Pawan Kalyan Palle pandaga: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30వేల అభివృద్ధి పనులు, 4500 కోట్లు ఖర్చు. పల్లె పల్లెలో పండగ వాతావరణం. తన మార్క్ పాలన చూపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం వరకు అనేక మార్పులు చేస్తూ వస్తున్నారు పాలకులు. గత ఐదేళ్లు పాలనను పూర్తిగా గాడి తప్పించారని అభివృద్ధిని మరిచిపోయారని ఆరోపిస్తూనే వాటిని సరి చేసి ప్రగతి పట్టాలు ఎక్కిస్తున్నామని చెబుతున్నారు. అందులో భాగంగా ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతోపాటు తమ మార్క్ పాలన చూపించేందుకు కూలక నేతలతో ప్రయత్నిస్తున్నారు.
డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ తొలిసారిగా అధికారంలో ఉన్నారు. ఆయనపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆయన తీసుకున్న శాఖలు కూడా నేరుగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవే. అందుకే వాటిని బేస్ చేసుకొని తన మార్క్ పాలన ప్రజలకు అందివ్వాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గ్రామ సభలతో రికార్డుల మోత మోగించారు. ఇప్పుడు అలాంటి ఇంకో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లె పండగ వారోత్సవాలు పేరుతో గ్రామాల్లో రోడ్లు ఇతర మౌలిక సదుపాయలపై దృష్టి పెట్టారు.
ఐదేళ్ల పాటు రాష్ట్రంలోని ప్రతి పల్లె నిర్లక్ష్యానికి గురైందని చెబుతున్న పవన్ కల్యాణ్ వాటిని ప్రగతి బాటలో తీసుకొస్తామని అంటున్నారు. అందుకు గ్రామసభల ద్వార ప్రజలకు కావాల్సినవి తెలుసుకోవడం, వారికి ఉపాధి కల్పించే మార్గాలు పరిశీలించిన ఆయన...ఇప్పుడు పనులు కేటాయిస్తున్నారు. ఇవాల్టి(అక్టోబర్ 14 ) నుంచి పల్లెపండగ పేరుతో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30 వేల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగే కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పవన్ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
పవన్ కల్యాణ్ ప్రారంభించిన తర్వాత మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని పనులు ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు ఈ పల్లె పండగ వారోత్సవాలు జరుగుతాయి. అంటే 20వ తేదీ వరకు అభివృద్ధి పనులకు అధికారులు, ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేస్తారు.
ఇవాళ శంకస్థాపనలు చేసే పనులను సంక్రాతి నాటికి పూర్తి చేయాలని అధికారులకు టార్గెట్ ఫిక్స్ చేశారు. వీటిలో 3 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, 25 వేల గోకులాలు, 10 వేల ఇంకుడు గుంతలు తవ్వబోతున్నారు. ఉపాధిహామీ పథకంలోని మెటీరియల్ నిధులతో ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను ఆగస్టు 23న రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేశారు. వాటి ఆధారంగానే ఇప్పుడు పనులు ప్రారంభిస్తారు.