గుడ్ న్యూస్! చిన్న తరహా పొదుపు పథకాల వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం సవరించలేదు. 2021-22 ఆర్థిక ఏడాది చివరి త్రైమాసికంలో వడ్డీరేట్లను తగ్గించలేదు. కరోనా వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం, ద్రవ్యోల్బణం పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పెంచాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
Also Read: పాన్ కార్డుపై డౌటా? అసలు, నకిలీ ఇలా గుర్తించండి
ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గోవా ఎన్నికల ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వచ్చే నెల్లో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)పై వార్షిక వడ్డీరేట్లు వరుసగా 7.1 శాతం, 6.8 శాతం ఈ క్వార్టర్లోనూ కొనసాగనున్నాయి. 'చిన్న తరహా పొదుపు పథకాలపై 2021-2022 ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికం వడ్డీరేట్లనే నాలుగో త్రైమాసికంలోనూ అమలు చేస్తున్నాం. 2022, జనవరి 1 నుంచి 2022, మార్చి 31 మధ్య కాలానికి పాత వడ్డీరేట్లే అమలవుతాయి' అని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తుతున్నారు. ఎందుకంటే చిన్న తరహా పొదుపు పథకాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ ప్రజలే ఎక్కువగా పొదుపు చేస్తుండటం గమనార్హం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వం వడ్డీరేట్లను తగ్గించినట్టు ప్రకటించి మళ్లీ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.
Also Read: Housing sales: హైదరాబాద్ తగ్గేదే లే! మూడు రెట్లు పెరిగిన ఇళ్ల విక్రయాలు
ఏడాది కాలపరిమితితో కూడిన పథకాలపై 5.5 శాతం వడ్డీ లభించనుంది. సుకన్యా సమృద్ధి యోజన యోజనపై 7.6 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఐదు సంవత్సరాల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ పొందొచ్చు. సేవింగ్స్ డిపాజిట్లపై ఎప్పటిలాగే 4 శాతం వార్షిక వడ్డీ లభించనుంది. ఒకటి నుంచి ఐదేళ్ల కాల పరిమితితో కూడిన టర్మ్ డిపాజిట్లపై 5.5-6.7 శాతం వరకు వడ్డీ ఇస్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం వడ్డీని ప్రతి మూడు నెలలకు జమ చేస్తుంటుంది.