EC Chicken Form Details In Telugu: మనలో చాలామంది కోళ్లఫారాలను చూసే ఉంటారు. భారీ రేకుల షెడ్లలో, ఎదిగిన కోళ్లను, కోడిపిల్లలను పెంచుతుంటారు. అవి అటుఇటు తిరుగుతూ, గింజలు తింటూ సందడిగా కనిపిస్తుంటాయి. అయితే, రేకుల షెడ్లలో ఉండడం వల్ల వాతావరణ ఉష్ణోగ్రతల ప్రభావం కోళ్ల మీద పడుతుంది. ముఖ్యంగా, కోడిపిల్లల ఎదుగుదల మీద డైరెక్ట్‌గా ఎఫెక్ట్‌ చూపిస్తుంది. వేడి ఎక్కువగా ఉంటే.. బాయిలర్స్‌ తక్కువ దాణా తింటాయి. ఫలితంగా వాటి ఆరోగ్యం & బరువు రెండూ దెబ్బతింటాయి. లేయర్స్ అయితే తక్కువ గుడ్లు పెడతాయి. వాతావరణం చల్లగా మారినప్పుడు కూడా కోళ్లలో రోగాలు పెరుగుతాయి. ఇలాంటి అనూహ్య వాతావరణ మార్పులను తట్టుకునేదే "ఈసీ కోళ్లఫారం". ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాల్లో  వెయ్యికి పైగా ఈసీ కోళ్లఫారాలు ఉన్నాయి. వీటిలో బాయిలర్స్‌ను మాత్రమే పెంచుతున్నారు.


మామూలు కోళ్ల ఫారం Vs ఈసీ కోళ్లపారం - తేడాలేంటి?
మాములు కోళ్ల ఫారాలు ఓపెన్‌గా ఉంటాయి. ఈసీ కోళ్లఫారాల్లో బయటి ఉష్ణోగ్రతలు లోపలకు చొరబడకుండా కట్టుదిట్టం చేస్తారు. తద్వారా, ఆ ప్రదేశంలో ఉష్ణోగ్రతలు కోళ్ల పెరుగుదలకు తగ్గట్లుగా, ఏ కాలంలోనైనా ఒకేలా ఉండేలా నియంత్రిస్తారు. ఇదే ఈసీ కోళ్లఫారం. EC అంటే ఎన్‌విరాన్మెంటల్ కంట్రోల్. 


ఈసీ కోళ్లఫారం నిర్మాణం
సాధారణంగా, ఈసీ కోళ్ల ఫారం షెడ్‌ను 360 నుంచి 400 అడుగుల పొడవుతో, 40 నుంచి 47 అడుగుల వెడల్పుతో నిర్మిస్తారు. ఒక్కో షెడ్‌లో గరిష్టంగా 25,000 వరకు కోళ్ల పిల్లలను పెంచొచ్చు. ఈ షెడ్‌ను అన్ని వైపులా మూసేస్తారు. వెంటిలేషన్ కోసం పెద్ద ఫ్యాన్లు ఏర్పాటు చేస్తారు. బయటి నుంచి లోపలకు వచ్చే వేడిగాలిని చల్లబరచడానికి వివిధ మార్గాలను అనుసరిస్తారు. చలికాలంలో, షెడ్‌ లోపల చల్లదనం పెరగకుండా హీటర్లు పెడతారు. అలా, అన్ని కాలాల్లో ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండేలా చూస్తారు. కాస్త ఎత్తులో ఉన్న ప్రదేశంలో షెడ్‌ నిర్మిస్తే గాలి-వెలుతురు బాగా వస్తాయి. అలాంటి ప్రాంతాల్లో తక్కువ ఫ్యాన్స్ సరిపోతాయి. కరెంటు వాడకం కూడా తగ్గుతుంది.


ఈసీ కోళ్ల ఫారాల్లో రెండు రకాలు ఉన్నాయి - సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్. 25 వేల కోడి పిల్లలను పెంచాలంటే ఫుల్లీ ఆటోమేటిక్ షెడ్ అవసరం అవుతుంది.


