Income Tax Return Filing 2024 - Section 80TTB: ఆదాయ పన్ను విషయంలో, సాధారణ ప్రజల కంటే 60 ఏళ్లు దాటిన (సీనియర్‌ సిటిజన్లు) వ్యక్తులకు కొన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు ఆర్థికంగా ఉపశమనం కలిగించడానికి, ఆదాయ పన్ను చట్టంలోకి సెక్షన్ 80TTBని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాదాపు ఆరేళ్ల క్రితం, 2018 కేంద్ర బడ్జెట్ సమయంలో ఈ సెక్షన్‌ను ప్రవేశపెట్టింది. 


ఈ సె వివిధ డిపాజిట్ల నుండి వచ్చే వడ్డీ ఆదాయంపై రూ. 50,000 తగ్గింపును అందించడం ద్వారా పన్ను ప్రయోజనాల కోసం భారతీయ నివాసితులైన 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులకు ఈ నిబంధన విలువైన పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.


సెక్షన్ 80TTB అంటే ఏంటి? ‍‌(What is Section 80TTB?)
సెక్షన్ 80TTB ప్రధాన లక్ష్యం.. 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులపై పన్ను భారాన్ని తగ్గించడం. వివిధ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై రూ. 50,000 తగ్గింపును (Tax deduction) ఈ సెక్షన్‌ అందిస్తుంది. 


సెక్షన్ 80TTB కింద టాక్స్‌ బెనిఫిట్‌ పొందాలంటే ఉండాల్సిన ఏకైక అర్హత.. 60 సంవత్సరాల వయస్సు నిండడం. 


సెక్షన్ 80TTB పరిధి
బ్యాంక్‌లు, పోస్టాఫీస్‌ల్లో సీనియర్ సిటిజన్లు చేసే సేవింగ్స్ అకౌంట్‌ డిపాజిట్లు, ఫిక్స్‌డ్ అకౌంట్‌ డిపాజిట్లు, రికరింగ్ అకౌంట్‌ డిపాజిట్లు, బాండ్‌లు/NCDలు, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) కింద చేసే డిపాజిట్‌లు సహా వివిధ రకాల డిపాజిట్‌ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై రూ. 50,000 మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. 


అంతేకాదు, TDS మినహాయింపు కూడా 80TTB సెక్షన్ కింద సీనియర్ సిటిజన్‌లకు వర్తిస్తుంది. సెక్షన్ 80TTB ఇచ్చిన మినహాయింపు ప్రకారం, సెక్షన్ 194A కింద, సీనియర్‌ సిటిజన్లకు వచ్చే వడ్డీ ఆదాయంపై TDS పరిమితిని రూ. 50,000 వరకు పొడిగించారు. అంటే, రూ. 50,000 వరకు ఉన్న వడ్డీ ఆదాయంపై బ్యాంకులు TDS తీసివేయలేవు. 


సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య పరమైన సమస్యలు, దాని సంబంధిత ఖర్చులు, ఇతర అవసరాలు ఉంటాయి. పైగా వాళ్లు వయస్సులో పెద్దవాళ్లు. కాబట్టి.. సీనియర్‌ సిటిజన్ల పెద్దరికాన్ని గౌరవిస్తూ, వాళ్ల అవసరాలకు డబ్బును అందుబాటులో ఉంచడానికి పన్ను మిహాయింపు పరిమితిని రూ. 50,000 చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు, పన్ను పడకపోవడం వల్ల ఆదా అయిన డబ్బును మళ్లీ పెట్టుబడిగా వినియోగిస్తారన్న ఆలోచన కూడా సెక్షన్ 80TTBని తీసుకురావడం వెనకున్న మరో కారణం.


సెక్షన్ 80TTA - సెక్షన్ 80TTB మధ్య తేడా
పన్ను చెల్లింపుదార్లు.. సెక్షన్ 80TTA - సెక్షన్ 80TTB మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. ఈ రెండు సెక్షన్లు రెండు వేర్వేరు వర్గాలకు వర్తిస్తాయి. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు (Individuals), హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUFs) కోసం సెక్షన్ 80TTA ను తీసుకొచ్చారు. దీని పరిధిలోకి కేవలం పొదుపు ఖాతాపై వచ్చే వడ్డీ మాత్రమే వస్తుంది, రూ. 10,000 వరకు తగ్గింపును అనుమతిస్తుంది. 


సెక్షన్ 80TTA వల్ల సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం ఉండదు. సెక్షన్ 80TTB కింద మాత్రమే వాళ్లు ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు. 


మరో ఆసక్తికర కథనం: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం