Best Investment Plans for Childldren: పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం భారీ స్థాయిలో డబ్బు అవసరం. పిల్లల సురక్షితమైన భవిష్యత్తు కోసం, వాళ్ల కలల్ని సాకారం చేయడం కోసం సరైన ప్రణాళికతో పెట్టుబడులు ప్రారంభించాలి. పిల్లల పసితనం నుంచే ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభిస్తే, వారికి అవసరమైన సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. పిల్లల భవిష్యత్‌ లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి మొత్తాన్ని, కాలాన్ని నిర్ణయించుకోవాలి. 


మన దేశంలో అందుబాటులో ఉన్న ఉత్తమ పెట్టుబడి మార్గాలు:


ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ (Bank FD)
పిల్లలకు చిన్న వయస్సు ఉన్నప్పుడే వాళ్ల పేరిట కొంతమొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం ఒక మంచి నిర్ణయం. 7 రోజులు మొదలుకుని 10 సంవత్సరాల వరకు వివిధ కాల పరిమితుల ఆప్షన్లు ఈ FD స్కీమ్స్‌లో ఉన్నాయి. ఏ టెన్యూర్‌లో ఎక్కువ వడ్డీ వస్తుందో చూసుకుని, ఆ ఆప్షన్‌ ఎంచుకోవాలి. మెచ్యూరిటీ టైమ్‌లో దానిని మళ్లీ రీడిపాజిట్‌ చేయాలి. దీనిద్వారా, పెద్ద మొత్తంలో డబ్బు క్రియేట్‌ చేయొచ్చు. దీర్ఘకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద కొన్ని బ్యాంకులు 8% పైగా వడ్డీ ఇస్తున్నాయి.


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
మీ చిన్నారి కోసం మీరు తీసుకునే ఉత్తమ పెట్టుబడి నిర్ణయాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. ప్రస్తుతం, PPF ఇన్వెస్ట్‌మెంట్‌ మీద 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయవచ్చు. కావాలనుకుంటే ఆ తర్వాత మరో 5 ఏళ్లు పొడిగించవచ్చు. ఇందులో పెట్టుబడి పెడితే, ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద మీకు కూడా ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది.


రికరింగ్ డిపాజిట్ పథకం (RD) 
పోస్టాఫీస్‌ రికరింగ్ డిపాజిట్లకు మంచి ఆదరణ ఉంది.  మీకు దగ్గరలో ఉన్న పోస్టాఫీసులోనే ఈ పథకం కింద 5 సంవత్సరాల కాల పరిమితితో ఖాతా తెరవవచ్చు. ఈ పథకంలో మీకు 6.70 శాతం వడ్డీ లభిస్తుంది. త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీని మీ ఖాతాలో జమ చేస్తారు. మీ కుమారుడు/కుమార్తెకు ఏదైనా అవసరం వస్తే, ఈ డబ్బు ఉపయోగపడుతుంది.


మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds)
ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, పీపీఎఫ్‌, ఆర్‌డీ కంటే ఎక్కువ వడ్డీ కావాలంటే కొద్దిగా రిస్క్‌ తీసుకోవాలి. ఇందుకోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రారంభించవచ్చు. ఇందులో రిస్క్‌, రివార్డ్‌ రెండూ ఉంటాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో చాలా పథకాలు ఉన్నాయి. వీటిలో ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయవచ్చు, ప్రతినెలా కొంత మొత్తాన్ని (SIP) జమ చేస్తూ వెళ్లవచ్చు. తద్వారా దీర్ఘకాలంలో పెద్ద సంపద సృష్టించవచ్చు. SIP ద్వారా ప్రతి నెలా కనీసం రూ.100 పెట్టుబడి పథకంలోనూ చేరవచ్చు. 


సుకన్య సమృద్ధి యోజన (SSY)
ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక పథకం సుకన్య సమృద్ధి యోజన. ప్రస్తుతం, ఈ ఇందులో 8.20 శాతం వడ్డీ రాబడి లభిస్తుంది. ఈ పథకంలో, 0-10 సంవత్సరాల వయస్సున్న ఆడపిల్లల కోసం పెట్టుబడి పెట్టవచ్చు. ఒక సంవత్సరంలో కనిష్టంగా రూ. 250, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీ చిన్నారికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత లేదా 21 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, అప్పటివరకు జమ చేసిన డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడికి కూడా సెక్షన్ 80C కింద మినహాయింపు వస్తుంది.


సావరిన్ గోల్డ్ బాండ్ (SGB)
పెరిగిపోతున్న ద్రవ్యోల్బణానికి విరుగుడుగా గోల్డ్‌ పని చేస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడి పెడితే, సంవత్సరానికి 2.5 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. పైగా, 8 సంవత్సరాల టెన్యూర్‌ తర్వాత, ఆ రోజున బంగారానికి ఉన్న మార్కెట్‌ ధరను మీరు పొందొచ్చు. ఆ డబ్బు మీ చిన్నారి భవిష్యత్‌ అవసరాల కోసం ఉపయోగించొచ్చు.


SIP పద్దతిలో గోల్డ్ ETFలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.


మరో ఆసక్తికర కథనం: కొత్త శిఖరాన్ని తాకిన నిఫ్టీ, లోయర్‌ సైడ్‌ నుంచి అద్భుతమైన రికవరీ