Credit Card Dues: క్రెడిట్‌ కార్డులతో జనం చేస్తున్న ఖర్చులకు అంతుపొంతు ఉండట్లేదు. చేతిలో కార్డ్‌ ఉంది కదాని తెగ వాడేస్తున్నారు. పండుగల సీజన్‌లో ఇది పీక్‌ స్టేజ్‌కు చేరుతోంది. ప్రస్తుతం, దేశంలోని అన్ని బ్యాంకుల క్రెడిట్‌ కార్డ్‌ల మొత్తం ఔట్‌స్టాండింగ్‌ గతంలో ఎన్నడూ లేనంత రికార్డ్‌ స్థాయికి పెరిగింది. మొదటిసారిగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో క్రెడిట్ కార్డ్ బాకీ రూ. 2 లక్షల కోట్ల మార్కును దాటింది.


బ్యాంక్‌ లోన్లు కూడా క్రెడిట్‌ కార్డ్‌ బకాయిలతో (credit card dues) పోటీ పడలేక చతికిలపడ్డాయి. ఒక్క ఏడాది కాలంలోనే క్రెడిట్‌ కార్డ్‌ డ్యూస్‌ దాదాపు 30% పెరిగాయి. బ్యాంకు రుణాల కంటే రెండింతలు వేగంగా పెరిగాయి. 


క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లు రూ.2,00,258 కోట్లు
RBI డేటా ప్రకారం, 2023 ఏప్రిల్‌లో క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లు రూ. 2,00,258 కోట్లకు చేరుకున్నాయి. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 29.7% జంప్‌.


ఎలాంటి గ్యారెంటీ/తనఖా లేకుండా బ్యాంకులు క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తాయి. కాబట్టి, క్రెడిట్‌ కార్డ్‌ బకాయిని అన్‌-సెక్యూర్డ్‌ లోన్‌ కింద జమ కట్టాలి. ఇలాంటి అన్‌-సెక్యూర్డ్‌ క్రెడిట్‌ విపరీతంగా పెరగడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ అన్ని బ్యాంకులను హెచ్చరించింది కూడా. RBI వార్నింగ్‌ను బ్యాంకులు ఖాతరు చేయలేదు. మొత్తం బ్యాంక్‌ క్రెడిట్‌లో.. కార్డ్ ఔట్‌స్టాండింగ్‌ వాటా తక్కువగా ఉందని, అలాంటప్పుడు కంగారు పడడం ఎందుకని అంటున్నాయి. క్రెడిట్‌ వర్తీ కస్టమర్లకు మాత్రమే కార్డులు ఇస్తున్నామని సమర్థించుకుంటూనే ఎడాపెడా ఇష్యూ చేస్తున్నాయి, జనాన్ని రుణగ్రస్తులను చేస్తున్నాయి.


ఈ ఏడాది ఏప్రిల్‌లో, క్రెడిట్ కార్డ్‌లను స్వైప్ చేయడం ద్వారా, ఆన్‌లైన్‌లో యూజ్‌ చేయడం ద్వారా చేసిన కొనుగోళ్లు & పేమెంట్స్‌ మొత్తం విలువ రూ. 1.3 లక్షల కోట్లు. క్రెడిట్ కార్డ్ డ్యూస్‌లో వృద్ధి కేవలం పెరుగుతున్న రుణభారానికి మాత్రమే గుర్తు కాదు. పేమెంట్స్‌ కోసం కార్డుల వాడకంలో పెరుగుదల, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి కూడా అది అద్దం లాంటిది.


బ్యాంక్‌ క్రెడిట్‌లో థర్డ్‌ లార్జెస్ట్‌ షేర్‌ 
మొత్తం బ్యాంక్‌ రుణాల్లో... క్రెడిట్‌ కార్డ్ బ్యాలెన్స్‌ల వాటా 1.4%. పర్సనల్‌ లోన్లు, హౌసింగ్ లోన్ల వాటా 14.1%. వాహన రుణాల వాటా 3.7%. అంటే, మొత్తం బ్యాంక్‌ క్రెడిట్‌లో కార్డ్ బ్యాలెన్స్‌ల మూడో అతి పెద్ద సెగ్మెంట్‌.


2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ‍‌(global financial crisis) ముందు క్రెడిట్ కార్డ్ ఔట్‌స్టాండింగ్‌ షేర్‌ 1.2%గా, గరిష్ట స్థాయిలో ఉంది. స్మాల్‌ టికెట్ పర్సనల్‌ లోన్లలో డిఫాల్ట్‌లు, క్లీనప్‌ తర్వాత, కార్డ్ బకాయిల వాటా 1% కంటే తక్కువకు చేరింది. మళ్లీ 1% మార్క్‌ను చేరడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. 2019 ఆగస్టులో, క్రెడిట్ కార్డ్ ఔట్‌స్టాండింగ్‌ షేర్‌ 1% మార్కును దాటింది. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ, ప్రస్తుతం 1.4%కు చేరింది.


క్రెడిట్‌ కార్డుల వినియోగం, ఒక వ్యక్తి దగ్గర ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉండడం వంటి విషయాలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ... అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనం చాలా వెనుకబడి ఉన్నామని బ్యాంక్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. మన దేశ జనాభాలో కనీసం 5% మంది దగ్గర కూడా క్రెడిట్‌ కార్డులు లేవంటున్నారు. అంటే, కొత్త క్రెడిట్‌ కార్డుల జారీకి విపరీతమైన అవకాశం దేశంలో ఉందన్నది వాళ్ల మాటల వెనుక దాగున్న పరమార్ధం.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఇవాళ్టి రేట్లివి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial