Andhra Pradesh Liquor Shops : ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ- లాటరీ ద్వారా ఖరారు

Liquor Shops In Andhra Pradesh: భారీ బందోబస్తు మధ్య ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ షాప్‌లను ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తున్నారు. దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ తీస్తూ ప్రక్రియను చేపట్టారు అధికారులు

Continues below advertisement

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి పటిష్ట బందోబస్తు మధ్య అధికారులు లాటరీ తీస్తున్నారు. అధికారిక ప్రక్రియలు పూర్తి చేసిన వారి పేర్లను వేసి అందులో ఆయా షాపులు కేటాయిస్తున్నారు. 26 జిల్లాల పరిధిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసే ప్రక్రియ కొనసాగుతోంది. గెజిట్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం లాటరీని అధికారులు తీస్తున్నారు. 

Continues below advertisement

జిల్లాలో ఎ‌న్ని దుకాణాలు ఉన్నప్పటికీ ఒక్కో దుకాణం ఆర్డర్ ప్రకారం లాటరీ తీస్తున్నారు. ముందుగా ఒకటో నెంబర్ కేటాయించి దుకాణానికి వచ్చిన దరఖాస్తులకు నెంబర్లు ఇచ్చి ఉంటారు. వాటన్నింటినీ డబ్బాలో వేసి ఒకదాన్ని తీస్తున్నారు. అలా వచ్చిన దుకాణానికి అధికారిక అనుమతులు ఇస్తారు. వాళ్లకే లైసెన్స్ ఇచ్చే ప్రక్రియ చేపడతారు. ఇదంతా దరఖాస్తుదారుల సమక్షంలోనే నిర్వహిస్తారు. ఇలా అన్ని దుకాణాలకు చేస్తారు. 

రాష్ట్రవ్యాప్తంగా 3396 దుకాణాల ఏర్పాటు కోసు 89,882 దరఖాస్తులు వచ్చాయి. ఎక్కువ దుకాణాలు తిరుపతి జిల్లాలో ఉంటే అతి తక్కువ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. తిరుపతి 227 దుకాణాలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. అల్లూరి సీతారామారాజు జిల్లాలో 40 మాత్రమే దుకాణాలు ఉన్నాయి. పోటీ ఎక్కువ ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే తక్కువ అనంతపురం జిల్లాలో ఉంది. 

ఈ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా రెండు లక్షల రూపాయలను డిపాజిట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని దరఖాస్తు ఫీజుల కింద ప్రభుత్వమే తీసుకుంటుంది. ఇలా ప్రభుత్వానికి 1,797.64 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చింది. కొన్ని జిల్లాల్లో నేతలు సిండికేట్ కావడంతో చాలా వరకు దరఖాస్తులు రాలేదని అధికారులు భావిస్తున్నారు. మొదట్లో ఇదే కారణంతో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి కనిపించింది. అధినాయకత్వం కలుగుజేసుకొని మద్యం టెండర్ల విషయంలో ఎమ్మెల్యేలు, ఇతర నేతల జోక్యం వద్దని హెచ్చరించడంతో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. అయినా అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి, బాపట్ల, అన్నమయ్య, ప్రకాశం, పల్నాడు వంటి జిల్లాల్లో ఔత్సాహికులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. 

రాష్ట్రంలో మూడేసి దరఖాస్తులు వచ్చినవి 12 దుకాణాలు, నాలుగేసి దరఖాస్తులు వచ్చినవి 5, ఐదేసి దరఖాస్తులు వచ్చినవి 12 ఉన్నాయి. పది అంతకంటే తక్కువగా దరఖాస్తులు వచ్చిన దుకాణాలు 213 ఉన్నాయి. 100 కంటే ఎక్కువగా దరఖాస్తులు నాలుగు దుకాణాల్లో వచ్చాయి. వీటిలో ఎన్టీఆర్‌ జిల్లాలోనివే మూడు ఉన్నాయి. 90-99 మధ్య 2 దుకాణాలకు, 80-89 మధ్య 6 దుకాణాలకు, 70-79 మధ్య 17 దుకాణాలకు ఇలా40 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన దుకాణాలు 506 ఉన్నాయి. 

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులకు అనంతపురం జేఎన్టీయూ ఆడిటోరియంలో ప్రక్రియ కొనసాగుతోంది. ఆ పరిసర ప్రాంతాల్లోనూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మద్యం దుకాణాల టెండర్ వేసే సమయంలోనే జనరేట్ అయిన పాస్‌తో పాటు, ఏదైనా గుర్తింపు కార్డు ఉంటేనే దరఖాస్తుదారుడు టెండర్లు జరిగిన ప్రాంతంలోకి అనుమతి ఉంటుంది. ఆ పాస్ లేకపోతే ఎవరిని అనుమతించమని ఇప్పటికే పోలీసులు పేర్కొన్నారు. 

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 136 ప్రైవేట్ మద్యం దుకాణాలకు 3265 దరఖాస్తులు వచ్చాయి. సత్యసాయి జిల్లాలోని 87 షాప్‌లకు 1518 దరఖాస్తులు పడ్డాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్న మద్యం దుకాణాలకు అత్యధికంగా దరఖాస్తులు వేశారు. వీటిని మొత్తం పరిశీలిస్తే 30 దుకాణాలకు గాను 1158 మంది దరఖాస్తు చేశారు. అత్యల్పంగా తాడపత్రి నియోజకవర్గంలో 20 దుకాణాలకు గాను 106 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 223 మద్యం దుకాణాలకు గాను 4783 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్లకు నిబంధనల ప్రకారం పెట్టిన దరఖాస్తు ఫీజు రూపంలో 95 కోట్ల 66 లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమైంది. 

Continues below advertisement