ITR Filing EPF: ఐటీఆర్ ఫైలింగ్ తుది గడువు సమీపిస్తోంది. ఆదాయపన్ను వెబ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో చాలామంది ఇంకా రిటర్నులు సమర్పించలేదు. దీనికి తోడు ఈపీఎఫ్ వడ్డీపై పన్నును ఎలా లెక్కించాలో తెలియక మరికొందరు సందిగ్ధావస్థలో పడ్డారు. ఎందుకంటే?
రూ.2.5 లక్షలు దాటితే పన్ను!
ఉద్యోగ భవిష్య నిధి (EPF) నిబంధనల ప్రకారం ఉద్యోగి, యజమాని వేర్వేరుగా 12 శాతం వరకు ప్రావిడెంట్ ఫండ్‌లో (Provident Fund) జమ చేస్తారు. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 10 (12) ప్రకారం గతంలో పీఎఫ్ వడ్డీపై (PF interest) పూర్తి మినహాయింపు ఉండేది. 2021 బడ్జెట్‌లో దీనిని సవరించారు. ఒక ఆర్థిక ఏడాదిలో ఉద్యోగి కంట్రిబ్యూషన్ రూ.2.5 లక్షలు దాటితే ఆ పీఎఫ్ వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వనరుల ద్వారా పొందుతున్న ఆదాయంగా దీనిని పరిగణనలోకి తీసుకుంటారు.
లెక్కించడంపై గందరగోళం!
పీఎఫ్ వడ్డీపై పన్నును (Taxable PF) ఎలా లెక్కించాలో 2021, ఆగస్టు 31న సీబీటీడీ కొత్త నిబంధనను నోటిఫై చేసింది. దీని ప్రకారం పన్ను వర్తించే, వర్తించని పీఎఫ్ ఖాతాలను వేర్వేరుగా నిర్వహించాలి. అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి కంట్రిబ్యూషన్ రూ.2.5 లక్షలు దాటాలి. ఇలాంటి ఖాతాల నుంచి వడ్డీ డబ్బును విత్‌డ్రా చేసినా పన్ను మినహాయింపేమీ ఉండదు. ఈపీఎఫ్‌తో ప్రైవేటు ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులూ దీనిని తప్పకుండా పాటించాలి. పన్ను లెక్కింపు విధానంపై స్పష్టత ఇచ్చినా కొన్ని అంశాల్లో మాత్రం సందిగ్ధం నెలకొంది.
ఏ ప్రాతిపదికన లెక్కించాలి?
ఉదాహరణకు ఒక ఉద్యోగి మధ్యలోనే ఉద్యోగం మానేస్తే ఏం చేయాలి? మానేసిన సమయానికి పన్ను లెక్కించాలా లేదంటే ఏడాది ప్రాతిపదికన లెక్కించాలా అర్థమవ్వడం లేదు. టీడీఎస్ డిడక్టు చేయడం పైనా కన్ఫ్యూషన్ ఉంది. దీంతో 2022, ఏప్రిల్ 5న ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. వడ్డీ క్రెడిట్ లేదా చెల్లించడంలో ఏదీ ముందు జరుగుతుందో దానిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే 2021-22 ఏడాదికి గాను ఈపీఎఫ్ ఇంకా వడ్డీని జమ చేయలేదు. అందుకే ఐటీఆర్ ఫైల్ చేయడంపై చాలామందిలో గందరగోళం నెలకొంది.
Also Read: హ్యాపీ న్యూస్! వీళ్లు ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేసినా పెనాల్టీ ఉండదు!
Also Read: తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా! ఈ సింపుల్ ప్రాసెస్‌తో కన్‌ఫ్యూషన్ ఉండదు!