Allu Arjun Net Worth: పుష్ప 2 ది రూల్ మూవీ వసూళ్లు ప్రతిరోజూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్నాయి. స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ అద్భుత నటన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టడానికి ప్రధాన కారణమైంది. పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ పెద్ద తుపాను సృష్టిస్తే, పుష్ప సెకండ్‌ పార్ట్‌ దానికి మించి విజంభిస్తూ దేశవ్యాప్తంగా సినీ అభిమానులను చుట్టుముట్టింది. అంతేకాదు, రూ.1,000 కోట్లతో వసూళ్ల సునామీ సృష్టించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో (FY 2023-24) అత్యధిక ఆదాయ పన్ను చెల్లించిన పన్ను చెల్లింపుదార్లలో నిలిచిన బన్నీ.. కేవలం వెండితెరపైనే కాకుండా, పన్ను చెల్లింపు విషయంలోనూ తాను హీరోనేనని నిరూపించుకున్నాడు.


ఫార్చ్యూన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం..
పుష్ప 1 & 2 మూవీలతో పాన్‌ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించిన అల్లు అర్జున్, అటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు ఇటు నార్త్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనూ హిందీ ప్రేక్షకుల ప్రేమను పొందాడు. ఫార్చ్యూన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, దేశంలోని టాప్-22 ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో చోటు దక్కించుకున్న ఏకైక తెలుగు నటుడు అల్లు అర్జున్.


అల్లు అర్జున్ గతేడాది ఎంత పన్ను చెల్లించాడు?
ఫార్చ్యూన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను, బన్నీ రూ. 14 కోట్ల పన్ను చెల్లించాడు. అదే రిపోర్ట్‌లో ఉన్న దానిని బట్టి అతని మొత్తం ఆస్తిపాస్తుల విలువ (Allu Arjun Net Worth) రూ. 460 కోట్లు. అల్లు అర్జున్‌తో పాటు మలయాళ నటుడు మోహన్‌లాల్ (Actor Mohan Lal) కూడా గత ఆర్థిక సంవత్సరంలో రూ. 14 కోట్ల ఆదాయ పన్ను చెల్లించాడు.


పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఎంత తీసుకున్నాడు?
మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, అల్లు అర్జున్, పుష్ప 2: ది రూల్ కోసం రెమ్యునరేషన్‌ తీసుకోలేదు. కానీ, సినిమా ఆదాయంలో 40 శాతం పొందుతాడు. పుష్ప 2 మూవీ పాన్‌ ఇండియా బాక్సాఫీస్‌ల వద్ద విజయ పరంపర కొనసాగిస్తోంది. 2024 డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో రిలీజైన పుష్ప 2 మూవీ, వారం రోజుల లోపే వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది.


పుష్ప 2 మూవీ ప్రదర్శన సందర్భంగా, హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట కేసుకు సంబంధించి అల్లు అర్జున్‌ను డిసెంబర్ 13న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌ మధ్యంతర బెయిల్‌ పొందినప్పటికీ, కోర్టు నుంచి ఆర్డర్లు రావడం ఆలస్యం కావడంతో ఆ రోజు రాత్రంతా చంచల్‌గూడ జైల్లోనే ఉన్నాడు. డిసెంబర్ 14 ఉదయం, ఒక రాత్రి జైలు జీవితం ముగించుకుని బయటకు వచ్చాడు. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన మహిళ కుటుంబానికి బన్నీ ఇప్పటికే రూ.25 లక్షల పరిహారం ప్రకటించాడు. అదే ఘటనలో తీవ్రంగా గాయపడి, కిమ్స్‌ ఆసుపత్రిలో ఉన్న బాలుడు శ్రీతేజ్‌ చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని కూడా చెప్పాడు. పోలీస్‌ కేసు ఉంది కాబట్టి, బాధిత కుటుంబాన్ని తాను పరామర్శించలేకపోతున్నట్లు అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు.


మరో ఆసక్తికర కథనం: ఆధార్‌తో డబ్బు డ్రా చేసేవాళ్లు తస్మాత్‌ జాగ్రత్త!, ఒక్క పొరపాటుతో మీ ఖాతా మొత్తం ఖాళీ