Retail Inflation Data For September 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ భయాలు నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు భారీగా పెరగడంతో, సెప్టెంబర్‌ నెల రిటైల్ ద్రవ్యోల్బణం రేటు కూడా భారీగా పెరిగింది. సెప్టెంబర్ 2024 కోసం విడుదల చేసిన వినియోగదార్ల ధరల సూచీ (CPI) ప్రకారం, భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ 2024లో 5 శాతం దాటింది, 5.49 శాతానికి చేరుకుంది. 


సీపీఐ ఇన్‌ఫ్లేషన్‌ (CPI Inflation) ఆగస్టు 2024లో 3.65 శాతంగా ఉంది. దీనికంటే ముందు, జులైలో 3.54 శాతంగా ఉంది. ఆ రెండు నెలలు భారతీయ రిజర్వ బ్యాంక్‌ (RBI) టాలరెన్స్ బ్యాండ్ అయిన 4 శాతంలోపే ఉన్న చిల్లర ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌లో దాదాపు 2 శాతం ఎగబాకి, 5.49 శాతానికి చేరింది. 


ఆహార ద్రవ్యోల్బణం 9.24 శాతం
కేంద్ర గణాంకాలు & కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ, సెప్టెంబర్‌ నెల రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ డేటాను విడుదల చేసింది. ఆ నెలలో... చిల్లర ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 5.87 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 5.05 శాతంగా నమోదైంది. హైయ్యర్‌ బేస్ ఎఫెక్ట్ & వాతావరణ పరిస్థితుల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఒకేసారి దాదాపు 2 శాతం పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సెప్టెంబర్‌ 2024లో ఆహార ద్రవ్యోల్బణం రేటు (Food Inflation Rate) కూడా భారీగా పెరిగి 9.24 శాతానికి చేరుకుంది. ఆహార ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 9.08 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 9.56 శాతంగా ఉంది. దీనికిముందు, ఆగస్టు నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.66 శాతంగా ఉంది. 


సామాన్య జనానికి కూర'గాయాలు'
గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ లెక్కల ప్రకారం... సెప్టెంబర్ నెలలో కూరగాయల రేట్లు భారీగా పెరిగాయి. ఫలితంగా కూరగాయల ద్రవ్యోల్బణం కూడా అనూహ్యంగా పెరిగింది. సెప్టెంబర్‌లో కూరగాయల ద్రవ్యోల్భణం 35.99 శాతంగా ఉంటే, ఆగస్టులో ఇది 10.71 శాతంగా మాత్రమే ఉంది. పాలు & పాల సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం రేటు కూడా ఆగస్టులోని 2.98 శాతం నుంచి సెప్టెంబర్‌లో 3.03 శాతానికి చేరింది. 


ప్రొటీన్స్‌ పుష్కలంగా ఉండే పప్పులు మాత్రం సామాన్యులపై కాస్త కనికరం చూపాయి. పప్పు దినుసుల ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 13.60 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో 9.81 శాతానికి తగ్గింది. ధాన్యాలు & సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. ఇది సెప్టెంబర్‌లో 6.84 శాతంగా ఉంది, ఆగస్టులోని 7.31 శాతం నుంచి ఉపశమించింది. చక్కెర ద్రవ్యోల్బణం రేటు 3.46 శాతానికి, గుడ్ల ద్రవ్యోల్బణం 6.31 శాతానికి దిగి వచ్చాయి. మాంసం, చేపల ద్రవ్యోల్బణం 2.66 శాతానికి తగ్గింది. 


నీరుగారిన చౌక EMI ఆశలు 
ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ ‍‌(RBI MPC) డిసెంబర్ 2024లో సమావేశం అవుతుంది. ఈ భేటీలోగా రిటైల్ ద్రవ్యోల్బణం రేటు టాలరెన్స్ బ్యాండ్ అయిన 4 శాతం దిగువకు రాకపోతే, డిసెంబర్‌ సమీక్షలో రెపో రేటును (Repo Rate) తగ్గించడానికి కేంద్ర బ్యాంక్‌ మొగ్గు చూపకపోవచ్చు. ఫలితంగా, ఖరీదైన రుణాలు, EMIల నుంచి ఉపశమనం లభించకపోవచ్చు.


కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, సెప్టెంబర్‌ 2024 నెలలో టోకు ద్రవ్యోల్బణం రేటు (Wholesale Inflation Data For September 2024) కూడా పెరిగింది.


మరో ఆసక్తికర కథనం: రూ.9కే రూ.25,000 ఫైర్‌క్రాకర్‌ ఇన్సూరెన్స్‌ - స్పెషల్‌గా లాంచ్‌ చేసిన ఫోన్‌పే