Gold Bullion Exchange: బంగారం..! ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహం! ఖరీదు ఎక్కువ కావడంతో మార్కెట్లో రకరకాల మోసాలు జరుగుతుంటాయి. పన్నులు ఎక్కువ విధిస్తుండటంతో అక్రమ రవాణా జరుగుతోంది. అందుకే పుత్తడి లావాదేవీల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనూహ్య చర్యలు తీసుకుంది. భారత్‌లో తొలి అంతర్జాతీయ బులియన్‌ ఎక్స్‌ఛేంజీ  (International Bullion Exchange)ని ఆరంభించింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది మనమే అన్న సంగతి తెలిసిందే.


గిఫ్ట్‌ సిటీలో!


గుజరాత్‌లోని గిఫ్ట్‌సిటీలో ఇండియా ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్‌ఛేంజీ (IIBX) స్థాపించారు. దీంతో దేశంలో బంగారం ప్రామాణిక ధరలను నిర్ణయించేందుకు ఇది ఉపయోగపడుంది. ఫలితంగా చిన్న తరహా బులియన్‌ ట్రేడర్లు, నగల వ్యాపారులు లావాదేవీలు సాగించేందుకు సులభంగా ఉంటుంది. 'బులియన్‌ ఎక్స్‌ఛేంజీ ఆవిష్కరణతో బంగారం ధరలను మరింత మెరుగ్గా బేరమాడొచ్చు' అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.


Also Read: జీరో బ్యాలెన్స్‌ ఉన్నా బ్యాంకు అకౌంట్‌ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు తెలుసా!


Also Read: రూపాయి ఒక్క రోజే 49 పైసలు లాభం! 17K దాటేసిన నిఫ్టీ! ఇన్వెస్టర్ల దిల్‌ఖుష్‌!


సులభంగా కొనుగోళ్లు


ఆర్థిక లోటు పెరుగుతుండటంతో దేశంలో బంగారంపై ఎక్కువ నియంత్రణ ఉంది. ఆర్బీఐ ఆమోదించిన బ్యాంకులు, ఏజెన్సీలు మాత్రమే పుత్తడిని దిగుమతి చేసుకొనేందుకు, డీలర్లకు విక్రయించేందుకు అనుమతి ఉంది. 'ఐఐబీఎక్స్‌ అధునాతన సాంకేతికతో పరిష్కారాలు అందిస్తుంది. భారత బులియన్‌ మార్కెట్‌ను మరింత సంఘటితం చేస్తుంది. అర్హత పొందిన వ్యక్తులు నేరుగా ఎక్స్‌ఛేంజీ మెకానిజం ద్వారా బంగారం దిగుమతి చేసుకొనేందుకు అవకాశం దొరుకుతుంది' అని ఎక్స్చేంజీ వర్గాలు పేర్కొన్నాయి.


చైనాలో ముందే!


ప్రపంచంలో ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశం చైనా. అక్కడా ఇలాంటి ఎక్స్‌ఛేంజీ ఉంది. స్థానికంగా ఉత్పత్తి, దిగుమతులు, కొనుగోళ్లు, అమ్మకాలు అక్కడే జరుగుతాయి. డ్రాగన్‌ తర్వాత భారతే ఎక్కువ పుత్తిడి దిగుమతి చేసుకుంటుంది. 2021లో ఏకంగా 1069 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంది. అంతకు ముందు ఏడాది ఇది కేవలం 430 టన్నులే కావడం గమనార్హం. ఇప్పటికే దేశంలో ఎంసీఎక్స్‌, ఎన్‌సీడీఈఎక్స్‌లు గోల్డ్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులు ఆఫర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.