చాలా పనులు ఆటోమేటిక్‌
ఈసీ కోళ్ల ఫారాల్లో ఉష్ణోగ్రతల నియంత్రణ మాత్రమే కాదు.. దాణా వేయడం, నీళ్లు నింపడం వంటి కొన్ని ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. ఫలితంగా 35-37 రోజుల వ్యవధిలోనే కోడిపిల్లలు ఎదిగి, అవసరమైన బరువుకు చేరతాయి.


ఈసీ కోళ్లఫారాల వల్ల ఉపయోగాలు
కోళ్లు చక్కగా ఎదుగుతాయి, అనుకున్న బరువు పెరుగుతాయి
సాధారణ కోళ్లఫారం నిర్వహణకు దాదాపు ఏడుగురు అవసరమైతే, ఈసీ ఫారాన్ని ఒకరిద్దరితోనే నిర్వహించొచ్చు
నిర్వహణ వ్యయం తక్కువ కావడం వల్ల లాభాలు పెరుగుతాయి
సాధారణ కోళ్లఫారంలో 10,000 కోళ్లను పెంచితే, ఈసీ ఫారంలో 25,000 వరకు పెంచొచ్చు
సాధారణ షెడ్లతో పోలిస్తే ఈసీ షెడ్లలో కోడి పిల్లలు చనిపోవడం చాలా తక్కువ
ఈసీ కోళ్లఫారంలో కోళ్లకు వ్యాధులు తక్కువ
సాధారణ ఫారంలో కోడి బరువు అనుకున్న స్థాయికి చేరాలంటే 45-50 రోజులు పడుతుంది. ఈసీ టెక్నాలజీలో 32-37 రోజుల్లో 2 కిలోలకు పైగా పెరుగుతాయి.
సాధారణ ఫారాలలో సంవత్సరానికి సగటును 5 బ్యాచులు తీస్తే, ఈసీ ఫారాలలో 7 బ్యాచులు తీయొచ్చు
సాధారణ కోళ్లఫారాల కంపు భరించలేరు కాబట్టి వాటిని ఊరికి దూరంగా నిర్మిస్తారు. ఈసీ కోళ్ల ఫారాల నుంచి పెద్దగా వాసన రాదు.


ఎంత ఖర్చువుతుంది?
25,000 కోడిపిల్లలను పెంచగలిగే ఈసీ షెడ్‌ వేయడానికి రూ.50 లక్షలు, యంత్రాల కోసం మరో రూ.40 లక్షలు, కరెంట్‌ కోసం దాదాపు రూ.30 లక్షలు అవసరమవుతాయి. సొంత భూమి ఉంటే, ఈ ఖర్చులో 70-80% వరకు బ్యాంక్‌ లోన్‌ లభిస్తుంది. పెట్టుబడి ఎక్కువగా అనిపించినప్పటికీ, నిర్వహణ సరిగ్గా ఉంటే రెండుమూడేళ్లలోనే పెట్టుబడి మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవచ్చని అనుభవం ఉన్న రైతులు చెబుతున్నారు.


ఆదాయం ఎంత?
అనుభవం ఉన్న రైతులు చెప్పిన ప్రకారం - సంవత్సరానికి 7 బ్యాచ్‌లు తీస్తే, ఒక్కో బ్యాచ్‌కు సగటున 7.50 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఒక్కో బ్యాచ్‌కు అయ్యే ఖర్చు 1.50 లక్షలు. లాభం సరాసరి 5 లక్షల రూపాయలు. అంటే, 7 బ్యాచ్‌ల మీద ఏడాదికి సగటున 35 లక్షల రూపాయల లాభం సంపాదించే అవకాశం ఉంది. 


మరో ఆసక్తికర కథనం: దెబ్బకు దిగొచ్చిన ఓలా - కూపన్ల బదులు డబ్బులు, యాప్‌లో చాలా మార్పులు