By: ABP Desam | Updated at : 16 Aug 2022 05:50 PM (IST)
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ( Image Source : Getty )
వివిధ బ్యాంకుల్లో అప్పుల రికవరీ కోసం ప్రైవేటు సంస్థలకు రికవరీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయా సంస్థల సిబ్బంది అప్పులు చెల్లించాల్సిన వారి పట్ల హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
కోవిడ్ సమయంలో చాలామంది చిన్న మధ్య తరహా వ్యాపారులు, ఉద్యోగస్తులు జీవితాన్ని గడిపేందుకు రుణాలు తీసుకున్నారు. ఇదే అదనుగా యాప్‌ల ద్వారా లోన్లు ఇచ్చేవారు కూడా చాలా మంది మార్కెట్‌లోకి ప్రవేశించారు. అయితే, రుణాలు ఇచ్చిన తర్వాత వాటి వసూలు కోసం వారు అవలంబించే విధానాలతో చాలా మంది ప్రాణాలు తీసుకున్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఇటీవలి కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందని లోన్ యాప్స్ పెరిగిపోయాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వ్యక్తిగత లోన్లను మంజూరు చేసేటప్పుడు సాధారణంగా సదరు వ్యక్తి సిబిల్ స్కోర్ లేదా ఆధార్ లాంటి వివరాలను తీసుకుని ఇస్తారు. ఇందుకు తెలిసిన వ్యక్తులు లేదా ఆ రుణం చెల్లించేందుకు హామీ ఇచ్చిన వ్యక్తుల వివరాలను కూడా తీసుకుంటారు. బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న వ్యక్తి ఆ రుణాన్ని చెల్లించలేని పక్షంలో బ్యాంకు వినియోగదారులకు నోటీసు పంపిస్తుంది. స్పందించకుంటే రుణాన్ని వసూలు చేసే బాధ్యతను లోన్ రికవరీ ఏజెంట్లకు లేదా సంస్థకు అప్పగిస్తుంది. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం లేకుండా రుణాలను మంజూరు చేస్తున్న యాప్స్ పై ఎవరి పర్యవేక్షణా ఉండటం లేదు. ఈ లోన్ యాప్స్ నిర్వాహకులు వినియోగదారుల ఫోన్ యాక్సెస్ తీసుకుంటారు. రుణాన్ని చెల్లించనప్పుడు కాంటాక్ట్స్ అందరికీ సమాచారం ఇవ్వడం లాంటి చవకబారు పనులకు పాల్పడుతున్నారు. ఇది వినియోగదారుల ప్రతిష్టను దెబ్బ తీయడమే కాకుండా, వారిని మానసిక వేదనకు గురి చేస్తోంది. ఒక్కొక్కసారి ఎటువంటి ఆధారాలు లేకుండా అప్పులు దొరుకుతున్నాయి. ఇలా మంజూరు చేసే రుణాలకు వడ్డీ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో, రెట్టింపు సొమ్ము చెల్లించే పరిస్థితి వస్తోంది. చెల్లించలేని పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
లోన్ రికవరీ ఏజెంట్లు ఎవరు?
రుణాలను నిర్ణీత సమయంలో చెల్లించలేనప్పుడు బ్యాంకులు వసూలు బాధ్యతను లోన్ రికవరీ ఏజెంట్లకు అప్పగిస్తాయి. వారు బ్యాంకు తరఫున పని చేస్తారు. ఇందుకోసం బ్యాంకులు వీరికి కొంత మొత్తం చెల్లిస్తాయి. అయితే, వీరు బ్యాంకు ఉద్యోగులు కాదు. థర్డ్ పార్టీ సిబ్బంది.
రికవరీ ఏజెంట్ల నియామకం చట్టబద్ధమేనా?
బ్యాంకులు రికవరీ ఏజెంట్లను నియమించుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్స్, అడ్వాన్సుల గురించి రూపొందించిన సర్క్యులర్‌లోని సెక్షన్ 2.5.2(i) ప్రకారం రుణాల వసూలు కోసం రికవరీ ఏజెంట్లు లేదా ఏజెన్సీలు నియమించిన సిబ్బంది ఉంటారు. అయితే, వీరిని నియమించుకునే ముందు బ్యాంకులు సదరు వ్యక్తుల గురించి సమగ్ర విచారణ నిర్వహించాలి. పోలీసు వెరిఫికేషన్, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించాలి. వీరికి రుణాల వసూలుకు సంబంధించి పాటించాల్సిన నిబంధనల గురించి తగిన శిక్షణ ఇస్తారు. రుణాలు వసూలు చేసే సిబ్బందికి కూడా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇచ్చే సర్టిఫికేట్ ఉండాలి.
