్యూటీ ఉత్పత్తులను ఆన్‌లైన్‌ వేదికగా విక్రయించారు. ఆ తర్వాత ఆఫ్‌లైన్‌ స్టోర్లు మొదలు పెట్టారు. ప్రస్తుతం కంపెనీకి 76 స్టోర్లు ఉన్నాయి. రెండు కుటుంబ ట్రస్టుల ద్వారా నాయర్‌కు కంపెనీలో వాటాలు ఉన్నాయి. మరో ఏడుగురు ప్రమోటర్లూ ఉన్నారు.


ఏడో మహిళ
భారత మహిళా బిలియనీర్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఏడో మహిళగా ఫాల్గుణి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం సావిత్రీ జిందాల్‌ (18 బిలియన్‌ డాలర్లు), వినోద్‌ రాయ్‌ గుప్తా (7.8 బిలియన్‌ డాలర్లు), లీనా తివారీ (4.4 బిలియన్‌ డాలర్లు), కిరణ్‌ మజుందార్‌ షా (3.9 బిలియన్‌ డాలర్లు), దివ్యా గోకుల్‌నాథ్‌ (4.5 బిలియన్‌ డాలర్లు), మల్లికా శ్రీనివాసన్‌ (2.89 బిలియన్‌ డాలర్లు) ఈ జాబితాలో ఉన్నారు.


Also Read: Credit Card Spends: అయ్య బాబోయ్‌..! క్రెడిట్‌ కార్డులతో లక్ష కోట్లు గీకేశారు..! రికార్డులు బద్దలు


Also Read: Online Term Plan: ఆన్‌లైన్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!


Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్‌ మొదలైంది.. వివరాలు ఇవే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి