Nifty At All time High: నిఫ్టీ ఇండెక్స్‌ను చాలా కాలంగా ఊరిస్తున్న రికార్డ్‌ దాసోమహంది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో, NSE నిఫ్టీ సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ఈ రోజు (సోమవారం, 19 ఫిబ్రవరి 2024) ట్రేడింగ్‌లో, నిఫ్టీ50 ఇండెక్స్‌ తొలిసారిగా 22,171.80 గరిష్టాన్ని (మధ్యాహ్నం 2.00 గంటల సమయానికి) నమోదు చేసింది, తొలిసారిగా 22,170 స్థాయిని ‍‌(Nifty at record high) దాటింది.


NSE వెబ్‌సైట్‌లో ఇచ్చిన డేటా ప్రకారం, ఆల్‌ టైమ్ హైని తాకిన తర్వాత, స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 386.30 లక్షల కోట్లకు చేరింది.


మార్కెట్‌లో ఒడుదుడుకులు
ఈ రోజు ఉదయం ఆసియా మార్కెట్ల నుంచి సరైన సిగ్నల్స్‌ లేకపోయినా, ఇండియన్‌ స్టాక్ మార్కెట్ పాటిటివ్‌ నోట్‌తో ప్రారంభమైంది. అయితే, ప్రారంభమైన 45 నిమిషాల వరకు, అంటే ఉదయం 10 గంటల వరకు BSE సెన్సెక్స్ & NSE నిఫ్టీ జారిపోతూనే ఉన్నాయి. అక్కడి నుంచి తిరిగి అద్భుతంగా పుంజుకున్నాయి. మార్కెట్ ప్రారంభమైన 2 గంటల తర్వాత, నిఫ్టీ చరిత్ర సృష్టించింది, కొత్త శిఖరాన్ని తాకింది.


బ్యాంక్ నిఫ్టీ ఇచ్చిన మద్దతుతో నిఫ్టీ పెరిగింది. మధ్యాహ్నం 2.00 గంటల సమయానికి, బ్యాంక్ నిఫ్టీ 290 పాయింట్ల జంప్‌తో 46,674.90 వద్ద ఉంది, ఈ ఇండెక్స్‌ కూడా ఈ రోజు లోయర్‌ లెవెల్స్‌ నుంచి బలంగా రికవర్‌ అయింది. ఆ సమయానికి, బ్యాంక్ నిఫ్టీలోని 12 షేర్లలో 8 లాభపడగా, 4 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ టాప్ గెయినర్‌గా AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నిలిచింది. ఈ స్టాక్‌ 3 శాతం పైగా లాభంతో రూ. 600 స్థాయిని దాటింది.


పేటీఎం షేర్ల జంప్
Paytm బ్రాండ్‌తో బిజినెస్‌ చేస్తున్న వన్‌97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు ఈ రోజు కూడా 5 శాతం పెరిగాయి. BSE &  NSEలో ఈ కంపెనీ షేర్లు వరుసగా రూ. 358.55 & మరియు రూ. 358.35కి చేరాయి, ఆ స్థాయి దగ్గర అప్పర్ సర్క్యూట్‌లో ఆగిపోయాయి.


పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై (PPBL) ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత పేటీఎం షేర్‌ విలువ దాదాపు 60 శాతం పడిపోయింది. ఆంక్షలు అమలు చేసే తేదీని ఆర్‌బీఐ ఫిబ్రవరి 29, 2024 నుంచి మార్చి 15, 2024 వరకు పొడిగించింది. దీంతో, శుక్రవారం 5 శాతం పుంజుకున్న పేటీఎం స్టాక్‌, ఈ రోజు కూడా అదే ఊపును కొనసాగించింది.


ఈ రోజు మధ్యాహ్నం 2.00 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 346.67 పాయింట్లు లేదా 0.48% పెరిగి 72,773.31 దగ్గర; NSE నిఫ్టీ 120.80 పాయింట్లు లేదా 0.55% పెరిగి 22,161.50 వద్ద ట్రేడవుతున్నాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం