Best Investment Ideas 2024: చేతిలో కొంత డబ్బు ఉంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేయడం మన తాతల కాలం నాటి నుంచి ఉన్న అలవాటు. దీనికి కారణం... బ్యాంక్‌ లేదా పోస్ట్‌ఫీస్‌పై ప్రజలకున్న విశ్వాసం. తమ బిడ్డల పెళ్లికో, పెద్ద చదువులకో ఆ డబ్బు అక్కరకొస్తుందన్న ధీమా. 


మెచ్యూరిటీ పిరియడ్‌ ముగియగానే, బ్యాంక్‌/పోస్టాఫీస్‌ ఖాతాదారు డబ్బును వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తుంది. అంటే, FD వల్ల పెట్టుబడి 'రిస్క్‌ జీరో' కావడంతో పాటు 'హామీతో కూడిన రాబడి' కచ్చితంగా వస్తుంది. అయితే, ఇక్కడో విషయం గమనించాలి. ప్రస్తుతం, దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలతో పోలిస్తే FD మీద బ్యాంకులు ఇస్తున్న వడ్డీ తక్కువ. అంటే.. ఫిక్సిడ్ డిపాజిట్ వల్ల మీ పెట్టుబడి విలువ ఎప్పటికప్పుడు తగ్గుతోందని అర్థం. 


ఒక పెట్టుబడిని దీర్ఘకాలం కొనసాగిస్తేనే మంచి ఫలితం ఉంటుందని పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతుంటారు. దీర్ఘకాలిక మదుపు వల్ల మార్కెట్ రిస్క్ తగ్గుతుంది. ఇలాంటి తక్కువ రిస్క్‌తో కూడిన పెట్టుబడి సాధనాలు బ్యాంక్‌ FD కంటే ఎక్కువ రాబడిని ఇస్తాయి. అయితే, ఫిక్సిడ్ డిపాజిట్‌ మీద ఇచ్చే వడ్డీలా వీటిపై వచ్చే ఆదాయానికి గ్యారంటీ మాత్రం ఉండదు.


తక్కువ రిస్క్‌ - ఎక్కువ రాబడి:


1. ఇండెక్స్ ఫండ్స్ (Index Funds): ఇవి, మ్యూచవల్‌ ఫండ్స్‌లో ఒక భాగం. వీటిని పాసివ్‌ ఫండ్స్‌ అని కూడా పిలుస్తారు. యాక్టివ్‌ ఫండ్స్‌లాగా వీటికి ఫండ్‌ మేనేజర్‌ అవసరం కూడా ఉండదు. ఎందుకంటే, ఈ ఫండ్స్ ఏదోక స్టాక్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ను ఫాలో అవుతాయి. ఆ ఇండెక్స్‌లో ఉన్న షేర్లలో, కంపెనీ వెయిటేజీని బట్టి పెట్టుబడులు పెడతాయి. ఈ ఫండ్స్ ద్వారా చేసే పెట్టుబడిని "ఆటోమేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్" అని కూడా అంటారు. ఇండెక్స్‌ పెరిగితే ఈ ఫండ్‌ రాబడులు పెరుగుతాయి. ఉదాహరణకు.. సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌, నిఫ్టీ 50 ఇండెక్స్‌. గత 12 నెలల కాలంలో నిఫ్టీ 27% రిటర్న్‌ ఇచ్చింది. అదేకాలంలో సెన్సెక్స్‌ దాదాపు 24% రాబడి ఇచ్చింది. ఈ ఇండెక్స్‌ల ఆధారిత ఫండ్స్‌లో మదుపు చేసినవాళ్ల పెట్టుబడి కూడా అదే స్థాయిలో పెరిగింది.


2. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs): వీటి పనితనం కూడా ఇండెక్స్ ఫండ్స్‌లాగే ఉంటుంది. ఇది కూడా వివిధ రంగాల్లో, వివిధ కంపెనీల్లో డబ్బును పెట్టుబడి పెడుతుంది. ETF పనితీరు నిర్దేశిత సూచీకి అతి దగ్గరగా ఉంటుంది. ఈ విషయంలో ఇండెక్స్ ఫండ్ కంటే ఇదే బెటర్‌ ఆప్షన్. ETFలో SIP ఫెసిలిటీ లేదు, ఇండెక్స్ ఫండ్‌లో ఉంది. ETFలో యూనిట్లు మాత్రమే కొనగలం, ఇండెక్స్ ఫండ్స్‌లో ఎంత మొత్తానికైనా ఫండ్స్ కొనగలం. కనీసం రూ.500 ఉన్నా ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడి స్టార్‌ చేయొచ్చు. ETFలో పెట్టే పెట్టుబడి మొత్తం నిర్దేశిత ఇండెక్స్‌ మీద ఆధారపడి ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్‌లో రోజులో ఎప్పుడైనా కొనొచ్చు & అమ్మొచ్చు. ETFలో మాత్రం ట్రేడింగ్ క్లోజింగ్‌ ప్రైస్‌లో మాత్రమే కొనగలం & అమ్మగలం.


3. డెట్ మ్యూచువల్ ఫండ్స్ (Debt Mutual Funds): మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇదొక టైప్‌. ఇవి.. బాండ్లు, సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్స్‌ను కొంటాయి. వాటిపై వచ్చే వడ్డీని మీకు ఆదాయంగా ఇస్తాయి. బాండ్లు, సెక్యూరిటీలపై వడ్డీల్లో తేడాలు ఉంటాయి. కాబట్టి, ఫండ్ మేనేజర్‌ పనితనాన్ని బట్టి మీకు రాబడి వస్తుంది. సాధారణంగా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ కంటే డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో రాబడి తక్కువగా ఉంటుంది. గత చరిత్రను బట్టి చూస్తే.. ఇవి బ్యాంక్‌ ఫిక్సిడ్ డిపాజిట్ల కంటే ఎక్కువ ఆదాయం ఇచ్చాయి.


4. గిల్ట్ మ్యూచువల్ ఫండ్స్ (Gilt Mutual Funds): డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ రకానికి చెందినవి. ఇవి కేవలం స్టేట్‌ & సెంట్రల్‌ గవర్నమెంట్‌ బాండ్లలో మాత్రమే ఇన్వెస్ట్‌ చేస్తాయి. ప్రభుత్వ బాండ్లు కాబట్టి రాబడికి హామీ ఉంటుంది, రిస్క్‌ కూడా ఉండదు. గత చరిత్ర ప్రకారం, ఇవి కూడా FD కంటే ఎక్కువ ఆదాయం అందించాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మీ బ్యాంక్‌ అకౌంట్‌ హ్యాక్ అయితే పరిస్థితేంటి, పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే వీలుందా?