Bank Account Hacking: పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట ICICI బ్యాంక్ బ్రాంచుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లలో గోల్‌మాల్ జరిగింది. అకౌంట్ హోల్డర్లు కోట్ల రూపాయల మేర మోసపోయారు. రెండున్నరేళ్ల క్రితం, మహేష్ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్ చేసిన చీకటి వ్యక్తులు, దాదాపు 12 కోట్ల రూపాయలు కొట్టేసారు. బ్యాంక్ సర్వర్‌లో లోపమే దీనికి కారణమని పోలీసులు తేల్చారు. ఇలాంటి సంఘటనలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి.
బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగానో, బ్యాంక్ సిబ్బంది చేతివాటం వల్లో, హ్యాకర్ల దాడి వల్లో మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బు పోతే పరిస్థితేంటి?. నష్టపోయిన మీ కష్టార్జితాన్ని తిరిగి ఎవరు చెల్లిస్తారు?. బ్యాంకులో దాచుకున్న సొమ్ములు మాత్రమే కాదు, వ్యక్తిగత సమాచారం కూడా సురక్షితమేనా అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.
మన దేశంలో కోవిడ్ టైమ్ నుంచి టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. దీనివల్ల సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు దోచుకోవడానికి కొత్త తలుపులు తెరుచుకున్నట్లైంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సహా ఆర్థిక లావాదేవీల గురించి సంపూర్ణంగా తెలిసిన హ్యాకర్లు బ్యాంక్ సర్వర్ల మీద దాడి చేస్తారు. దీనికంటే ముందే, తాము టార్గెట్ చేసిన బ్యాంక్ వాడుతున్న సాఫ్ట్‌వేర్ మీద పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుంటారు.
బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ ఈజీగా జరిగే పని కాదు. చాలా సేఫ్టీ వాల్స్‌ను దాటాలి. ఇదంతా ఒక్క రోజులో జరిగే పని కాదు. బ్యాంకులు వాడుతున్న టెక్నాలజీ, అప్‌డేట్స్ తెలుసుకోవడానికి హ్యాకర్లు ప్రతిరోజూ సర్వర్‌ను గమనిస్తుంటారు. ఏదోక లోపం కనిపెట్టేవరకు కొన్ని నెలలపాటు అదే పనిలో ఉంటారు. చివరకు ఓరోజు వారిదవుతుంది, లూప్‌హోల్ కంటబడుతుంది. ఆ లూప్‌హోల్‌ను ఉపయోగించి బ్యాంక్ సర్వర్‌లోకి చొరబడతారు. నిమిషాల వ్యవధిలోనే కస్టమర్ల అకౌంట్లలోని డబ్బులు మాయం చేసి, విదేశాల్లోని అకౌంట్లలోకి బదిలీ చేస్తారు.
2017లో పుణెలోని యూనియన్ బ్యాంకుపై, 2018లో పుణెలోనే ఉన్న కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్‌పైన మాల్‌వేర్‌తో దాడి చేసి వందల కోట్లు లూఠీ చేశారు.
డబ్బులు పోతే కస్టమర్ల పరిస్థితేంటి?
ఒక వ్యక్తి ఏదైనా బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే, ఖాతా నిర్వహణ కోసం సదరు బ్యాంక్ వివిధ రకాల ఛార్జీలు వసూలు చేస్తుంది. పైగా, ప్రజల డబ్బుతో వ్యాపారం చేసి లాభాలు గడిస్తుంది. కాబట్టి, జనం సొమ్ముకు సరైన భద్రత కల్పించడం బ్యాంకుల కనీస బాధ్యత. కేంద్ర బ్యాంక్ (RBI) రెగ్యులేషన్స్ కూడా ఇదే చెబుతున్నాయి.
కాబట్టి.. బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్‌కు గురై కస్టమర్ డబ్బులు పోతే, ఆ సొమ్మును తిరిగి ఇచ్చే పూర్తి బాధ్యత బ్యాంకుదే. రిజర్వ్ బ్యాంక్ గెడెన్స్ ప్రకారం.. ప్రతి బ్యాంకులో ఐటీ కమిటీ, రిస్క్ మ్యానేజ్‌మెంట్ కమిటీ ఉండాలి. తరచూ ఐటీ ఆడిట్ జరగాలి. కొన్ని బ్యాంకులు ఓ అడుగు ముందుకేసి ఎథికల్ హ్యాకర్లను నియమించుకుంటాయి. ఆ వ్యక్తులు బ్యాంక్ సర్వర్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తూ, లోపాలు కనిపెట్టే పనిలో ఉంటారు. తద్వారా, ఆ లొసుగులను బ్యాంక్‌లు సరిదిద్దుకుంటాయి.
అంతేకాదు, ప్రతి బ్యాంక్ ఖాతాకు బీమా కూడా ఉంటుంది. అసలు + వడ్డీ కలిపి గరిష్టంగా రూ.5 లక్షల మొత్తానికి ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది.
ఒకవేళ, బ్యాంకు సర్వర్ హ్యాకింగ్ జరిగి కస్టమర్ డబ్బుపోతే, డబ్బు డెబిట్ అయినట్లు అకౌంట్ హోల్డర్‌కు SMS వస్తుంది. కస్టమర్ వెంటనే అప్రమత్తమై, 24 గంటల్లోగా బ్యాంక్‌కుగానీ, RBIకి గానీ ఫిర్యాదు చేయాలి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంక్ తప్పించుకోలేదు, కస్టమర్ డబ్బును అణాపైసలతో సహా తిరిగి చెల్లిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: EMIలు కట్టేవాళ్లు షాక్ అయ్యే వార్త- భారం ఇప్పట్లో తగ్గేటట్టు లేదు!