Cash Deposit Limit For Bank Savings Account: బ్యాంక్‌లో పొదుపు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలి. సేవింగ్స్ ఖాతాలో పరిమితికి మించి నగదు జమ అవుతుందేమో చూసుకోవాలి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవానికి, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బుయినా జమ చేయవచ్చు, దీనిపై ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు జమ అయితే మాత్రం మీరు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ రాడార్‌లోకి వస్తారు. ఆదాయ పన్ను విభాగం నుంచి మీకు నోటీసు ( Income Tax Notice) వస్తుంది. అప్పుడు మీ ప్రతి జమపైనా ప్రశ్నల వర్షం కురుస్తుంది. ఆదాయ పన్ను అధికారులు, మీ ఖాతాలోకి వచ్చిన ప్రతి రూపాయికి లెక్క అడుగుతారు, మీరు తప్పనిసరిగా సమాధానం చెప్పాలి.
ఆధారాలు లేకపోతే చట్టపరమైన చర్యలు
ఆదాయ పన్ను అధికారులు అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడంలో తడబడినా, చెప్పలేకపోయినా, మీ ఖాతాలో డిపాజిట్ అయిన డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చిందో సాక్ష్యాలు సమర్పించలేకపోయినా, అప్పుడు మీ చుట్టూ ఐటీ ఉచ్చు బిగుసుకుంటుంది. ఐటీ విభాగం మీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయవచ్చు, మిమ్మల్ని జైలుకు పంపవచ్చు. ఈ తిప్పలన్నీ ఉండకూడదు అనుకుంటే, మీ ఖాతాలో నగదు జమ అయిన ప్రతిసారీ దానికి తగిన రుజువును మీరు సేకరించి పెట్టుకోవాలి. మీ ఖాతాలో నగదు ఎవరు జమ చేశారు, అతను మీ ఖాతాలో నగదు ఎందుకు జమ చేశాడు, అతను ఈ మొత్తాన్ని ఏదైనా వ్యాపారం కోసం లేదా మీరు అందించిన ఏదైనా సర్వీస్‌కు ప్రతిఫలంగా డిపాజిట్ చేశాడా, లేదా అతను మీ నుంచి తీసుకున్న ఏదైనా రుణాన్ని తిరిగి చెల్లించాడా లేదా మీరు అతనికి ఏదైనా ఆస్తిని అమ్మితే దానికి సంబంధించిన డబ్బును డిపాజిట్ చేశాడా, లేదా ఏదైనా ఈవెంట్ కోసం అతను మీ వ్యక్తిగత ఖాతాకు డబ్బును పంపాడా లేదా బహుమతిగా ఇచ్చాడా?. ఈ ప్రశ్నలన్నింటికీ మీ దగ్గర సమాధానాలు, తగిన పత్రాలు సాక్ష్యాధారాలు రుజువులుగా ఉండాలి. బ్యాంక్ ఖాతాలో జమ అయిన నగదును మీరు ఆదాయ పన్ను రిటర్న్‌లో చూపించారా లేదా చూపించబోతున్నారా అన్నది కూడా రుజువు చేయాలి. లేదా, మీ ఖాతాలో జమ అయిన మొత్తం డబ్బు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం కాదని నిరూపించుకోవాలి.
ఒకేసారి రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినా చిక్కే
ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఖాతాలో డిపాజిట్ అయిన నగదు మొత్తం రూ. 10 లక్షలు దాటితేనే ఆదాయ పన్ను విభాగం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది అనుకోవద్దు. వాస్తవానికి, ఎవరైనా ఒక్క రోజులో మీ ఖాతాలోకి 2 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసినా మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ లావాదేవీలకు సంబంధించి కూడా ఆదాయ పన్ను విభాగం మీకు నోటీస్ పంపవచ్చు. కాబట్టి, ఒకే రోజు రూ. 2 లక్షలకు మించి వచ్చిన డిపాజిట్లకు సంబంధించి కూడా మీరు రుజువులు దగ్గర పెట్టుకోవాలి.
మరో ఆసక్తికర కథనం: ఆధార్‌తో డబ్బు డ్రా చేసేవాళ్లు తస్మాత్ జాగ్రత్త!, ఒక్క పొరపాటుతో మీ ఖాతా మొత్తం ఖాళీ