New Rules from December 2022:
ఎప్పట్లాగే డిసెంబర్ నెలలోనూ కొన్ని నిబంధనలు మారుతున్నాయి. అందులో కొన్ని మీ ఆర్థిక జీవితంపై ప్రభావం చూపించనున్నాయి. ప్రతి నెలా ఒకటో తారీకు సీఎన్‌జీ, ఎల్‌పీజీ గ్యాస్ ధరలను సవరిస్తుంటారు. ఈసారీ అలాగే జరగనుంది. ఇక జీవన ప్రమాణ పత్రం తుది గడువు ముగియనుంది. గడువు పొడగించే అంశంలో సందిగ్ధం నెలకొంది. ఇక బ్యాంకులు, స్టాక్ మార్కెట్లకు ఈసారి ఎక్కువ సెలవులే వచ్చాయి.
పీఎన్‌జీ, సీఎన్‌జీ ధరల్లో మార్పు
ప్రతి నెలా ఒకటో తారీకు లేదా తొలి వారంలో పీఎన్‌జీ, సీఎన్‌జీ ధరలను నిర్ణయిస్తారు. సాధారణంగా దిల్లీ, ముంబయిలో మొదటి వారంలో ధరలు సవరిస్తారు. కొన్ని నెలలుగా ఉన్న ట్రెండ్‌ను గమనిస్తుంటే దిల్లీ, ముంబయిలో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు పెరిగే అవకాశం ఉంది.
వంట గ్యాస్ ధరల్లో మార్పు!
సీఎన్‌జీ, పీఎన్‌జీ మాదిరిగానే వంట గ్యాస్ ధరలనూ ప్రతి నెలా మొదటి వారంలోనే సవరిస్తున్నారు. నవంబర్లో 19 కిలోల వాణిజ్య సిలిండరు ధరను ప్రభుత్వం తగ్గించింది. గృహ అవసరాలకు వినియోగించే 14 కిలోల సిలిండర్ ధరలో మార్పేమీ లేదు. అయితే ఈసారి ప్రభుత్వం ధరలను మరింత తగ్గిస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు.
బ్యాంకులకు 14 రోజులు సెలవు
ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిసెంబర్లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉన్నాయి. నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు వీకెండ్ సెలవులు. గురుగోవింద్ సింగ్ జయంతి, క్రిస్మస్ వంటి పర్వదినాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మూసేస్తారు. ఇవి కాకుండా స్థానిక పండుగలు, పర్వదినాలను బట్టి సెలవులు ఇస్తారు.
ముగిసిన లైఫ్ సర్టిఫికెట్ గడువు
పింఛన్ తీసుకుంటున్న వారు జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించేందుకు 2022, నవంబర్ 30 చివరి తేదీ. బుధవారంతో తుది గడువు ముగియనుంది. పింఛన్ అందుకుంటున్న బ్యాంకులో నేరుగా లేదా ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించొచ్చు. ఒకవేళ సర్టిఫికెట్ ఇవ్వకపోతే పెన్షన్ నిలిపివేసే ప్రమాదం ఉంది. వయో వృద్ధుల సౌకర్యం కోసం గడువు పొడగిస్తారో లేదో చూడాలి.
Also Read: లక్ష రూపాయల్ని రూ.14 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ షేరు!
Also Read: డిసెంబర్లో బ్యాంకులకు 14 రోజులు సెలవు! 31కు డబ్బు జాగ్రత్త!