Belated ITR: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేసే చివరి తేదీకి ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలుంది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రిటర్న్‌ ఫైల్‌ చేసేందుకు లాస్ట్‌ డేట్‌ జులై 31. ఐటీ డిపార్ట్‌మెంట్‌ పోర్టల్ ప్రకారం, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. గత ఏడాది సమర్పించిన మొత్తం రిటర్న్‌లు 5.50 కోట్లకు పైగా ఉన్నాయి. ఈ లెక్కన, ఇప్పటికీ రెండున్నర కోట్ల మంది ఆదాయాలను ఇంకా డిక్లేర్‌ చేయలేదు. వీళ్లలో మీరు కూడా ఉంటే, భవిష్యత్‌ పరిణామాలు చాలా బ్యాడ్‌గా ఉంటాయి, బీ కేర్‌ఫుల్‌. 


బీలేటెడ్‌ ఐటీఆర్‌ అంటే ఏంటి?
గడువు దాటిన తర్వాత కూడా ఐటీఆర్‌ ఫైల్‌ చేసే అవకాశం ఉంది. ఇన్‌కమ్‌ టాక్స్‌ యాక్ట్-1961లోని సెక్షన్ 139 (4) ప్రకారం, గడువు తేదీ తర్వాత సమర్పించే రిటర్న్‌ను బీలేటెడ్‌ ఐటీఆర్‌గా పిలుస్తారు. ప్రస్తుత అసెస్‌మెంట్ ఇయర్‌ ముగియడానికి 3 నెలల ముందు వరకు బీలేటెడ్‌ రిటర్న్‌ ఫైల్ చేయవచ్చు. ఈ రూల్‌ ప్రకారం, 2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌లో (2022-23 ఫైనాన్షియల్‌ ఇయర్‌) డిసెంబర్ 31లోపు బీలేటెడ్‌ రిటర్న్‌ సబ్మిట్‌ చేసే ఛాన్స్‌ ఉంది. అంటే, జులై 31 తర్వాత కూడా ITR ఫైల్ చేయడానికి 5 నెలల సమయం ఉంది.


బీలేటెడ్‌ ఐటీఆర్‌కు ఎంత ఫైన్‌ కట్టాలి?
బీలేటెడ్‌ రిటర్న్‌ దాఖలు చేయాలంటే... రూ.5 లక్షలకు పైబడిన ఆదాయం ఉన్న వాళ్లు రూ. 5,000 ఫైన్‌ కట్టాలి. రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న రూ.1,000 ఫైన్‌ పే చేయాలి.


బీలెటెడ్‌ ఐటీఆర్‌ వల్ల మిస్‌ అయ్యే బెనిఫిట్స్‌
- సకాలంలో ITR ఫైల్ చేయడంలో విఫలమైతే, పెట్టుబడులపై వచ్చిన నష్టాలను (హౌస్‌ ప్రాపర్టీ నష్టం మినహా) తర్వాతి సంవత్సరాలకు ఫార్వర్డ్‌ చేయడానికి వీలవదు. సకాలంలో రిటర్న్‌ ఫైల్‌ చేస్తే, పెట్టుబడులపై నష్టాలను 8 సంవత్సరాల వరకు కొనసాగించవచ్చు. ఈ 8 సంవత్సరాల్లో మీకు పెట్టుబడులపై లాభాలు వస్తే, నష్టాలతో వాటిని భర్తీ చేసి, టాక్స్‌ మినహాయింపు పొందొచ్చు. బీలేటెడ్‌ ఐటీఆర్‌తో ఈ బెనిఫిట్‌ మిస్‌ అవుతారు.


- ఇన్‌-టైమ్‌ ITR ఫైల్‌ చేస్తే, రిఫండ్‌ మీద నెలకు 0.5% చొప్పున వడ్డీ వస్తుంది. ఉదాహరణకు.. ఒక టాక్స్‌ పేయర్‌ జులై 31 కంటే ముందే రిటర్న్‌ ఫైల్ చేశారనుకుందాం. అతనికి రావలసిన రిఫండ్‌ మీద ఏప్రిల్ నెల నుంచి వడ్డీ అందుతుంది. ఒక వ్యక్తి సెప్టెంబర్‌లో ఫైల్ చేస్తే, అతనికి 2 నెలల (ఆగస్టు, సెప్టెంబర్) వడ్డీ రాదు.


- బీలెటెడ్‌ ITR ఫైల్ చేసేటప్పుడు ఏదైనా టాక్స్‌ లయబిలిటీ ఉంటే, దానిపై వడ్డీని కూడా జరిమానా రూపంలో వసూలు చేస్తారు. చెల్లించాల్సిన టాక్స్‌ క్లాస్‌ను బట్టి సెక్షన్ 234A, 234B, 234C కింద జరిమానా వడ్డీ వర్తిస్తుంది. జులై 31లోపు సెల్ఫ్‌-అసెస్‌మెంట్‌ టాక్స్‌ జమ చేయనందుకు సెక్షన్ 234A కింద ఫైన్‌ పడుతుంది. మార్చి 31లోపు ముందస్తు పన్నులో 90 శాతం చెల్లించకపోతే సెక్షన్ 234B కింద జరిమానా కట్టాలి. ఆ మొత్తంపై నెలకు 1 శాతం చొప్పున లేట్‌ ఫైన్‌ రూపంలో ముక్కు పిండి వసూలు చేస్తారు.


- బీలేటెడ్‌ రిటర్న్‌కు రిఫండ్‌ కూడా లేట్‌ అవుతుంది. ITR ఫైల్ చేయడంలో జరిగే జాప్యం ప్రాసెసింగ్‌ను కూడా ఆలస్యం చేస్తుంది. ఫైనల్‌గా రిఫండ్‌ లేట్‌ అవుతుంది.


- బీలేటెడ్‌ రిటర్న్‌ దాఖలు చేసిన తర్వాత అందులో ఏదైనా తేడాను ఐటీ డిపార్ట్‌మెంట్‌ గుర్తిస్తే, దానిని సవరించి రివైజ్డ్‌ రిటర్న్‌ ఫైల్‌ చేసే అవకాశం టాక్స్‌ పేయర్‌కు లభిస్తుంది. ఆ తర్వాత కూడా ఐటీ డిపార్ట్‌మెంట్‌ అనుమానపడితే, అధికార్లు నేరుగా రంగంలోకి దిగుతారు, రైడ్‌ చేస్తారు. ITRలో తప్పులున్నాయని వాళ్ల రైడ్‌లో తేలితే, సదరు టాక్స్‌ పేయర్‌కు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడొచ్చు.


మరో ఆసక్తికర కథనం: ఇలాంటి స్టాక్స్‌ మీ దగ్గరుంటే డివిడెండ్‌ రూపంలోనే డబ్బు సంపాదించొచ్చు!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial