Zero Balance Money Withdrawal: మనం ఎంత సంపాదిస్తున్నా ఒక్కోసారి నగదు కొరత ఎదుర్కోక తప్పదు. సాయం చేసేవారూ కనిపించరు. మనకు అవసరమైన స్వల్ప మొత్తానికి బ్యాంకు నుంచి లోన్‌ తీసుకోలేం! బ్యాంకు ఖాతాలో చిల్లిగవ్వ లేదు! అలాంటప్పుడు ఆపద్భాందవుడిలా ఆదుకుంటుంది ఓవర్‌ డ్రాఫ్ట్‌ (OD Fecility)! అకౌంట్లో ఒక్క రూపాయి లేకున్నా ఈ సౌకర్యంతో అవసరమైన డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.


ఓడీ రెండు రకాలు!


మీ బ్యాంకు ఖాతాలో ఒక్క రూపాయి లేకున్నా ఓవర్‌ డ్రాఫ్ట్‌ (Over Draft) సౌకర్యంతో డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. సెక్యూర్డ్‌, అన్‌సెక్యూర్డ్‌ రుణాల రూపంలో ఓడీ డబ్బు సాయం చేస్తుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను తనఖా పెట్టుకొని ఇచ్చే రుణాన్ని సెక్యూర్డ్‌గా భావిస్తారు. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఓడీ ఫెసిలిటీ అందిస్తున్నాయి. మీ ఆదాయం, క్రెడిట్‌ స్కోరు, బ్యాంకుతో అనుబంధాన్ని బట్టి వడ్డీని నిర్ణయిస్తారు. నిర్దేశిత కాలపరిమితి లోగా తిరిగి సొమ్ము చెల్లించాలి.



వీటిపై సెక్యూర్డ్‌!


ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, జీవిత బీమా పాలసీ (Life Insurance), ఆస్తుల తనఖా, సెక్యూరిటీలు, బంగారం పైనా ఓవర్‌డ్రాఫ్ట్‌ను ఉపయోగించుకోవచ్చు. మీరు తనఖా పెట్టిన సెక్యూరిటీని బట్టి వడ్డీ నిష్పత్తి ఉంటుంది. ఎఫ్‌డీపై తీసుకొనే ఓడీపై 100-200 బేసిస్‌ పాయింట్లు వడ్డీ తీసుకుంటారు. ముందుగా నిర్ణయించిన రేటుకే వడ్డీని నిర్ణయిస్తారు. రోజువారీగా లెక్కించి నెలకోసారి డెబిట్‌ చేస్తారు.


వడ్డీ లెక్కింపు!


ఉదాహరణకు బ్యాంకులో మీకు 10 శాతం వడ్డీతో రూ.లక్ష ఎఫ్‌డీ ఉందనుకుందాం. ఓడీ కింద రూ.10వేలు విత్‌డ్రా చేసి 20 రోజుల తర్వాత జమ చేశారనుకుందాం. అప్పుడు బ్యాంకు మీకు రూ.54.8 వడ్డీ ((10% of Rs.10000) x 20/365) వేస్తుంది. ఒకవేళ మీరు ముందుగానే డబ్బు చెల్లిస్తే ప్రీ పేమెంట్‌ రుసుములేవీ తీసుకోరు. ఈఎంఐ మాదిరిగా కనీస మొత్తం చెల్లించాల్సిన పన్లేదు.


రుసుములు ఏంటి?


ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలకు బ్యాంకులను బట్టి రుసుములు ఉంటాయి. ఎఫ్‌డీపై ఓడీ తీసుకుంటే సాధారణంగా ప్రాసెసింగ్‌ ఫీజు ఉండదు. జీవిత బీమా, కేవీపీ, ఎన్‌ఎస్‌సీ వంటి సెక్యూరిటీలపై తీసుకుంటే 0.1 నుంచి 1 శాతం వరకు ప్రాసెసింగ్‌ ఫీజు తీసుకుంటారు ప్లెడ్జ్‌ క్రియేషన్‌, డీప్లెడ్జ్‌, స్టాంప్‌ డ్యూటీ వంటి రుసుములూ తీసుకోవచ్చు. సాధారణంగా ఓడీ సౌకర్యం సేవింగ్స్‌, కరెంటు అకౌంట్లకు అనుసంధానమై ఉంటాయి. ఎప్పుడైనా మీ ఖాతాలోని సొమ్ముకన్నా ఎక్కువ విత్‌డ్రా చేస్తే ఆటోమేటిక్‌గా ఓడీగా మారుతుంది. ఆ తర్వాత మీరు ఖాతాలో డబ్బు జమ చేస్తే ముందుగా లోటును భర్తీ చేసుకొని మిగతాది ఖాతాలో జమ అవుతుంది.


Also Read: మీ పీఎఫ్‌ వడ్డీపై పన్ను కట్టాలని తెలుసా!