AP Speaker Summons Rebel MLAs: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ (AP Politics) పెరుగుతోంంది. ప్రధాన పార్టీలకు సంబంధించిన రెబల్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల (Rebel MLA's And MLC's) అనర్హతపై ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటికే పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారం (Tammineni Sitaram), మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ (Koyye Mosenu Raju) నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే వాటిని పలువురు లెక్క చేయకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం విచారణకు రావాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌లు మరోసారి నోటీసులు ఇచ్చారు. 


ఫిరాయింపు ప్రజాప్రతినిధులు తమ వివరణ ఇవ్వాలని, ఇవే తుది విచారణ నోటీసులని పేర్కొన్నారు. హాజరుకాకుంటే అనర్హతపై తుది నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో నేటి విచారణకు హాజరవుతారా? లేదా? అనే చర్చ నడుస్తోంది. అధికార వైసీపీ తరఫున గెలిచిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరారు. అలాగే మండలిలో ఎమ్మెల్సీలు రామచంద్రయ్య టీడీపీలో చేరగా, వంశీకృష్ణ జనసేన కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్‌ మదునూరి ప్రసాదరాజు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు, మండలిలో చీఫ్‌ విప్‌ మేరిగ మురళీధర్‌ మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌లకు ఫిర్యాదులు చేశారు. 


ఎందుకు చర్యలు తీసుకోవద్దో చెప్పండి
దీంతో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. స్పీకర్‌, మండలి చైర్మన్‌ ఆయా సభ్యుల్ని ప్రశ్నిస్తూ మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. రకరకాల కారణాలతో కొందరు విచారణకు గైర్హాజరు అవగా, కొందరు అరకోరగా విచారణకు హాజరయ్యారు. సాంకేతిక, వ్యక్తిగత కారణాలతో విచారణలో పాల్గొనలేదు. ఈ క్రమంలో సోమవారం విచారణకు హాజరుకావాల్సిందేనని స్పీకర్‌ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ నోటీసులు పంపించారు. సాయంత్రం 4గం. విచారణ ఉంటుందని, రాకపోతే తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పీకర్‌ స్పష్టం చేశారు. 


స్పీకర్ కార్యాలయంలో విచారణ
అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. అనర్హత పిటిషన్లు వేసిన ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు, మేరిగ మురళీధర్‌(మండలి) సమక్షంలోనే విచారణ జరగాల్సి ఉంది. దీంతో వారికి కూడా స్పీకర్‌ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఒకవేళ.. సదరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విచారణకు హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పీకర్‌, చైర్మన్‌లు ఇది వరకే నోటీసుల్లో స్పష్టం చేశారు.


టీడీపీ ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు
తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ చేపట్టారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌కు స్పీకర్ మూడు సార్లు నోటీసులు ఇచ్చారు. వారు కూడా ఇప్పటి వరకు స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. మరో రెబల్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రం స్పీకర్ ఎదుట ఒకసారి విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరవుతారా.. లేదా అన్న అంశంపై సందిగ్ధం నెలకొంది. ముందుగా టీడీపీ ఎమ్మెల్యేల విచారణ జరిగిన తర్వాతే.. వైసీపీ నుంచి ఫిరాయించిన సభ్యుల విచారణ జరగనుంది.