More Inflows Into Hybrid Mutual Funds: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చి పడే డబ్బు క్రమంగా పెరుగుతోంది. 2024 జనవరిలో, ఈ ఫండ్స్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 20 వేల కోట్లకు పైగా సేకరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నెల క్రితంతో (2023 డిసెంబర్) పోలిస్తే ఇది ఏకంగా 37 శాతం అధికం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెరిగిన ఇన్‌ఫ్లో
PTI రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది జనవరి నెలలో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చిన మొత్తం ఇన్‌ఫ్లోస్ (పెట్టుబడులు) రూ. 20,634 కోట్లు. దీంతో కలిపితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లలోకి వచ్చిన మొత్తం పెట్టుబడి రూ. 1.21 లక్షల కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో, మొదటి 10 నెలల్లో హైబ్రిడ్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు వెనక్కు (ఔట్‌ఫ్లో) వెళ్లాయి. ప్రస్తుతం ఈ ట్రెండ్ రివర్స్‌లో ఉంది.
హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి?
ఈక్విటీ (షేర్లు) & డెట్ (బాండ్లు) రెండింటిలోనూ ఒకేసారి పెట్టుబడి పెట్టే పథకాలే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. చాలా హైబ్రిడ్ ఫండ్ పథకాలు ఈక్విటీ, డెట్‌తో పాటు బంగారం, వెండి, ముడి చమురు (కమొడిటీస్) వంటి అసెట్ క్లాసెస్‌లకు కూడా నిధులు కేటాయిస్తాయి. దీనివల్ల హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మెరుగైన వైవిధ్య ప్రయోజనం (డైవర్సిఫికేషన్ బెనిఫిట్) లభిస్తుంది. వీటిలో తక్కువ నష్టభయం ఉంటుంది, రాబడి కూడా తక్కువగానే ఉంటుంది. పెట్టుబడుల్లో వైవిధ్యం కారణంగా పోర్ట్‌ఫోలియోలో హెచ్చుతగ్గులు చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ రిస్క్ తీసుకోగల పెట్టుబడిదార్లకు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అవుతుంది.
కేవలం 2 హైబ్రిడ్ ఫండ్స్‌లోకే ఎక్కువ పెట్టుబడి
హైబ్రిడ్ ఫండ్స్‌లోకి, 2024 జనవరిలో రూ.20 వేల కోట్లకు పైగా ఇన్‌ఫ్లో రావడానికి నెల ముందు, 2023 డిసెంబర్ నెలలో రూ.15,009 కోట్లు వచ్చాయని 'అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా' (ఆంఫి) గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు ఏడాది కాలంగా హైబ్రిడ్ ఫండ్స్‌లోకి ఇన్ ఫ్లోస్ పెరుగుతూనే ఉన్నాయి. వీటిలోనూ.. ఆర్బిట్రేజ్ ఫండ్, మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ వర్గాలు గరిష్ట పెట్టుబడిని పొందుతున్నాయి. జనవరిలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లోకే 50 శాతానికి పైగా డబ్బు వచ్చింది. ఆ నెలలో వాటిలోకి మొత్తం ఇన్ ఫ్లోస్ రూ.10,608 కోట్లు. మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌లోకి రూ. 7,080 కోట్ల ఇన్‌ఫ్లో వచ్చింది.
పన్ను రూల్స్ మారిన తర్వాత పెరిగిన ఇన్‌ఫ్లోస్
హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అమితంగా ప్రజాదరణ పొందడానికి అతి పెద్ద కారణం పన్ను ప్రయోజనం. 2023 ఏప్రిల్‌లో, డెట్ ఫండ్స్‌కు సంబంధించిన పన్ను నిబంధనలను మార్చారు. అప్పటి నుంచి, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు పెరిగాయి, ప్రతి నెలా మెరుగైన ఇన్‌ఫ్లోస్ నమోదవుతున్నాయి. దీనికిముందు, 2023 మార్చిలో, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.12 వేల కోట్లకు పైగా డబ్బు బయటకు వెళ్లింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పొదుపులు కాదు, పెట్టుబడులే హద్దు - తత్వం బోధపడుతోంది ప్రజలకు!