Phonepe Firecracker Insurance For 9 Rupees: దీపావళికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల 31న (అక్టోబర్‌ 31, 2024) దేశవ్యాప్తంగా దీపావళి పండుగను వైభవంగా జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. టపాసుల మోత, ఆకాశంలో వాటి వెలుగులు లేనిదే దీపావళి జరుపుకున్నట్లు ఉండదు. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న అలవాటు. అయితే, ఒక్కోసారి, టపాసులు పేలి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆస్తి నష్టం, గాయపడడం లేదా ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది. దీపావళి తర్వాతి రోజున, పత్రికలు & టీవీల్లో ఇలాంటి వార్తలు చూస్తుంటాం. 


దీపావళి టపాసుల వల్ల కలిగే ప్రమాద సంఘటనల నుండి రక్షణను అందించడానికి, దేశంలోని అతి పెద్ద ఆన్‌లైన్ పేమెంట్స్‌ థర్డ్‌ పార్టీ కంపెనీ ఫోన్‌పే (PhonePe) ముందుకు వచ్చింది. కేవలం 9 రూపాయలకే (జీఎస్‌టీ కలిపి) 25 వేల రూపాయల (రూ.25,000) ప్రమాద బీమా పొందే వెసులుబాటు కల్పించింది. ఇది షార్ట్ టర్మ్ కవరేజ్. అంటే, కేవలం పండుగ సీజన్ కోసమే ఈ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను ఫోన్‌పే ప్రత్యేకంగా దీనిని తీసుకొచ్చింది. దీని ద్వారా, ప్రజలకు అతి తక్కువ ధరకే మంచి బీమా కవరేజ్‌ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.


ఫోన్‌పే ఫైర్‌ ఫైర్‌క్రాకర్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ను ఎక్కడ కొనాలి, ఎలా పని చేస్తుంది?


ఫోన్‌పే ఫైర్‌ ఫైర్‌క్రాకర్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను ఫోన్‌పే యాప్‌లో కొనుగోలు చేయవచ్చు. దీని ద్వారా, బీమా తీసుకున్న వ్యక్తితో పాటు అతను/ఆమె జీవిత భాగస్వామి & ఇద్దరు పిల్లలకు కవరేజ్‌ వర్తిస్తుంది. అంటే, మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు బీమా రక్షణలో ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఫ్యామిలీ ఇన్సూరెన్స్‌ కవరేజ్‌. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడం వల్ల కలిగే ప్రమాదాలకు అత్యంత తక్కువ ధరకే స్వల్పకాలిక బీమా కవరేజీని అందించడానికి బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో (Bajaj Allianz General Insurance) ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫోన్‌పే వెల్లడించింది. 


ఫోన్‌పే ఫైర్‌ ఫైర్‌క్రాకర్‌ ఇన్సూరెన్స్‌ కింద ఎలాంటి సెక్యూరిటీ కవరేజ్‌ ఉంటుంది? 


-- దీని కవరేజ్ 25 అక్టోబర్ 2024న ప్రారంభమై 3 నవంబర్ 2024 వరకు కొనసాగుతుంది. మొత్తం 10 రోజులు కవరేజ్‌ లభిస్తుంది.      


-- ఫైర్‌క్రాకర్‌ ప్రమాదం వల్ల పాలసీహోల్డర్‌ ఆసుపత్రిలో చేరినా, డే కేర్ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నా, ప్రమాదవశాత్తు పాలసీదారు మరణించినా బీమా కవరేజ్‌ వర్తిస్తుంది.  


-- ఫోన్‌పే ఫైర్‌ ఫైర్‌క్రాకర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ విక్రయం 3 నవంబర్ 2024న ముగుస్తుంది.     


-- అక్టోబర్‌ 25 తర్వాత వినియోగదారు బాణసంచా కొనుగోలు చేస్తే, కొనుగోలు తేదీ నుంచి పాలసీ కవరేజ్‌ ప్రారంభమవుతుంది.         


దీపావళి పండగను ప్రజలంతా సంతోషంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నట్లు ఫోన్‌పే ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ సర్వీసెస్‌ CEO విశాల్‌ గుప్తా చెప్పారు. ఒకవేళ, అవాంఛనీయ సంఘటన జరిగితే, ఆ కుటుంబం డబ్బు కోసం ఇబ్బంది పడుకుండా తమ బీమా పాలసీ రక్షణగా నిలస్తుందని అన్నారు.


మరో ఆసక్తికర కథనం: 'EC' కోళ్లఫారం అంటే ఏంటి, లక్షల్లో లాభాలు ఆర్జించొచ్చా?