రికవరీ ఏజెంట్లు పాటించాల్సిన నిబంధనలు ఏమిటి?
లోన్ రికవరీ ఏజెంట్లు ఋణం వసూలు చేసేందుకు వేధింపులకు పాల్పడకూడదని నిబంధనలు చెబుతున్నాయి.
ఆర్‌బీఐ జారీ చేసిన సర్క్యులర్‌ను అనుసరించి.. ఏ సమయంలో పడితే ఆ సమయంలో వినియోగదారులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టకూడదు. పొద్దున్న 7 నుంచి రాత్రి 7.30 నిమిషాల మధ్యలోనే రుణం చెల్లింపుల కోసం ఫోన్ చేయడంగానీ, ఇళ్లకు వెళ్లడంగానీ చేయాలి. బ్యాంకులు రికవరీ ఏజెంట్ల వివరాలను రుణ గ్రహీతకు తెలియచేయాలి. లేదా, రికవరీ ఏజెంట్లు రుణం వసూలు చేసేందుకు వెళ్ళినప్పుడు బ్యాంకులు తమకు అధికారికంగా ఇచ్చిన బాధ్యతకు సంబంధించిన పత్రాలను చూపించాలి. అప్పులు వసూలు చేసేందుకు లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడకూడదని కోర్టులు కూడా పేర్కొన్నాయి. రుణాలను వసూలు చేసేందుకు బలప్రయోగం చేయకూడదు. రుణాల వసూలు చట్టబద్ధంగా మాత్రమే చేయాలని గతంలో సుప్రీం కోర్టు పేర్కొంది.
లోన్ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తించినప్పుడు రుణ గ్రహీతలకుండే హక్కులేంటి?
లోన్ రికవరీ ఏజెంట్లు వేధింపులకు పాల్పడినప్పుడు బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. పోలీసులు చర్యలు తీసుకోకపోయినా, ఫిర్యాదు నమోదు చేయకపోయినా రుణ గ్రహీతలు నేరుగా సివిల్ కోర్టులో కేసు వేయవచ్చు. కోర్టులు లోన్ రికవరీ ఏజెంట్లను చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని ఆదేశించి ఇరు పార్టీలకు లాభదాయకంగా ఉండే విధంగా మధ్యే మార్గాన్ని సూచించే అవకాశం ఉంది. రుణ గ్రహీతలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఆర్‌బీఐ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సర్క్యులర్ 2.5.4 ప్రకారం ఈ నియమాలను ఉల్లంఘించి ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆ సంస్థ పేర్కొంది. ఇలా జరిగిన ఫిర్యాదులు వచ్చినప్పుడు బ్యాంకులు ఆ ప్రాంతాల్లో రికవరీ ఏజెంట్లను నియమించుకోవడాన్ని కొంతకాలం పాటు నిషేధించవచ్చు. బ్యాంకులు రుణ గ్రహీతల ఫిర్యాదులు స్వీకరించినప్పుడు ఆ కేసులను పరిష్కరించే వరకూ లోన్ రికవరీ ఏజెంట్లను పంపకూడదు.
Gold-Silver Prices Today 30 Nov: ప్యూర్ గోల్డ్, ఆర్నమెంట్ గోల్డ్ రేట్లు తగ్గాయ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Minor PAN Card: పిల్లల కోసం పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏంటి లాభం?
Gold-Silver Prices Today 29 Nov: నగలు కొనేవాళ్లకు రోజుకో షాక్ ఇస్తున్న గోల్డ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
ఎఫ్డి మ్యాక్స్: బజాజ్ ఫైనాన్స్ యొక్క తాజా అధిక- రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫర్
Good Personal Loan: అత్యవసర ఖర్చుల్లో ఉన్నారా ? - పెద్దగా భారం పడని నాలుగు పర్సనల్ లోన్ మర్గాలు ఇవిగో
Russia Ukraine War : ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక నష్టాల బాధ్యత ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
YSRCP Kannababu: పవన్ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్లకుండా ఆపిందెవరు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు