Andhra Pradesh: పల్లె పండగ కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది. వారం రోజుల పాటు చేపట్టే కార్యక్రమంలో గ్రామాల్లో ఉన్న మౌలిక వసతుల కొరత తీర్చే పనిలో పడింది. ఈ పనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉపయోగిస్తున్నారు. అందుకే దీనిపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇప్పటి వరకు తన దృష్టికి వచ్చిన చిన్న చిన్న వివాదాలను పరిష్కరించాలని సూచించారు.  


పల్లె పండుగ వారోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి పల్లెలో ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఆయా గ్రామాల్లో చేపడుతున్న పనులు, అందుకు చేస్తున్న ఖర్చలు వివరిస్తూ బోర్డులు పెట్టారు. అయితే ఇందులో కొన్ని ప్రాంతల్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ ఫొటో మాత్రమే ముద్రించారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయని అందరి ఫొటోలు ఉండేలా చూడాలంటూ సూచనలు చేశారు. 






తన దృష్టికి వచ్చిన వెంటనే సమస్యపై పవన్ కల్యాణ్ స్పందించారు. కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, వాల్ పెయింట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఏర్పాటు చేయలేదన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. పల్లె పండుగ వారోత్సవాలకు సంబంధించిన ప్రతి ఫ్లెక్సీ, వాల్ పెయింట్, సిటిజన్ నాలెడ్జ్ బోర్డులపైన కచ్చితంగా మోడీ ఫొటో ఉండాలని సూచించారు. ప్రధాన మంత్రి ఫొటోతోపాటు సీఎం చంద్రబాబు ఫొటో కూడా ఉండాల్సిందేనంటూ ఆదేశించారు. 


ప్రధానమంత్రి, సీఎం ఫొటోలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం, పంచాయతీరాజ్ లోగో, ఉపాధి హామీ పథకం లోగో ఉండాలన్నారు. కచ్చితంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యక్రమాల్లో ఈ ప్రోటోకాల్ తప్పనిసరి చేశారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, అధికార యంత్రాంగం ఈ విషయాన్ని పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.