Change in Savings Trend of Indians: మన పెద్దవాళ్లు.. తమ కుమార్తె/ కుమారుడు/ రక్త సంబంధీకులు/ ఆప్తుల పేరిట కొంత మొత్తాన్ని బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) చేసి, దానిని సుదీర్ఘకాలం పాటు అలాగే ఉంచేసేవాళ్లు. లేదా, పోస్టాఫీస్‌లోనో/ బ్యాంక్‌లోనో సేవింగ్స్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి డబ్బు దాచేవాళ్లు. వాళ్లు పెద్దయ్యాక ఆ డబ్బు పెళ్లి, చదువులు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుందని ఇలా చేసేవాళ్లు. ఇవి సంప్రదాయ పొదుపు మార్గాలు. అయితే, ఈ ట్రెండ్‌ మారినట్లు ఇటీవలి సర్వే తేల్చి చెప్పింది.


మారుతున్న భారతీయుల పొదుపు అలవాట్లు


భారతీయులు చేసే పొదుపులను ప్రధానంగా రెండు రకాలుగా చూడొచ్చు. 1‌) నగదు రూపంలోని పొదుపులు (డిపాజిట్లు, జీవిత బీమా, ప్రావిడెంట్‌ ఫండ్స్‌, పెన్షన్‌ ఫండ్స్‌ వంటివి), 2) భౌతిక ఆస్తులు (స్థిరాస్తి, బంగారం, రవాణా వాహనాలు, పశువులు, పౌల్ట్రీ, యంత్రాలు వంటివి).


సగటున... ఇండియన్స్‌ చేసే మొత్తం సేవింగ్స్‌లో ఆర్థిక పొదుపుల వాటా 56 శాతం కాగా, భౌతిక ఆస్తుల వాటా 44 శాతం. ఆర్థిక పొదుపుల్లో... బ్యాంక్ & నాన్ బ్యాంక్‌ డిపాజిట్లది 37 శాతం వాటా అయితే, షేర్‌ మార్కెట్‌ వాటా 8 శాతం. 


భౌతిక ఆస్తుల్లో... 77 శాతం భూమి/భవనాల రూపంలో; 7 శాతం రవాణా వాహనాలు/పశువులు/పౌల్ట్రీ/యంత్రాలు వంటి వాటిలో; 11 శాతం బంగారం రూపంలో ఉంది.


ఇప్పుడు, భారతీయ కుటుంబాల డబ్బు క్యాష్‌ డిపాజిట్లలోకి కాకుండా క్యాపిటల్ మార్కెట్లలోకి వెళుతోందని BofA (Bank of America) సెక్యూరిటీస్ విడుదల చేసిన ఒక రిపోర్ట్‌ చెబుతోంది.


23 ఏళ్లుగా మారుతూ వస్తున్న ట్రెండ్‌


23 ఏళ్లు వెనక నుంచి చూస్తే, ఈ ట్రెండ్‌ ఎలా మారిందో ఈజీగా అర్ధమవుతుంది. 2000-01 ఆర్థిక సంవత్సరంలో (FY 2001), భారతీయ కుటుంబాల మొత్తం పొదుపుల్లో నగదు రూపంలోని పొదుపుల వాటా 39 శాతం. అదే సమయంలో, క్యాపిటల్ మార్కెట్లలోకి చేరిన డబ్బు 4 శాతం మాత్రమే. 2022-23 ఆర్థిక సంవత్సరానికి (FY 2023) వచ్చేసరికి ఆ లెక్కలు మారాయి. బ్యాంక్‌ డిపాజిట్ల వాటా 37 శాతానికి తగ్గింది, క్యాపిటల్ మార్కెట్లలోకి చేరిన డబ్బు 7 శాతానికి పెరిగిందని BofA రిపోర్ట్‌ స్పష్టం చేసింది.


అంతేకాదు, భారతీయ జనాభాలో ఆర్థిక అక్షరాస్యత కూడా పెరిగింది. కేవలం పోస్టాఫీస్‌/బ్యాంక్‌ డిపాజిట్ల మీదే ఆధారపడడం తగ్గింది. వాటిని కొనసాగిస్తూనే.. జీవిత బీమా, ప్రావిడెంట్ ఫండ్‌, పెన్షన్ ఫండ్లలోకీ డబ్బు చొప్పిస్తున్నారు. దీంతో, మొత్తం ఆర్థిక పొదుపుల్లో వీటి వాటా FY 2001లోని 34 శాతం నుంచి FY 2023లో 40 శాతానికి కాలానుగుణంగా పెరిగాయి.


స్థిరాస్తి, బంగారం, వాహనాలు వంటి వాటిలో పెట్టుబడుల వాటా FY 2012లోని 69 శాతం నుంచి FY21లో 49 శాతానికి తగ్గింది. అయితే, FY22లో మొత్తంలో మళ్లీ 61 శాతానికి పెరిగింది. FY23లో ఈ లెక్క ఇంకా పెరుగుతుందని BofA సెక్యూరిటీస్ భావిస్తోంది. అంటే.. ఫిజికల్ సేవింగ్స్‌ పెరగడం వల్ల, FY23లో మొత్తం పొదుపులు FY22 రికార్డ్‌ను బద్ధలు కొడతాయని చెబుతోంది. ఇందులో నివాహ గృహాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, మొత్తం స్థూల దేశీయ పొదుపులో వాటి వాటానే 70 శాతం ఉంటుందని వెల్లడించింది.


రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) తాజా డేటాను బట్టి చూసినా ఈ విషయం అర్ధమవుతుంది. ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... మొత్తం ఫైనాన్షియల్‌ సేవింగ్స్‌లో, నగదు రూపంలో చేసిన పొదుపులు FY22లోని 12 శాతం నుంచి FY23లో 7 శాతానికి పడిపోయాయి. 


FY12లో, మొత్తం ఆర్థిక ఆస్తుల్లో కుటుంబ పొదుపులు రూ.14 లక్షల కోట్లుగా ఉన్నాయి. FY22 నాటికి ఈ మొత్తం రూ.28 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది, రెట్టింపైంది.


మరో ఆసక్తికర కథనం: సరసరా పెరుగుతున్న స్వర్ణం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే