ఆధునిక యుగంలో ఆరోగ్య బీమా తప్పనిసరి అవసరంగా మారిపోయింది. కాలం గడిచేకొద్దీ వాతావరణంలో ఎన్నో మార్పులొస్తున్నాయి. అన్నీ కలుషితం అవుతున్నాయి. ఒత్తిళ్లు ఎక్కువ అవుతుండటంతో మనుషులు అనారోగ్యం పాలవుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరంగా ఆస్పత్రిలో చేరితో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరికొందరు తీర్చలేనంతగా అప్పుల పాలవుతున్నారు!


రాష్ట్రాలను బట్టి వైద్యారోగ్య ద్రవ్యోల్బణం 8-23 శాతం పెరిగింది. అందుకే ఆరోగ్య బీమా ఇప్పుడో నిత్యావసరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఒక కుటుంబానికి ఎంత ఆరోగ్య బీమా అవసరం? పెద్ద వయస్కులుంటే ఏం చేయాలి? తల్లిదండ్రులకు వేరుగా బీమా తీసుకుంటే మంచిదా? వంటి వివరాలు మీ కోసం!!


పెరుగుతున్న ఖర్చు
సగటున ఏటా ఆస్పత్రి ఖర్చులు 15 శాతం పెరుగుతున్నాయి. ఇప్పుడు రూ.4 లక్షలయ్యే ఆస్పత్రి ఖర్చు 10 ఏళ్లకు రూ.16 లక్షలు అవుతుంది. 20 ఏళ్లకు రూ.65 లక్షలకు పెరుగుతుంది. అలాగే కట్టాల్సిన ప్రీమియం పైపైకి చేరుకుంటుంది. అందుకే చిన్న వయసులోనే ఎక్కువ విలువైన ఆరోగ్య బీమాను తీసుకుంటే తక్కువ ఖర్చే అవుతుంది.


రూ.5 లక్షల ఫ్లోటర్‌ సరిపోదు
ప్రస్తుత అవసరాల రీత్యా రూ.5లక్షల కుటుంబ ఫ్లోటర్‌ ప్లాన్‌ ఏ మాత్రం సరిపోదు. సరైన బీమా తీసుకోకపోతే ఆస్పత్రిలో చెల్లించాల్సిన ఖర్చులు అమాంతం పెరిగిపోతాయి. ఇది మీ నగదు ప్రవాహాన్ని దెబ్బతీయడమే కాకుండా సేవింగ్స్‌ను ఆవిరి చేస్తాయి. మహమ్మారి విజృంభించిన ఈ కాలంలో తక్కువ బీమా మొత్తం ఏ మాత్రం సరిపోదు.


వయసును బట్టి బీమా
వయసును బట్టి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. పిల్లలు సాధారణంగా ఎక్కువ గాయపడుతుంటారు. ఉద్యోగస్థులు, బయటతిరిగేవారికి రోడ్డుపై ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువుంటుంది! వయసు పైబడిన వారికి దీర్ఘకాలిక, ఇతర జబ్బులు ఉంటాయి. ఈ అవసరాలన్నీ కవర్‌ చేసే కాంబినేషన్‌ పాలసీలు తీసుకోవాలి. ఏ ఒక్కదానిపైనో ఆధారపడకూడదు. ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌, ఉద్యోగ గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, తల్లిదండ్రుల కోసం వ్యక్తిగత బీమా తీసుకోవడం మేలు. రూ.10 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్‌కు అదనంగా టాపప్‌ తీసుకుంటే రూ.కోటి వరకు బీమా కవరేజీ పొందొచ్చు.


తల్లిదండ్రులకు వ్యక్తిగత బీమా
మీ తల్లిదండ్రులకూ మీతో కలిపి ఆరోగ్య బీమా తీసుకోవడం పొరపాటే అవుతుంది! ఎందుకంటే బీమా ప్రీమియాన్ని కుటుంబంలోని పెద్దవారి వయసు ఆధారంగా లెక్కిస్తారు. ఆ పెద్ద వయస్కుడు త్వరగా గరిష్ఠ వయసుకు చేరుకుంటాడు కాబట్టి పాలసీ కూడా మురిగిపోతుంది. అందుకే 60 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేకంగా వ్యక్తిగత ఆరోగ్య బీమా తీసుకోవాలి. అందులో అత్యవసర వైద్య పరిస్థితులు, ముందు జాగ్రత్త చెకప్స్‌, ఆస్పత్రుల్లో చేరిక, ఆస్పత్రుల్లో చేరడానికి ముందు, తర్వాత కేరింగ్‌, అంబులెన్స్‌ ఛార్జీలు కవర్‌ అయ్యేలా సగటున రూ.10లక్షల వరకు బీమా తీసుకోవాలి. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ ఉండేలా చూసుకోవాలి.


ఉద్యోగ బీమాతో ప్రయోజనం
సాధారణంగా ఉద్యోగి ఆరోగ్య గ్రూప్‌ ఇన్సూరెన్స్‌లు తక్కువ ధరకే వస్తాయి. ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబ సభ్యులందరికీ కవరేజీ లభిస్తుంది. నగదు రహిత పద్ధతిలో దీనిని ఉపయోగించుకోవచ్చు. బీమా తీసుకున్న తొలిరోజు నుంచే కాన్పు ఖర్చులు ఇస్తారు. ఇందులో వెయిటింగ్‌ పిరియడ్‌ కూడా ఉండదు. వైద్యం ఖర్చులకు ఈ పాలసీ అనువుగా ఉంటుంది. చిన్నచిన్న వైద్య ఖర్చులూ కవర్‌ అవుతాయి.


Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?


Also Read: Digital Payment Incentive: ఈ డెబిట్‌ కార్డుతో చెల్లింపులు చేస్తే రూ.1300 కోట్ల బహుమతులు.. కేబినెట్‌ ఆమోదం!


Also Read: Multibagger Stocks: 5 ఏళ్లు.. 10 స్టాక్స్‌.. రూ.10 లక్షలు పెట్టుబడి.. రూ.1.7 కోట్ల లాభం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి