Viral News: పంట పండేందుకు రైతు నానా కష్టాలు పడతాడు. కొన్ని సార్లు ఎన్ని పురుగుల మందులు పిచికారీ చేసినా.. నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ చలికాలంలో అయితే పంటకు పురుగు పట్టడం, ఇతర సమస్యలు భారీ నష్టాలను మిగులుస్తాయి. దీన్ని గమనించిన ఓ ప్రాంత రైతులు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. తాము సాగు చేస్తోన్న పంటకు పురుగు మందులతోపాటు మద్యం(Alcohol) కూడా పిచికారీ చేస్తున్నారు. ఇంతకీ ఆ రైతులు కనుగొన్న పరిష్కారం ఏంటి.. దీని వల్ల పంటకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా.. లాభాలు ఎలా ఉంటాయి అన్న విషయాలను ఆ రైతులే స్వయంగా వెల్లడించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలు గడ్డ పంటకు మద్యం పిచికారీ
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో రైతులు బంగాళదుంప(Potato)లను విస్తారంగా పండిస్తున్నారు. ఇక్కడ ఆలుగడ్డ పంటలపై రైతులు పురుగు మందులతో పాటు మద్యం కూడా పిచికారీ చేస్తున్నారు. రైతులు మద్యంలో మందులతో కలిపి పిచికారీ చేస్తున్నారు. షికర్‌పూర్ తహసీల్‌లోని బోహిచ్ గ్రామంలోని రైతులు బంగాళాదుంప పంటలకు పురుగుమందులు కలిపి మద్యం పిచికారీ చేస్తున్నారు. ఆల్కహాల్ పిచికారీ చేయడం వల్ల బంగాళదుంపల దిగుబడి పెరుగుతుందని, దీని వల్ల చలికాలంలో ఆలుగడ్డలకు ఎలాంటి వ్యాధులు రావని రైతులు చెబుతున్నారు. ఆల్కహాల్ స్ప్రే చేయడం వల్ల బంగాళాదుంప పరిమాణం పెరగడమే కాకుండా దాని రంగు సైతం స్పష్టంగా ఉంటుందంటున్నారు.
బోహిచ్ గ్రామంలో బంగాళాదుంపల ఉత్పత్తి రేటు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడి రైతులు తమ పంటను మెరుగుపర్చడానికి మద్యాన్ని ఉపయోగిస్తున్నారు. బంగాళాదుంపలను విపరీతమైన చలి నుంచి రక్షించడానికి, అవి మందంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఆల్కహాల్ స్ప్రే చేస్తారని వారు నమ్ముతున్నారు.
Also Read : Aadhaar Card Updating: ఆధార్ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఈ సందర్భంగా రైతు రామ్‌బాబు శర్మ మాట్లాడుతూ, ఆల్కహాల్ పిచికారీ చేయడం వల్ల బంగాళాదుంప పంటపై మంచు ప్రభావం బాగా తగ్గుతుందని, బంగాళాదుంపలు బొద్దుగా మారుతాయని చెప్పారు. "మేము 4,5 సంవత్సరాలుగా బంగాళాదుంప పంటలకు మద్యం పిచికారీ చేస్తున్నాము. అది పంటకు ప్రయోజనం చేకూరుస్తుంది. దాదాపు 200 మి.లీ ఆల్కహాల్‌ను మందులతో కలిపి ఒక ఎకరం పంటపై పిచికారీ చేస్తాం. దీని వల్ల ఎలాంటి నష్టం ఉండదు" అని రైతు చెప్పుకొచ్చాడు.
ఆల్కహాల్ స్ప్రేతో పెరుగుతున్న బంగాళదుంపల పరిమాణం
మద్యం పిచికారీ చేయడం వల్ల బంగాళదుంప ఉబ్బిపోతుందని అంటే పరిమాణం పెరుగుతుందని కంచన్ కుమార్ శర్మ అనే రైతు చెప్పారు. బంగాళాదుంపలను మంచు నుంచి రక్షించడానికి తాము ఇలా పిచికారీ చేస్తున్నామన్నారు. ఒక ఎకరానికి 200 మి.లీ మద్యాన్ని ఉపయోగిస్తామని.. ఏడెనిమిదేళ్లుగా ఈ తరహాలో బంగాళదుంపలను సాగుచేస్తున్నామని చెప్పారు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆ రైతు తెలిపారు.