Raksha Bandan 2022: శుక్రవారమే రక్షాబంధనం! అన్నాదమ్ములకు రాఖీ కట్టి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ప్రతి సోదరి కోరుకుంటుంది. రక్ష కట్టిన తన తోబుట్టువు నిత్యం సంతోషంగా ఉండాలని సోదరులు తలుస్తారు. తమ స్థోమతకు తగిన బహుమతిని అందజేస్తారు. నగదు రూపంలో కాకుండా వారి ఆర్థిక భద్రతకు బాటలు వేసి అసలైన కానుక అందించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. డబ్బుకు బదులుగా కొన్ని ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు.


ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD)


భారత్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను (Fixed Deposits) అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తారు. సొమ్ముకు భద్రత ఉండటంతో పాటు ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది. రక్షాబంధన్‌ సందర్భంగా అక్కా చెల్లెల్లకు నగదు ఇవ్వడానికి బదులు ఎఫ్‌డీ చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంత మొత్తం ఫిక్స్‌డ్‌ చేయాలన్న నిబంధనేమీ లేదు. మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత మొత్తాన్నే ఎఫ్‌డీ చేస్తే మేలు. పైగా ఆటో రెన్యువల్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే సుదీర్ఘకాలం చక్రవడ్డీ రూపంలో డబ్బు సమకూరుతుంది. ఆర్బీఐ రెపో రేట్లు పెంచుతున్న నేపథ్యంలో ఎఫ్‌డీలపై బ్యాంకులు మంచి వడ్డీనే అందిస్తున్నాయి.


మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి


రాఖీ పండుగ సందర్భంగా మ్యూచువల్‌ ఫండ్లనూ (Mutual Fund SIP) సోదరీమణులకు బహుమతిగా అందించొచ్చు. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)లో మ్యూచువల్‌ ఫండ్లలో ఎలా మదుపు చేయొచ్చో నేర్పించొచ్చు. సిప్‌ ఆరంభించి మొదటి నెల మీరే స్వయంగా డబ్బు చెల్లిస్తే బాగుంటుంది.


Also Read: స్టాక్‌ మార్కెట్లు ఫైర్‌! 60K మరెంతో దూరంలో లేదు! 578 పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌


Also Read: డోక్లాం నేర్పిన గుణపాఠం! చైనా బోర్డర్లో 3,500 కి.మీ. రోడ్డు వేసిన భారత్‌


డిజిటల్‌ బంగారం బెస్ట్‌


బంగారాన్ని ఇష్టపడని మహిళలు ఉంటారా చెప్పండి! రాఖీ కట్టిన సోదరికి చాలామంది నగలను (Gold) బహూకరిస్తుంటారు. ఈ సారి వాటికి బదులుగా డిజిటల్‌ గోల్డ్‌ (Digital Gold) ఇవ్వండి. సార్వభౌమ పసిడి బాండ్లు (SGB), గోల్డు ఈటీఎఫ్‌లు (Gold ETFs), గోల్డు ఫండ్స్‌ను (Gold Funds) ఇవ్వొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఫిజికల్‌ గోల్డ్‌ బదులుగా డిజిటల్‌ గోల్డు తీసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థకూ మేలు కలుగుతుంది. ద్రవ్యలోటు తగ్గుతుంది.


బ్లూ చిప్‌ షేర్లు కొనివ్వండి


రాఖీ పండుగకు షేర్లను బహూకరించడం మంచి ఐడియానే! ఇందుకోసం మొదట మీ సోదరి పేరుతో డీమ్యాట్‌ ఖాతా తెరవాలి. ఆ తర్వాత మీరే స్వయంగా డబ్బు చెల్లించి కొన్ని బ్లూచిప్‌ కంపెనీల షేర్లు కొనివ్వండి. సుదీర్ఘ కాలంలో ఇవి మంచి రాబడిని ఇస్తాయి. పెట్టుబడి నష్టమూ ఉండదు. డివిడెండ్‌ రూపంలో నగదూ వస్తుంది.


ఆరోగ్య బీమాతో మేలు


ప్రస్తుత కాలంలో ఆరోగ్య బీమా (Health Insurance) అత్యవసరంగా మారిపోయింది. రాఖీ కట్టిన మీ సోదరి పేరుతో ఒక ఆరోగ్య బీమా కొనుగోలు చేయండి. మీరే ప్రీమియం చెల్లించండి. ఆమెతో పాటు వారి కుటుంబ సభ్యులకూ రక్షణ దొరుకుతుంది.