Axis Bank Revised SMS Charges: ప్రతి బ్యాంక్‌ కస్టమర్‌ రిజిస్టర్డ్‌ ఫోన్‌ నంబర్‌కు, అతని బ్యాంక్‌ ఖాతా లావాదేవీలు, చెక్ క్లియరెన్స్, డెబిట్ లేదా క్రెడిట్‌కు సంబంధించిన సమాచారం SMS రూపంలో వస్తుంటాయి. ఇవన్నీ ఉచితంగా వస్తాయని, వీటికి ఎలాంటి ఛార్జీలు ఉండవని చాలామంది అనుకుంటారు. బ్యాంక్‌, ఎస్‌ఎంఎస్‌లు పంపినందుకు డబ్బులు వసూలు చేస్తుందో, లేదో కూడా ఎక్కువ మందికి తెలీదు. బ్యాంక్‌ అంటేనే ఆర్థిక సంస్థ. కాబట్టి, ఏ బ్యాంక్‌ కూడా ఉచితంగా ఏ పనీ చేయదు. బ్యాంక్‌ ఖాతా సమాచారాన్ని సందేశాల (SMS) రూపంలో మీకు తెలియజేసినందుకు కొంత డబ్బు వసూలు చేస్తుంది. ప్రతి త్రైమాసిక (3 నెలలు) ప్రాతిపదికన, ప్రతి బ్యాంక్‌ SMS ఛార్జీలు విధిస్తుంంది. అంటే, మీ బ్యాంక్‌ నుంచి అందుకునే ప్రతి SMSకు మీరు డబ్బు చెల్లిస్తున్నారు, ఈ సర్వీస్‌ ఉచితం కాదు. ఒక్క SMS ఛార్జీలే కాదు, బ్యాంకులు ఇంకా చాలా రకాల రుసుములను వసూలు చేస్తాయి, ఆ డబ్బును నేరుగా కస్టమర్‌ ఖాతా నుంచి కట్‌ చేసుకుంటాయి.


యాక్సిస్ బ్యాంక్ SMS సర్వీస్‌ ఛార్జీల్లో మార్పు
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా తన కస్టమర్లపై రకరకాల ఛార్జీలు విస్తుంది. తాజాగా, ఈ బ్యాంక్‌, SMS ఛార్జీల్లో మార్పులు చేసింది. ఈ నిర్ణయం కస్టమర్ల డబ్బుపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ బ్యాంక్, ఖాతా లావాదేవీలకు సంబంధించి కస్టమర్లకు పంపే ప్రతి SMSకు 25 పైసలు లేదా త్రైమాసికానికి 15 రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇంతకుముందు యాక్సిస్ బ్యాంక్ ఈ సర్వీస్‌ కోసం ప్రతి త్రైమాసికానికి 25 రూపాయలు వసూలు చేసింది. అంటే, ప్రతి మూడు నెలలకు SMSల కోసం ఒక్కో బ్యాంక్‌ ఖాతాదారు నుంచి రూ. 25 తీసుకుంది.


SMS సర్వీస్‌ ఛార్జీలను కచ్చితంగా చెల్లించాలా?
అవసరం లేదు. ఈ సర్వీస్‌ మీకు అవసరం లేదని మీరు భావిస్తే, దీనిని ఎప్పుడైనా నిలిపివేయవచ్చు. 


యాక్సిస్‌ బ్యాంక్‌ SMS సర్వీస్‌ను ఎలా నిలిపేయాలి?
యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు (1860-419-5555 / 1860-500-5555) కాల్ చేయండి.
మీ బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌, ఇతర వివరాలను ధృవీకరించండి.
మీ SMS అలెర్ట్‌ సర్వీస్‌ను నిలిపేయమని కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌కు సూచించండి.
మీ గుర్తింపు ధృవీకరించబడిన తర్వాత SMS సర్వీస్‌ను బ్యాంక్‌ నిలిపేస్తుంది.


నెట్ బ్యాంకింగ్ ద్వారా SMS సర్వీస్‌ రద్దు చేయడం
యాక్సిస్ బ్యాంక్ అధికారిక నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి.
సర్వీసెస్‌ లేదా అకౌంట్‌ సర్వీసెస్‌ సెక్షన్‌లోకి వెళ్లండి.
అక్కడ, SMS అలెర్ట్‌ ఆప్షన్‌ ఎంచుకోండి.
SMS అలెర్ట్‌ను నిలిపివేసే ఆప్షన్‌ ఎంచుకోండి.
అవసరమైన ధృవీకరణ తర్వాత ఆ సేవ నిలిచిపోతుంది.


ఈ కొత్త ఛార్జీ ఎవరిపై వర్తించదు?
యాక్సిస్ బ్యాంక్ ప్రీమియం అకౌంట్‌ హోల్డర్స్‌, బ్యాంక్ సిబ్బంది, శాలరీ అకౌంట్‌ హోల్డర్స్‌, పెన్షన్‌ అకౌంట్‌ హోల్డర్స్‌, స్మాల్‌ & ప్రైమరీ అకౌంట్‌ హోల్డర్స్‌కు ఈ ఛార్జీ వర్తించదు. ఈ విభాగాల్లో మీ ఖాతా ఉంటే, SMS ఛార్జీల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా, బ్యాంక్ తనంతట తానుగా పంపే ఏదైనా సమాచారం, OTP వంటి వాటికి ఎటువంటి ఛార్జీ తీసుకోదు.


మరో ఆసక్తికర కథనం: పుష్పరాజ్‌ ఒక్క ఏడాదిలో ఎంత ఆదాయ పన్ను చెల్లించాడో తెలుసా?