Bhavish Aggarwal: ఓలా గ్రూప్ & దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిష్ అగర్వాల్ (OLA Group CEO Bhavish Aggarwal) కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ తర్వాత, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ షేర్లు పతనమవుతున్నాయి. నాసిరకం సర్వీసింగ్, అబద్ధపు ప్రకటనలు, అన్యాయపూరిత వ్యాపార విధానాలకు సంబంధించి ఓలా ఎలక్ట్రిక్‌పై 10 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై కేంద్ర రవాణా శాఖ స్వయంగా విచారణ జరుపుతోందని తెలుస్తోంది. ఓలా స్కూటర్ల సర్వీసింగ్ విషయంలో, ఇటీవల, భవిష్ అగర్వాల్ - స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సోషల్ మీడియాలో తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. ఆ సమయంలో, సహనం కోల్పోయి భవిష్ అగర్వాల్ చేసిన దురుసు వ్యాఖ్యలతో ఓలా ఎలక్ట్రిక్ మీద కస్టమర్లలో వ్యతిరేకత & అసంతృప్తి మరింత పెరిగింది.
ఇప్పుడు, ఓలా క్యాబ్స్ వంతు వచ్చింది. ఓలా క్యాబ్స్‌పై గతంలో ఓ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. తనకు రావలసిన రిఫండ్‌ను డబ్బు రూపంలో ఇవ్వకుండా ఎగ్గొట్టి, దాని బదులు కూపన్ ఇచ్చి ఓలా క్యాబ్స్ అనైతిక వ్యాపారం చేస్తోందని తన కంప్లైంట్‌లో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపిన 'సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ' (CCPA), ఫిర్యాదు చేసిన కస్టమర్ ఖాతాకు డబ్బును బదిలీ చేయాలని ఆదివారం నాడు ఆ కంపెనీని ఆదేశించింది. ఇప్పటి వరకు, కస్టమర్లకు రావలసిన డబ్బుకు బదులు ఓలా క్యాబ్స్ కూపన్లు మాత్రమే ఇస్తోంది. తదుపరి రైడ్ సమయంలో ఆ కూపన్లను ఉపయోగించుకోవాలి.
రిఫండ్‌ను బ్యాంక్ ఖాతాను బదిలీ ఆప్షన్
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు, ఓలా క్యాబ్స్‌పై 'జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్' (National Consumer Helpline)కు 2,061 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో చాలా ఫిర్యాదులు ఓవర్‌ఛార్జ్, రీఫండ్ సమస్యలకు సంబంధించినవే. ఈ ఫిర్యాదులపై సీసీపీఏ స్పందించింది. కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా సమాచారం వెళ్లింది. ఒక ఓలా కస్టమర్, తనకు రావలసిన రిఫండ్‌ను తన బ్యాంకు ఖాతా బదిలీ చేసుకోవాలన్నా లేదా కూపన్ రూపంలో తీసుకోవాలన్నా దానికి తగ్గ ఆప్షన్స్ కచ్చితంగా ఇవ్వాలని ఓలా క్యాబ్స్‌ను రెగ్యులేటరీ అథారిటీ ఆదేశించింది.
ప్రస్తుతం, కస్టమర్ ఓలా యాప్‌లో ప్రశ్నలు అడిగేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేవని CCPA చీఫ్ కమిషనర్ నిధి ఖరే చెప్పారు. రీఫండ్ కోసం అడిగే ఆప్షన్ లేదని, దాని కింద కేవలం కూపన్లు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఇది వినియోగదారుల హక్కులను స్పష్టంగా ఉల్లంఘించినట్లేనని చెప్పారు. ఓలా ప్లాట్‌ఫామ్ ద్వారా రైడ్ బుక్ చేసుకున్న వాళ్లు, తాము చెల్లించిన డబ్బుకు రిసిప్ట్ పొందలేకపోతున్నారని, వినియోగదారుల రక్షణ చట్టం కింద ఇది అన్యాయమైన వాణిజ్య విధానమని అన్నారు.
ఓలా ఫ్లాట్‌ఫామ్‌లో చాలా మార్పులు
'సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ' ఆదేశంతో, తన ఫ్లాట్‌ఫామ్‌లో ఓలా క్యాబ్స్ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. రైడ్ బుక్ చేసుకున్నవాళ్లు ఫిర్యాదు చేసేందుకు నోడల్ ఆఫీసర్ కాంటాక్ట్ వివరాలను యాడ్ చేసింది. రైడ్ క్యాన్సిల్ చేసుకునే నిబంధనలు - మరిన్ని కారణాలను కూడా యాప్‌లో చూపిస్తోంది. అంతేకాదు, రైడ్ బుక్ చేసుకునేప్పుడే ఎంత ఛార్జీ అవుతుందో తెలియడం, చెల్లించిన ఛార్జీలో దేనికి ఎంత అనే వివరాలనూ వెల్లడిస్తోంది. రైడ్ బుక్ చేసుకున్న వ్యక్తి అడ్రస్, చేరాల్సిన చిరునామా గురించి కూడా బుకింగ్ సమయంలోనే డ్రైవర్లకు ప్రదర్శిస్తోంది.
మరో ఆసక్తికర కథనం: ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌లుగా కార్లు, బైకులు - జాబ్ చేస్తే ఇలాంటి కంపెనీలోనే చేయాలి