Withdrawing Money Using Aadhaar Card: ఇప్పుడు చాలా చోట్ల, 'ఆధార్ కార్డ్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసే సౌకర్యం కలదు' అని రాసి ఉన్న అనేక షాపులు కనిపిస్తున్నాయి. మీరు ఏటీఎం కార్డు (ATM CARD) మరిచిపోయినప్పుడు లేదా అర్జంటుగా డబ్బు అవసరమైనప్పుడు ఈ షాపులోకి వెళ్లి మీ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి డబ్బులు తీసుకోవచ్చు. షాపులోని వ్యక్తి మీ మీ ఆధార్ నంబర్‌ ద్వారా మీ ఖాతా నుంచి డబ్బును విత్ డ్రా చేసి మీకు ఇస్తాడు. ఈ సర్వీస్‌ కోసం షాపు వ్యక్తి మీ నుంచి కొంత కమీషన్‌ తీసుకుంటాడు. ఈ ప్రాసెస్‌ చాలా సింపుల్‌గా అయిపోతుంది, నిమిషాల వ్యవధిలో డబ్బు మీ చేతిలో ఉంటుంది. ఆధార్‌తో డబ్బు తీసుకునే పద్ధతి సులభంగా అనిపించినప్పటికీ, పైకి కనిపించేంత సురక్షితమైనది మాత్రం కాదు. ముఖ్యంగా, మీరు బయటి ప్రాంతానికి వెళ్లిన సమయంలో మీకు డబ్బులు అవసమైతే, ఇలాంటి ప్రాసెస్‌కు దూరంగా ఉండండి.


ఆధార్ కార్డ్ నుంచి డబ్బును ఎలా విత్ డ్రా చేసుకోవాలి?
'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI), ప్రజల కోసం 'ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్' (AIPS) సౌకర్యం అందిస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. మీ ఆధార్ నంబర్‌ - మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయితే, మీరు ATM కార్డ్ లేకుండా కేవలం ఆధార్ కార్డ్ సహాయంతోనే మీ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం మీరు మైక్రో ఏటీఎం (Micro ATM)కు వెళ్లాలి. అక్కడ, మీ ఆధార్ నంబర్‌ & వేలిముద్రను ఉపయోగించి మీరు మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసుకోవచ్చు. బ్యాంకింగ్ కరస్పాండెంట్‌గా పని చేసేందుకు ఆమోదం పొందిన వ్యక్తి (దుకాణదారు), బ్యాంకుల తరపున, ఆధార్‌ నంబర్‌ సాయంతో మీకు డబ్బు విత్‌డ్రా చేసి ఇస్తారు. స్మార్ట్‌ ఫోన్‌లు, ఇంటర్నెట్ కనెక్షన్ లేదా సాంప్రదాయ బ్యాంకింగ్ సేవలు లేని మారుమూల ప్రాంతాల్లో నివసించే వారి కోసం ఈ సర్వీస్‌ను NPCI పరిచయం చేసింది.


మోసం ఎలా జరుగుతుంది?
తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఘోరవాల్ కొత్వాలి ప్రాంతంలోని ఓ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఆధార్ నంబర్‌ ఉపయోగించి డబ్బులు డ్రా చేసే పేరుతో ఓ వ్యక్తిని మోసం చేసి రూ. 15,000 తీసుకున్నారు. ఈ కేసులో బాధితుడి పేరు శివనారాయణ విశ్వకర్మ. తన ఆధార్ నంబర్‌ ద్వారా డబ్బు విత్‌డ్రా చేయడానికి తన గ్రామంలోనే ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ వద్దకు వెళ్లాడు. తన ఆధార్ నంబర్‌ ఇచ్చి కొంత డబ్బు డ్రా చేయమని చెప్పాడు. ఆధార్ ద్వారా డబ్బులు డ్రా చేసేందుకు, ఆ షాపులో ఉన్న లవ్‌కుష్ యాదవ్, మనోజ్ యాదవ్‌ బాధితుడి నుంచి ఆధార్ కార్డు తీసుకుని మెషీన్‌పై బొటన వేలి ముద్ర వేశారు. కానీ, డబ్బులు రాలేదు. సర్వర్ డౌన్ అయిందని బాధితుడికి చెప్పారు. మరోమారు ప్రయత్నిద్దామని చెప్పి మళ్లీ వేలిముద్ర తీసుకున్నారు, అప్పుడు కూడా డబ్బులు రాలేదు. కానీ, కొన్ని రోజుల తర్వాత బాధితుడు తన బ్యాంక్‌ పాస్‌బుక్‌ను ప్రింట్ చేయగా.. ఘటన జరిగిన రోజే తన ఖాతా నుంచి రూ. 15,000 డ్రా అయినట్లు చూపించింది. మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టాడు. పోలీసులు ఆ నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. 


ఆధార్‌ నుంచి డబ్బు డ్రా చేస్తున్నప్పుడు ఏదైనా అవాంతరం ఏర్పడి డబ్బులు రాకపోతే, తక్షణం బ్యాంక్‌ను సంప్రదించడం మంచిది. 


మరో ఆసక్తికర కథనం: ఇది మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ సంవత్సరం - ఇన్వెస్టర్ల ఇళ్లు డబ్బులమయం